గాంధీ కల.. అంబేడ్కర్ కలం.. మన స్వేచ్ఛా శిల్పం!

by Ravi |   (  Updated:2025-11-26 01:16:03  IST  )

ఒకప్పుడు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్ష, అంటరానితనం వంటి మహా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం.. ‘ఇలాంటి దేశాన్ని పాలించుకోవడం చేతకాదు’ అని బ్రిటిషు అధికారం ఎగతాళి చేసిన దేశమే.. అర్ధరాత్రి నిశ్శబ్దంలో నెహ్రూ ‘భారత జాతి మేల్కొంటోంది’ అన్న ప్రకటనతో ప్రపంచ పటంలో కొత్త ఆశగా తిరిగి పుట్టుకుంది.

గాంధీ కల.. అంబేడ్కర్ కలం.. మన స్వేచ్ఛా శిల్పం!
X

ఒకప్పుడు పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, వివక్ష, అంటరానితనం వంటి మహా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం.. ‘ఇలాంటి దేశాన్ని పాలించుకోవడం చేతకాదు’ అని బ్రిటిషు అధికారం ఎగతాళి చేసిన దేశమే.. అర్ధరాత్రి నిశ్శబ్దంలో నెహ్రూ ‘భారత జాతి మేల్కొంటోంది’ అన్న ప్రకటనతో ప్రపంచ పటంలో కొత్త ఆశగా తిరిగి పుట్టుకుంది. ఈ దేశం ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే విభిన్నతలో ఏకత్వాన్ని నిలుపుకుంటూ, ప్రపంచం ముందర నిలబడగల శక్తిగా ఎదిగింది. ఈ ప్రగతికి నిలువెత్తు ఆధారమే మన రాజ్యాంగం..

భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలు వ్యక్తిగత విశ్వాసాలు..! కానీ భారత రాజ్యాంగం సర్వజనహితం. భారతీ యుల పవిత్ర గ్రంథం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంలకు సంకేతం. మన దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటిస్తున్న అత్యున్నత చట్టం. మన రాజ్యాంగ విలువలే.. ప్రపంచానికి మనం వినిపిస్తున్న సందేశం.

60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి..

‘స్వరాజ్ అనేది బ్రిటిష్ వారిచ్చే భిక్ష కాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదంటూ’.. మహాత్మా గాంధీ స్ఫూర్తి వచనాలతో స్వాతంత్ర్యాన్ని సాధించాం. ఆదర్శవంతమైన.. అందరికీ ఆమోదమైన రాజ్యాంగ నిర్మాణమే లక్ష్యంగా.. రాజ్యాంగ సభ 22 కమిటీలను, 7 ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ముఖ్యమైన డ్రాప్టింగ్ కమిటీకి 1947 ఆగస్టు 29న డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్‌ని అధ్యక్షుడిగా నియమించింది. యావత్ ప్రపంచం చేత మహా మేధావిగా, దార్శనికుడిగా, సామాజిక విప్లవకారుడిగా గుర్తించబడ్డ అంబేడ్కర్... జీవితమంతా కులవక్షను ఎదుర్కొన్నప్పటికీ, ప్రతీకారంతో కాకుండా తన ప్రతిభతో దేశం పట్ల అంకితభావంతో, న్యాయం, సమానత్వం అనే విలువలను రాజ్యాంగ రూపంలో దేశానికి బహుమతిగా ఇచ్చారు. ఈయన దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘ మేధో మథనం తర్వాత 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుంచి 12 షెడ్యూల్స్‌తో కూడిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు..

దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందుబాటులోకి వచ్చాయి. ప్రాథమిక హక్కులు, సామాజికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు, ప్రజల సంక్షేమం కొరకు ఆదేశిక సూత్రాలు అమల్లోకి వచ్చాయి. ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద దృఢమైన, లిఖితపూర్వక, సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర, లౌకిక మైనది. మన రాజ్యాంగ నిర్మాతలు 70% పైగా అంశాలను భారత ప్రభుత్వ చట్టం-1935 నుంచి గ్రహించారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్125వ జయంతిని పురస్కరించుకుని 2015 నవంబర్ 26న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివస్‌గా ఘనంగా నిర్వహించింది. ఇక అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగం చరిత్ర, ప్రాముఖ్యతను భారత పౌరులకు తెలియజేసే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. సామాజిక బాధ్యతతో కూడిన జాతి పౌరులుగా తయారు చేస్తూ, రాజ్యాంగంలోని ఆత్మను పౌరులకు తెలియజేయడమే ఈ కార్యక్రమాల ఉద్దేశం.

ఇది మన రాజ్యాంగ గొప్పదనమే!

మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లో పాలనా వైఫల్యంతో, ఆర్థిక సమస్యలతో... ఆకలి ఆవేదనలతో... ఆ దేశ ప్రజల తిరుగుబాటు చర్యలను మనమంతా చూస్తూనే ఉన్నాం. శతాబ్దాలుగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాలో కూడా ఆ దేశ మహిళ... అధ్యక్షురాలుగా ఎదగలేక పోయింది. కానీ మన దేశంలో ప్రతిభా పాటిల్, ద్రౌపతి ముర్ము వంటి వారు మన దేశానికి అధ్యక్షులు అయ్యారు. కుల, మత, లింగ వివక్షలకు అతీతంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులయ్యారు. ప్రధానమంత్రులయ్యారు. భారతరత్నలుగా కీర్తించబడ్డారు. ఇదంతా మన రాజ్యాంగ గొప్పతనమే. మన రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు నిలువెత్తు స్వరూపమే. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహార హక్కును మన రాజ్యాంగానికి ఆత్మకు అభివర్ణించారు. ఓ సామాన్యుడికి సుప్రీంకోర్టు తలుపు తట్టే ధైర్యాన్నిచ్చారు.

స్వార్థ రాజకీయ ప్రయోజనాల వలన..

ఇప్పుడు మనమంతా చెప్పుకున్నది నాణేనికి ఒకవైపు.. అంబేడ్కర్ ఓ సందర్భంలో అన్నట్లు.. ‘అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చాము.. దాన్ని మంచికి వాడతామా.. వినాశనానికి వాడుతామా... అనేది పాలకుల చేతిలో ఉంటుంది’. ఆయన అన్నట్టుగానే నేడు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలోని కొన్ని అంశాలను తమ ఎదుగుదలకు అనుకూలంగా వాడుకుంటున్నారు. దశాబ్దాలుగా ఎదిగిన వారే ఎదుగుతున్నారు.. పేదలు పేదలుగానే మిగిలిపోతున్నారు. అంటరానితనం, వివక్ష అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. ఆ రాజ్యాంగానికి వందకు పైగా రాజ్యాంగ సవరణలు చేస్తూనే ఉన్నాం..! కానీ నేటికీ అభివృద్ధి చెందిన భారతదేశంగా ప్రపంచం ముందు నిలబడలేకపోయాం. కేవలం సామాజికంగానే కాదు... ఆర్థికంగా, రాజకీయంగా అన్నింటిలో సమానత్వం పొందాల్సిన సమయం ఆసన్నమైంది. హక్కుల గురించి చేసే బలమైన పోరాటాలే కాదు..! సమగ్రంగా బాధ్యతలు నెరవేర్చే యువత ఈ దేశానికి అవసరం. మన రాజ్యాంగ విలువలను భవిష్యత్ తరాలకు నేర్పుతూ, అసమానతలు లేని స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వం కలిగిన భారత దేశంలో.. ‘We the people of India’.. అంటూ సగర్వంగా రాజ్యాంగాన్ని ఓ చేతిలో పట్టుకొని.. మన త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేద్దాం గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహానుభావులు కలలు కన్న నవభారతాన్ని నిర్మిద్దాం.

- ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story