గ్లోబల్ వాచ్ : ఇరాన్ యుద్ధం.. ఎవరికి లాభం!

by Bhoopathi Nagaiah |

నేడు జెనీవాలో జరిగే మూడో రౌండ్ బహుశా చివరి దశ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు తెగబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

గ్లోబల్ వాచ్ : ఇరాన్ యుద్ధం.. ఎవరికి లాభం!
X

రాన్‌పై యుద్ధ ఘంటికలు మోగనున్నాయి. గురువారం (ఫిబ్రవరి 26న) జెనీవాలో జరిగే మూడో రౌండ్ బహుశా చివరి దశ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులకు తెగబడే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇరాన్‌లో ప్రజల ఆకాంక్షలకు అక్కడి ప్రభుత్వం అనుగుణంగా పనిచేయడం లేదని నియంతృత్వం పెరిగిందని.. అందుకే రంగంలోకి దిగామని అమెరికా చెప్తున్నది. రష్యా, చైనాలు మాత్రం ఇరాన్ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడం సరైంది కాదని.. అమెరికా తీరును అడ్డుకుంటామని ప్రకటించాయి. ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. ఒకవేళ యుద్ధం వస్తే, ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా అమెరికాను వెనక్కి నెట్టవచ్చని ఆ దేశ సైన్యం ప్లాన్. ఇలా ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. మరి తెర వెనుక జరిగే అసలు నిజాలు ఏంటి?

స్వప్రయోజనాలే కారణం..

‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అన్న కొటేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో అందరికీ తెలుసు. ఇదే విషయం ఇరాన్ విషయంలోనూ జరుగుతున్నది. అమెరికాకు డబ్బులు రావాలి. ఆ దేశంలో ఐటీ సేవలు మినహా మరే వస్తువు ఉత్పత్తి కాదు.. వెనిజులాలోని చమురు మాత్రం అమెరికాలో కాసులు కురిపించేందుకు సిద్ధంగా ఉన్నది. కానీ మార్కెట్ అంతా అరబ్ దేశాలవైపే సుముఖంగా ఉన్నది. మరి ప్రపంచదేశాలకు వెనిజులా చమురు అంటగట్టాలంటే ఏం చేయాలి? ఇక్కడే అగ్రరాజ్యాల కుటిలనీతి చాపకిందనీరులా వ్యాపిస్తుంది. అరబ్ దేశాలనుంచి వస్తున్న చమురుకు అడ్డుకట్ట వేస్తే.. ప్రస్తుతం 92 డాలర్లు ఉన్న బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరుతుంది.

ప్రపంచదేశాలకు చమురు ఊపిరితో సమానం.. చమురు ధరలు పెరిగితే దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. ఇప్పటివరకు అమెరికా చేతిలో చమురు లేదు కాబట్టి రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నా.. ఏమిచేయలేకపోయింది. కానీ చేతిలో వెనిజులా ఉన్నాక మెజారిటీ దేశాలు రష్యాకన్నా వెనిజులా చమురుకే ప్రాధాన్యం ఇస్తాయి. ఈ కోణంనుంచి ఆలోచిస్తే ఇరాన్‌పై యుద్ధం అమెరికాకు బిలియన్ల డాలర్లను కురిపించనున్నది. మరి రష్యా కేవలం స్నేహం కోసమే ఇరాన్‌ను కాపాడాలని అనుకుంటుందా? అంటే లేదనే చెప్పాలి. ఈ యుద్ధాన్ని రష్యా కూడా తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నది. నిజానికి ఇరాన్ నుంచి వచ్చే చమురును 90శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. అమెరికా దాడితో ఆ లింక్ కట్ అయితే, రష్యాకు అత్యంత లాభదాయకం. చైనాకు వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో రష్యా ఆయిల్ పైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇది రష్యాకు కూడా వ్యూహాత్మక లాభమే. అందుకే ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని పైకి ఖండిస్తున్నా.. లోలోన ఎప్పుడు దాడి జరుగుతుందా? అని వేచి చూస్తున్నది.

