పనిమంతుడికే పట్టం కట్టు!

by Ravi |   (  Updated:2025-09-04 00:30:26  IST  )

పల్లె సీమలు ప్రగతికి పట్టు కొమ్మలు. పల్లె బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది. అలాంటి పల్లెల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి.

పనిమంతుడికే పట్టం కట్టు!
X

పల్లె సీమలు ప్రగతికి పట్టు కొమ్మలు. పల్లె బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది. అలాంటి పల్లెల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలి. నీతివంతమైన పాలన ప్రజలకు చేరువ కావాలి. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ఫలాలు గ్రామాల్లో అందరికీ దక్కాలి. అందుకు గాను గ్రామాల్లోని ఓటర్లంతా పని మంతులకే పట్టం కట్టాలి. నిజాయితీగా ఓటు వేసి ఓ మంచి వ్యక్తిని సర్పంచిగా, వార్డ్ మెంబర్లుగా గెలిపించుకోవాలి. గ్రామాల్లోని ఓటర్లంతా చైతన్యమై అవినీతి రహితమైన, ప్రలోభ రహితమైన ఒక సమర్ధుడైన మంచి వ్యక్తిని గ్రామ అధిపతిగా, వార్డు మెంబర్లుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో ఏదో ఇస్తామన్నారని, తాత్కాలికంగా ఏదో చేస్తామన్నారని, ఎవరో చెప్పారని మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెలిబుచ్చకుండా విలువైన మన ఓటును అసమర్ధులకు, అర్హత లేని వారికి వేసి తర్వాత బాధపడినా ఏమి లాభం ఉండదు. అందుకే ఒక పాలనాదక్షత, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అభివృద్ధి పనులు తీర్మానం చేసేందుకు వార్డు మెంబర్లు కూడా కీలకం.‌ కాబట్టి సర్పంచితో పాటుగా మిగితా వారిని కూడా మంచి వారిని ఎన్నుకోవాలి. రాజకీయం అనేది సేవా దృక్పధంగా ఉండాలి. ‌లాభాపేక్ష ధ్యేయంగా, పెట్టిన పెట్టుబడిని రెట్టింపు స్థాయిలో పొందాలన్న ఆలోచన ఉన్న వారిని‌ కాకుండా మంచి వ్యక్తులకు పట్టం కట్టాలి. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వారిచ్చే డబ్బులు ఒక్క రోజు ఇంటికి బంధువు వస్తేనో లేకపోతే ఏదైనా పండుగ రోజుల్లో చేసే ఖర్చుతో సమానం. మీరు ఒక్క రోజు తాగి, తిని మన విలువైన ఓటును బూడి‌దలో పోసిన పన్నీరులా చేస్తే గ్రామ అభివృద్ధిని మనమే తాకట్టు పెట్టినట్లు అవుతుంది. మీ ఓటును వజ్రాయుధంగా వినియోగించుకొని నికార్సయిన వ్యక్తిని ఎన్నుకొని గ్రామ స్వయం పాలన కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ బలోపేతానికి‌ మనం తోడ్పడాలి.

-బొల్లెద్దు వెంకట్ రత్నం

99636 16381

Next Story