బిలియనీర్లను పెంచిన సరళీకరణ

by Ravi |   (  Updated:2025-05-07 01:15:55  IST  )

గ్లోబలైజేషన్‌లో సూత్రధారులు పాలకులు అయితే పాత్రధారులు బిలియనీర్లు. ఒక్కొక్కసారి ఇద్దరూ ఒక్కరే కావచ్చు.

బిలియనీర్లను పెంచిన సరళీకరణ
X

గ్లోబలైజేషన్‌లో సూత్రధారులు పాలకులు అయితే పాత్రధారులు బిలియనీర్లు. ఒక్కొక్కసారి ఇద్దరూ ఒక్కరే కావచ్చు. ఎందుకంటే నేడు డెమోక్రసీ ఫ్లూటోక్రసిగా మారింది కదా? నేటి నయా వలస పాలనలో సుంకాల విధింపు కూడా బిలియనీర్ల ఆర్థిక విధానమే. ఆఫ్ సోర్సింగ్ లేదా గ్లోబలైజేషన్‌తో లాభపడిన దేశాలేవి? ఏ వర్గం ప్రజలు ఎక్కువగా లాభపడ్డారు?

ప్రపంచ బ్యాంకు చేపట్టిన నివేదిక ప్రకారం గత 20 సంవత్సరాల కాలంలో ఉన్నత ఆదాయ వర్గాలకు చెందిన ఒక శాతం జనాభా ఆదాయం 60 శాతం పెరగగా అల్పాదాయ వర్గాల కింది భాగాన ఉన్న ఐదు శాతం జనాభా ఆదాయంలో ఒక పైసా కూడా పెరగలేదు.

కొన్ని దేశాలకే వారు పరిమితం కావడంతో..

ఈ 20 సంవత్సరాల కాలంలో వివిధ దేశాలలోని పెట్టుబడిదారులు ఆఫ్ సోర్సింగ్ చేపట్టి అంటే పరిశ్రమలను, సేవలను ఇతర దేశాలకు తరలించి అక్కడ తక్కువ వేతనాలకు దొరికే కార్మికులను చౌక ధరలకు లభించే ముడిసరుకులను ఉపయోగించి వారు గణనీయంగా తమ ఆదాయాలను పెంపొందించుకోగలిగారు. ఇది కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమైనవి. నేడు ప్రపంచంలో మూడు దేశాలలో మాత్రమే ఉన్న బిలియనీర్ల సంపద మొత్తం బిలియనీర్ల సంపదలో 50 శాతంగా ఉంది. ప్రపంచంలో మొత్తం బిలియనీర్లు 3000 మంది. వీరి సంపద విలువ 16.1 ట్రిలియన్ డాలర్లు. ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశంలో మొదటిది అమెరికా కాగా రెండవది చైనా మూడవది మన దేశం. ఇలా బిలియనీర్లు కొన్ని దేశాలకే పరిమితం కావడం వలన ప్రపంచ ప్రజల ఆదాయాలు అవకాశాలలో అసమానతలు పెరిగాయి.

బిలియనీర్ల పెరుగుదలే వృద్ధా..?

లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, LPG విధానాల వలన ప్రపంచమంతా వసుదైక కుటుంబంగా పెట్టుబడులతో ఉద్యోగ కల్పనతో వస్తు ఉత్పత్తులతో గణనీయంగా పెరిగి మానవ శ్రేయస్సుతో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెందిపోతాయని, ముఖ్యంగా వెనుకబడిన దేశాలు అభివృద్ధిలో పెట్టుబడిదారుల దేశాల సరసన సమానంగా అభివృద్ధి చెందుతాయని భావించినారు. అయితే ఈ విధానాల వలన వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల కనుసన్నల్లో తమ ఆర్థిక విధానాలను పెట్టుబడి విధానాలను రూపొందించుకోవాల్సి వస్తుందని, ఇది నయా సామ్రాజ్యవాదం వైపు దారితీస్తుందని గమనించలేక పోయారు. మన పాలకులయితే ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు పనిచేయడం లేదని నష్టాల్లో ఉన్నాయని చెప్పి ఎల్‌పీజీ విధానాలకు పోయారు. ఇప్పుడు ఏమైంది? ఉత్పత్తి రంగం కుదేలైంది. అనేక వస్తువులు అమెరికా నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో నిరుద్యోగిత, మానవ వనరుల విధ్వంసం, సహజ వనరులు పెట్టుబడిదారుల వశం, ఇలా వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారుల కనుసన్నల్లోకి పోయింది. తొందరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అభివృద్ధి చెందుతున్నదనే పాలకులు ఎలా చెబుతున్నారో అర్ధం కావడం లేదు? బిలియనీర్ల పెరుగుదలే దేశ వృద్ధా? ప్రజల ఆదాయాలను గానీ ఉద్యోగితను గానీ పరిగణలోకి తీసుకొనే అవసరం లేదా?

ట్రంప్ బెదిరింపులు, హెచ్చరికలు

మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మన ప్రధాని భేటీలో తేలింది ఏమిటి? మన దేశంతో అమెరికాకు ఉన్న 35 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును (అది మన లాభం) తగ్గించడానికి, వీలైతే తొలగించడానికి మాట్లాడిన ట్రంప్ మాటల తీరును మనం ఎలా అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా గతంలో మనం చేసిన యుద్ధ విమానాల కొనుగోలు ఆయిల్, గ్యాస్ కొనుగోలు, బ్రిక్స్ దేశాలతో ప్రత్యామ్నాయ కరెన్సీ చర్చలు ఇలాంటి మన విధానాల గురించి ట్రంప్ మన ప్రధాన మంత్రితో భేటీలో గుర్తు చేయడం మనకు హెచ్చరికా? లేదా అగ్రరాజ్య ఆధిపత్యానికి సంకేతమా? లిబరలైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వచ్చి ప్రపంచ అభివృద్ధి జరుగుతుందని భావించిన ఇండియా లాంటి దేశాలు పెట్టుబడిదారుల దేశాల కనుసన్నల్లో తమ ఆర్థిక విధానాలు రూపొందించుకొని వెనుకబడిన దేశాలు గానే మిగిలిపోతున్న పరిస్థితి ఇది. ఉదాహరణకు గనులు మినరల్స్ పుష్కలంగా ఉన్నందువల్లే అటు రష్యా ఇటు అమెరికా ఉక్రెయిన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటం. ఈ ఆరాటం ఎల్‌పీజీ విధానాల ఫలితం.

పాతాళంలో ప్రజా శ్రేయస్సు!

భారత్ ప్రపంచ దేశాల్లో జీడీపీ పరంగా ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ సామాజిక ప్రగతిలో హ్యాపీనెస్ ఇండెక్స్‌లో మన దేశం అత్యల్పంగా ఉంది. ప్రజల వినియోగ స్థాయి, జీవన ప్రమాణం, ఆయుర్దాయం, సామాజిక భద్రత కానీ స్వేచ్ఛ జీవన విధానం గానీ స్త్రీల సాధికారత గాని మొదలైన అంశాల పరంగా ప్రజల సంతోషాన్ని అంచనా వేయాలి. హ్యాపీనెస్ ఇండెక్స్ రీత్యా 137 దేశాలలో మన దేశం 126వది. 2014లో 111వ దేశంగా మాత్రమే ఉండేది. అయితే గ్లోబలైజేషన్ వలన మిలియనీర్లో, బిలియనీర్లో అయినారు గానీ ప్రజా శ్రేయస్సు పాతాళానికి పోయింది. గ్లోబలైజేషన్ వలన ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత, ఆదాయ అసమానతలు పెరగడం బిలీయనీర్ల సంఖ్య పెరగడం జరిగింది గాని దాని వల్ల ఒనగూరిన ప్రజా శ్రేయస్సు శూన్యం.

డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్

98663 22172

Next Story