గ్లోబల్ వాచ్.. అడుగు దూరంలో ప్రపంచయుద్ధం!?

by Bhoopathi Nagaiah |

‘మూడో ప్రపంచయుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో తెలియదు.. కానీ నాలుగో యుద్ధం మాత్రం కచ్చితంగా రాళ్లు, కర్రలతోనే జరుగుతుంది’

గ్లోబల్ వాచ్.. అడుగు దూరంలో ప్రపంచయుద్ధం!?
X

‘మూడో ప్రపంచయుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో తెలియదు.. కానీ నాలుగో యుద్ధం మాత్రం కచ్చితంగా రాళ్లు, కర్రలతోనే జరుగుతుంది’ అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మానవ నాగరికత పూర్తిగా కుప్పకూలుతుందని నాటి పరిణామాలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి తాజాగా మారుతున్న సమీకరణాలు పరిశీలిస్తే.. మూడో ప్రపంచయుద్ధానికి ముహూర్తం అతి తొందరలోనే ఖరారు కాబోతున్నదని ప్రస్తుతం మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు కళ్లకు కట్టినట్టు చెప్తున్నాయి.

అసలు ప్రపంచదేశాలన్నీ ద్రవ్యోల్బణం, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటుంటే యుద్ధాల మాటెలా వస్తుందని చాలామంది అనుకోవచ్చు. కానీ, భౌగోళిక రాజకీయాలే దేశాలకు అన్నింటికంటే ముఖ్యం. ఈ విషయంలో ఏ దేశం కూడా రాజీపడదు. అందుకే ప్రపంచదేశాల రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏ దేశ అధినేత ఎటు కదిలినా, విదేశీ వ్యవహారాల శాఖల మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారులు, మిలిటరీ అధిపతులు ఏ దేశానికి వెళ్తున్నా ప్రపంచదేశాలన్నీ కుర్చీ అంచున కూర్చుని గమనిస్తున్నాయి.

చమురు నిల్వలపై అమెరికన్ డేగ

ఇప్పుడు వెనిజులా, తైవాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన, ఆసక్తికర అంశాలుగా మారాయి. వెనిజులా విషయంలో అమెరికా ఆర్థిక ప్రయోజనాలు బోలెడు కనిపిస్తున్నాయి. ఆ దేశాన్ని అదుపులో పెట్టుకుంటే ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు అమెరికా సొంతం అవుతాయి. దీనితోపాటు ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఆయువుపట్టు అయిన కోల్టాన్ ముడిసరుకు గనులతోపాటు 8వేల టన్నులకుపైగా బంగారు నిక్షేపాలు కూడా బోనస్‌గా అందుతాయి. అయితే, అమెరికాకు సమీపంలో రష్యాకు అనుకూలంగా ఉన్న ఏకైక దేశం వెనిజులా.. మరి ఆ దేశంపై అమెరికా కత్తి కడితే ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. పైగా దీనిని ఓ అవకాశంగా తీసుకుంటుంది. ఉక్రెయిన్‌ను తనపైకి అమెరికా ఎలా అయితే ఉసిగొల్పిందో.. ఇప్పుడు రష్యా కూడా అదే పని చేయబోతున్నది. అయితే, అమెరికాకు మాత్రమే ప్రయోజనం కలిగే ఈ విషయంలో ఏ దేశం కూడా జోక్యం చేసుకునేందుకు సిద్ధంగాలేదు. కానీ, వెనిజులాకు మద్దతుగా రష్యా, చైనాలు కచ్చితంగా రంగంలోకి దిగుతాయి. మరి ఆ దేశాలను అడ్డుకోవడానికి అమెరికా నేరుగా తలపడే తెలివి తక్కువ పనిచేస్తుందా? అస్సలు చేయదు? కానీ, వాటిని ఇరుకనపెట్టేందుకు తన చేతికి మట్టిని అంటుకోకుండా మిత్రదేశాలతో కట్టడిచేసేందుకు సిద్ధమైంది. అందుకే తైవాన్‌లో ఎప్పటినుంచో రగులుతున్న అగ్గిని మరింత రాజేస్తున్నది.