అరబ్ దేశాల మాటేమిటి?

బాంబు దాడి జరిగిన మరుక్షణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తుంది. కానీ, అరబ్ దేశాల్లోని చమురు అంతా ఈ మార్గం గుండానే ప్రపంచానికి సరఫరా అవుతుంది. కాబట్టి ఆ దేశాలకు ఇది పెద్ద దెబ్బ. కానీ, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలకు మినహాయింపు. ఎందుకంటే ఈ రెండు దేశాలు ప్రత్యామ్నాయంగా పైప్ లైన్ అభివృద్ధి చేసుకున్నాయి. సౌదీ ఒక్కటే 50 లక్షల బ్యారెళ్లను తరలించే అవకాశం ఉండగా.. యూఏఈనుంచి 17లక్షల బ్యారెళ్ల చమురును తరలించవచ్చు. అయితే, యూరప్‌కు చమురుతోపాటు సహజవాయువు అవసరం ఎక్కువ. అమెరికాతోపాటు ఇజ్రాయెల్ సహజవాయువు ఆ అవసరాలను తీర్చే స్థితిలో ఉన్నాయి. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉన్నది. వెనిజులాలో చమురును వెలికితీస్తున్న సంస్థ చెవ్రాన్, అదే సంస్థ ఇజ్రాయెల్‌లోనూ పనిచేస్తున్నది. ఈ సంస్థ ఎంత శక్తిమంతమైనదంటే ఇందులో బోర్డు సభ్యులుగా పనిచేసినవాళ్లు చాలామంది అమెరికా ప్రభుత్వాల్లో కీలకమైన స్థానాల్లో ఉంటారు. ఉదాహరణకు కండోలిజా రైస్ ఆమెకూడా ఈ కంపెనీలో బోర్డు సభ్యురాలిగా పనిచేయడం గమనార్హం.

భారత్ పరిస్థితి ఏంటి?

రష్యానుంచి ఆయిల్ తగ్గించిన నేపథ్యంలో భారత్ అరబ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. రోజుకు దాదాపు 30లక్షల బ్యారెళ్ల చమురు హర్ముజ్ కెనాల్ నుంచే వస్తున్నది. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలను ముందుగానే గమనించిన భారత్.. వెనిజులాలోని ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. మొదటి కన్‌సైన్‌మెంట్ బుధవారమే అంటే (ఫిబ్రవరి 25న) 20 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌తో నిండిన నౌకలు ఇండియాకు రవాణా బయలుదేరాయి.

జెనీవాలో ఈ అంశాలపైనే చర్చ

జెనీవాలో గురువారం (ఫిబ్రవరి 26న) జరుగబోయే అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఈ క్రింది అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని 60% నుండి ఒక నిర్ణీత స్థాయికి (20% లేదా అంతకంటే తక్కువ) తగ్గించాలి. అణు కేంద్రాలను (ఫార్డో, నాతాంజ్) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారులు నేరుగా తనిఖీ చేయడానికి అనుమతించాలి. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌లో ఖొమేనీ స్థానంలో మరొకరిని నియమించాలని, న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తు్న్నది. సౌదీ, ఇతర అరబ్ దేశాలు హర్ముజ్ జలసంధిలో చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకోవద్దని, మిస్సైళ్ల రేంజ్ ని 500 కి.మీ.నుంచి 300 కి.మీలకు తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి బదులుగా, అమెరికా దాని మిత్రదేశాలు ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతిమంగా యుద్ధం ఒక వ్యాపారం. వేలకొద్దీ బాంబులు పడటం, ఇళ్లు నేలమట్టం అవడం టీవీల్లో మనకు కళ్లముందు కనిపిస్తున్నా.. తెరవెనుక మాత్రం చాలామందికి అది డాలర్లు కురిసే వర్షం. అది సామాన్యుడి ఎప్పటికీ అర్థం కాని యథార్థం.

హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story