ఈ జాతరకు శతాబ్దాల చరిత్ర

by Ravi |   (  Updated:2025-02-15 01:00:35  IST  )

తెలంగాణలో అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు లింగన్న జాతర. పేరుకే ఇది గొల్లగట్టు జాతర కానీ ఇది యావత్ భారతీయ బహుజన జాతర.

ఈ జాతరకు శతాబ్దాల చరిత్ర
X

తెలంగాణలో అతిపెద్ద రెండో జాతర పెద్దగట్టు లింగన్న జాతర. పేరుకే ఇది గొల్లగట్టు జాతర కానీ ఇది యావత్ భారతీయ బహుజన జాతర. సూర్యాపేటకు కూతవేటు దూరంలో ఉండే దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకి శతాబ్దాల చరిత్ర ఉన్నది. వందలయేండ్ల కింద తన జాతి ఉనికిని, తమవారి పశుసంపదను కౄరమృగాల నుండి, ఇతర తెగల నుండి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర..అలాంటి ఒక వీరుడు లింగమంతులు.

ఈయన మీద ఎన్నో మౌఖికమైన కథలు, కథనాలు, కథాగానాలు వందలయేండ్లుగా జనం నాల్కలపైన నేటికీ మెదులుతూనే ఉన్నాయి. వీరుల ధీరత్వాన్ని కొనియాడే కాలక్రమంలో ఇది కాస్త ఆధ్యాత్మిక ధోరణిని జత చేసుకోవడం ఈ భూమిపైన ఆ తర్వాతి తరాలకు పరిపాటిగా పరిఢవిల్లుతుంది.

ఐదు రోజుల జాతరలో..

మన రాష్ట్రంలో సమ్మక్క- సారలమ్మ వంటి మహ జాతరలు ఈ కోవకు చెందినదే. అచ్చం ఇదే కోవలోకి వచ్చే చరిత్రాత్మక నేపథ్యం గొల్ల గట్టు లింగన్న స్వామి జాతర. ఓ..లింగా..! హో...లింగా.. అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదురోజులపాటు సాగుతుందీ జాతర. యాదవుల కుల ప్రధాన దేవుళ్ళల్లో ప్రాముఖ్యత కల్గిన ఒకడిగా వర్ధిల్లున్నప్పటికి పెద్దగట్టు జాతర చుట్టుపక్కల ఐదారు రాష్ట్రాల నుండి వచ్చే బహుజన భక్తులతో కిక్కిరిసి పోతుంది. జాతరకు పదిహేను రోజుల ముందు సాగే దిష్టి పూజ అనంతరమే జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుండటం ఆచారపు పరిపాటి. పేరుకే తెలంగాణ రెండో అతిపెద్ద జాతరగా జనం నానుడిలో ఉండిపోయిన ఈ జాతర క్రమంగా అంతరిస్తూ తన జాతర సొగబులను, అస్థిత్వాన్ని కోల్పోతున్నట్లుగానే కన్పిస్తుంది. ఇందుకు సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన ఎన్నో బలమైన కారణాలు కన్పిస్తున్నాయి.

పట్టు కోల్పోతున్న యాదవులు..

భారతీయ ఉత్పత్తి కులాల్లో గొల్లలు ఒకరు. మానవ సమాజానికి పశుపోషణ మొదలు వ్యవసాయ రంగానికి తోడ్పడుతూ పాలు, పెరుగు, ఉన్ని, మాంసపు ఉత్పత్తులు వీరి వృత్తిలోని భాగం. పైగా సామాజిక, సాంస్కృతిక, జానపద కళారూపాల పరంగా ఎంతో చరిత్రను కల్గివున్నటువంటి కులాల్లో ఒకటి. ఇలాంటి అస్థిత్వాన్ని సొంతం చేసుకున్న యాదవ కుల అశ్రిత సమూహాలకు తమ యుగ పురుషులను కీర్తించుకోవడం, పూజించుకునే నేపథ్యంలో క్రమంగా తమ పట్టును కోల్పోతున్నారనే బాధ లేకపోలేదు. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ పెద్ద గట్టు జాతరనే.

శాశ్వత జీత భత్యాలు లేపు

పెద్దగట్టు జాతరలో కేసారం గ్రామానికి చెందిన గొల్ల హక్కుదారులైన మున్న, మెంత బోయిన, గొర్ల వంశస్థులు క్రియాశీలకంగా వ్యవహరించినప్పటికి అదే విధంగా గొల్లల అశ్రిత కులమైన బై కానీ వారు జాతరకు ఆది-అంతం పూజారులుగా వ్యవహరించినప్పటికి ఇప్పటివరకు వీళ్ళకు జాతరలో వచ్చే ఆదాయంలో ఎలాంటి భాగస్వామ్యం లేకపోవడం విచారకరం. ప్రతీయేటా ఐదురోజుల పాటు సాగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి పోతుంటారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రతీసారి జాతర సమయంలో కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నప్పటికీ గట్టు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి నామమాత్రమేననీ ఇక్కడ నేటికీ శాశ్వత టాయిలెట్లు, రోడ్లు, మంచినీటి కుళాయిలు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం లేదని అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డా. పోతరవేణి తిరుపతి వంటి మేధావి వర్గం తమ కులం తరపున ఎన్నో ప్రతిప్రాదనలను ప్రభుత్వానికి అందజేశారు. ఇదే కాకుండా సమ్మక్క-సారలక్క జాతరలో వచ్చే రాబడిలో అక్కడి ఆదివాసీ పూజారి వంశస్థులకు ముప్పై శాతం వాటాను ఇస్తున్ననట్లుగానే పెద్దగట్టు జాతరలో భాగస్వాములైన వారికి కూడా శాశ్వత జీత భత్యాలతో పాటుగా వాటాదారుగా ప్రకటించాలనేది యాదవుల, వీరి ఆశ్రిత కులాల డిమాండ్.

నిధుల గోల్ మాల్

జాతర సమయంలో ఆ తర్వాత భక్తుల మొక్కుబడుల సమయంలో ఇక్కడ వచ్చే కట్నకానుకలు, చందాలకు, ప్రభుత్వ నిధులు సహితం గోల్‌మా‌ల్ జరుగుతోందని పలుమార్లు వివిధ పత్రికల్లో రావడం జరిగింది. ఇక్కడ అవినీతికి అడ్డుకట్టలు వేయాలనీ పెద్దగట్టుకు సంబంధించిన సుమారు యాభై ఐదు ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా చూడాలని, పెద్దగట్టు అభివృద్ధికి, చరిత్ర పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని రాజకీయ ఒత్తిడి ఉండకూడదని పలు దఫాలుగా యాదవ సామాజిక, అశ్రీత కుల సమూహాలు ప్రతిపాదనలు చేస్తూనే ఉన్నాయి.

(పెద్దగట్టు జాతర సందర్భంగా)

- వరకుమార్ గుండెపంగు

99485 41711

Next Story