- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్‌కు పురస్కారం రాకపోవచ్చు.. కానీ
ఇటీవల తెలంగాణలో గద్దర్ పురస్కారాలు ప్రకటించారు. దీంతో 14 ఏళ్ల తర్వాత సినీ కళా రంగంలో ప్రతిభకు గౌరవం దక్కనుంది.

ఇటీవల తెలంగాణలో గద్దర్ పురస్కారాలు ప్రకటించారు. దీంతో 14 ఏళ్ల తర్వాత సినీ కళా రంగంలో ప్రతిభకు గౌరవం దక్కనుంది. గతంలో నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగానే జ్యూరీ చైర్ పర్సన్ జయసుధ ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. వీటిని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అవార్డుల జాబితాను మొన్న ప్రకటించారు.
2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. సినీ కళా రంగంలో వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే గద్దర్‌కు అందించే ఘనమైన నివాళి. ఆయన పేరుతో ఇచ్చే పురస్కారాలకు గొప్ప గౌరవం. తెలంగాణ వచ్చిన తర్వాత అసలు సినీ కళా రంగంలో అవార్డుల ఊసే లేకుండా అయిపోయింది. మళ్లీ నంది అవార్డును పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు కోరారు. దీంతో ప్రభుత్వం స్పందించి సినీ కళా రంగానికి ఇచ్చే నంది అవార్డుల స్థానంలో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ అవార్డును ప్రవేశపెట్టారు.
నేడు గద్దరే ఒక అవార్డు
గద్దర్ దళిత జాతిలో పుట్టి సామాజిక అసమానతలపై తన గళం, కలంతో సాంస్కృతిక చైతన్యమిచ్చాడు. అతని ఆట- పాటతో తెలంగాణ స్వరాష్ట్ర సాహిత్య సాంస్కృతిక రాజకీయ అస్తిత్వం కోసం కృషి చేశారు. బానిసత్వం, అణచివేతకు వ్యతిరేకంగా ప్రశ్నించాడు. కానీ ఈ ఆధిపత్య కుల, మతతత్వ పెట్టుబడిదారి రాజకీయ నాయకుల చేతుల్లోనే గద్దర్ సిద్ధాంతం ఓడిపోయింది. ఎందుకంటే దేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డులుగా పరిగణించే పద్మ అవార్డులలో అతనికి గుర్తింపునివ్వకపోవడమే దీనికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం గద్దర్‌కు పద్మ అవార్డుకు సిఫార్సు చేసినప్పటికీ.. ఆయనకు నక్సలైట్ భావజాలం ఉందనే పేరుతో ఆయనను పక్కన పెట్టారు. పైగా ఓ నాయకుడు తనకు ఎందుకు ఇవ్వాలనే ప్రశ్న కూడా లేవనెత్తారు. గద్దర్‌కు పురస్కారం రాకపోవచ్చు కానీ ఈ రోజు గద్దరే పురస్కారం కావడం గొప్ప విషయం.
ఈ అవార్డు సమతకు సంకేతం
కోట్ల డబ్బులతో నడిచే సినిమా రంగంలో గద్దర్ అవార్డు ప్రవేశించి తెలంగాణలో సామాజిక చైతన్యానికి, సమానత్వానికి మారుపేరుగా నిలవనుంది. ఆనాడు గద్దర్ సినీ కళా రంగంలో కూడా వైవిధ్యమైన నటన పాటలతో ప్రజలను చైతన్య పరిచాడు. అమ్మ తెలంగాణమా.., మళ్లే తీగకు పందిరి వోలె... పొడు స్తున్న పొద్దు మీద... వంటి పాటలతో ప్రజలను ఉర్రూతలూగించాడు. మాభూమి సినిమాలోని 'బండెనక బండి కట్టి' అనే పాటను పాడడంతో పాటు పాటలో నటించాడు. ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు ప్రకటించినప్పటికీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. సినీ కళా రంగంలో ఆయన పోషించిన పాత్ర పరిమితమే అయినప్పటికీ ఎంతోమందిని ప్రభావితం చేశారు.
సినీ రంగంలో సమాన అవకాశాలేవి?
సినిమా రంగంలో అవార్డులు ఇవ్వడం ద్వారా కొత్తవారు సినిమా పరిశ్రమలోకి రావడానికి ప్రేరణ కల్పిస్తాయి. గద్దర్ అవార్డు ఇవ్వడం అంటే సినీ కళా రంగం వైపు రావడానికి ప్రేరణ ఇవ్వడంతో పాటు ఆ రంగంలో సమాన అవకాశాలకు పెద్దపీటగా భావించాలి. ఇప్పటికీ ఈ రంగాన్ని మెజారిటీ అగ్రకుల ఆధిపత్య వర్గాలే శాసిస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చే నటులకు ఆదరణ లేదు. ఈ అవార్డుల తోనైనా ఇలాంటి వివక్షను తొలగించాలి. ప్రభుత్వం చిన్న కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గొప్ప కళాకారులగా తీర్చిదిద్దాలి. మెజారిటీ ప్రజలుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు సినిమా రంగంలో రాణించడం అంతంత మాత్రమే.
వాటికి వర్తింపజేయాలి!
గద్దర్ ఈ గడ్డపై సామాజిక సమానత్వం కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. మరి ఇప్పుడు గద్దర్ అవార్డు ఎంపికలో కూడా ఆయన సైద్ధాంతిక ఆలోచన, స్ఫూర్తిని కొనసాగించాలి. చిన్న సినిమాలకు అవార్డు రూపంలో ప్రోత్సాహం అందించాలి. ప్రస్తుతం యూట్యూబ్ జానపద పాటలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌కు ఆదరణ పెరుగుతుంది. కావున వీరికి కూడా ఈ అవార్డును వర్తింపజేయాలి. అప్పుడు చిన్న కళాకారులను ప్రోత్సహించినట్లు అవుతుంది. సినీ కళా రంగంలో వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే మనం గద్దర్‌కు అందించే ఘనమైన నివాళి. ఆయన పేరుతో ఇచ్చే పురస్కారాలకు గొప్ప గౌరవం.
(గద్దర్ పురస్కారాలుప్రకటించిన సందర్భంగా)
సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
79895 79428