చైనా వ్యతిరేక తైవాన్ రాజకీయం

చైనా, జపాన్ మధ్యలో ఉన్న దేశమే తైవాన్. దీనిని దేశమంటే చైనా ఒప్పుకోదు. చైనా వాదనను మిగితా ప్రపంచం ఒప్పుకోదు. తైవాన్‌ని ఎట్టిపరిస్థితుల్లోనూ చైనా ఆధిపత్యంలోకి వెళ్లకుండా అగ్రదేశాలు అన్ని మూకుమ్మడిగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశంలోని సెమీ కండక్టర్ పరిశ్రమ. తైవాన్ నుంచి ఇవి రావడం ఆగిపోతే.. ఫ్యాక్టరీలే కాదు, చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలే కుంటుపడతాయి. అందుకే ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా సహా ప్రధాన దేశాలన్నీ తైవాన్‌కు రక్షణగా నిలుస్తు్న్నాయి. నిజానికి జపాన్‌పై అణుబాంబు వేశాక.. ఆ దేశంలో సైన్యం అసలే ఉండకూడదని ఆజ్ఞాపించిన అమెరికా.. చైనా, ఉత్తర కొరియా ఎదుగుతున్న తీరును గమనించి.. దగ్గరుండి సైన్యాన్ని సిద్ధం చేయడంతోపాటు అత్యాధునిక ఆయుధాలు అందజేసింది. ఇప్పుడు తైవాన్‌కు 100కిలోమీటర్ల దూరంలో ఉన్న దీవిలో జపాన్ లక్షమంది సైన్యాన్ని మోహరించి.. చైనాకు సవాల్ చేస్తున్నది. ఈ విషయంలో చైనాకు సైనికపరంగా పూర్తి సాయం చేస్తామని రష్యా ప్రకటించింది.

వెనిజులా, తైవాన్ లింకు

ఈ రెండింటికీ నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. వీటిని సున్నితమైన విషయంగా మార్చుతున్నది అమెరికా. అంటే వెనిజులాపై అమెరికా యుద్ధం లేదా అధ్యక్ష మార్పుకు బలప్రయోగం చేస్తే, వెంటనే రష్యా, చైనా రంగంలోకి దిగుతాయి. వీటికి చెక్ పెట్టాలంటే తైవాన్ సమస్యను అంతర్జాతీయం చేయాలి. అందుకే తన మిత్రదేశం జపాన్‌తో చైనాను కవ్విస్తున్నది. ఈ పరిస్థితుల్లో చైనా యుద్ధానికి ముందుకురాలేకపోయినా.. వెనిజులా సమస్యలో వేలుపెట్టదు. రష్యా కూడా అదే ఇరకాటంలో పడుతుంది. అంతిమంగా అమెరికా తైవాన్‌ సమస్యను అడ్డుపెట్టుకుని అంతర్జాతీయ దేశాలను ముందుకు తెస్తుంది. చైనా, రష్యాలను కట్టడి చేస్తుంది.. ఆ తర్వాత వెనిజులాపై తన దండయాత్రను యథేచ్ఛగా కొనసాగించేందుకు అవకాశం అందుకుంటుంది. ఇదీ అమెరికా ఆడుతున్న చదరంగం. అయితే, ఇదంతా ఒకవైపు నుంచి కనిపిస్తున్న దృక్కోణం మరి రష్యా, చైనాలు అమెరికా ఎత్తులను ఎదుర్కొంటాయా? లేకపోతే ఆ ఉచ్చులో చిక్కుకుంటాయా? అసలే చదరంగం ఆటలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన రష్యా.. అమెరికా ఎత్తులను ఎలా ఎదుర్కొనబోతున్నది? అన్నది వేచిచూడాలి.

అతి పెద్ద యుద్ధం అనివార్యమేనా?

అయితే, వెనిజులాపై ఎవరికి పట్టు దక్కుతుందో.. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాల్లో వారిదే పెత్తనం అన్నది మాత్రం వాస్తవం. అదేసమయంలో అమెరికాకు ఎంత పెద్ద నిఘా నెట్ వర్క్ ఉన్నా.. అన్ని ఆ దేశం అనుకున్నట్టుగానే జరుగుతాయా? కచ్చితంగా చెప్పలేం.. కొన్నిసార్లు బెడిసికొట్టవచ్చు. రెండో ప్రపంచయుద్ధానికి కూడా కొన్ని దుందుడుకు చర్యలే కారణమయ్యాయి. ఇప్పుడు కూడా ఏదైనా ఒక్క పొరపాటు జరిగినా దేశాలన్నీ జట్లుగా విడిపోయి మరో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఇక్కడే ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ డిసెంబర్ 1న ఎక్స్‌లో ఓ కామెంట్ చేశారు ‘వచ్చే ఐదు, పదేళ్లలో ప్రపంచం అతి పెద్ద యుద్ధాన్ని అనివార్యంగా ఎదుర్కోబోతున్నది.’ అని పేర్కొన్నారు. దీనికి ఆధారాలు ఏమిటి? ఎందుకు ఈ కామెంట్ చేశారని స్పష్టంగా పేర్కొనకపోయినా.. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ కారణాలేనని అర్థమవుతున్నది.

హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story