గద్దర్ అవార్డులు.. కళాకారులకు కొత్త ఆశ

by Ravi |   (  Updated:2026-03-21 00:30:13  IST  )

ప్రజాకవి గద్దర్ జీవితం, ఆయన సాంస్కృతిక పోరాటం, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన గద్దర్ అవార్డులు, ప్రజాకళలకు అందుతున్న గౌరవం, సినీ పరిశ్రమకు కొత్త ఊపు..

గద్దర్ అవార్డులు.. కళాకారులకు కొత్త ఆశ
X

కళ కేవలం కళ కోసం కాదు, సామాజిక ప్రయోజనం కోసం, వట్టి వినోదం కోసం కాదు.. సమాజ హితం కోసం అంటూ ప్రజల ఆశలు, ఆవేదన, ఆక్రందనలన్నీ కలబోసి పాటను సామాన్య ప్రజల చెంతకు చేర్చిన వ్యక్తి గద్దర్. ప్రజా సంస్కృతికి గొంతుక అయిన గద్దర్, ఆధునిక తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరు. తన పాటల ద్వారా, ప్రదర్శనల ద్వారా గద్దర్ సంప్రదాయ జానపద కళలను సామాజిక, రాజకీయ వ్యక్తీకరణకు శక్తి వంతమైన మాధ్యమంగా మార్చాడు.. జననాట్యమండలితో అనుబంధంగా ఉంటూ బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి జానపద కళారూపాలను వినియోగించి అణగారిన వర్గాల జీవితం, వ్యవసాయ కూలీల కష్టాలు, సామాజిక పోరాటాల కథలను ప్రజలకు వినిపించాడు.

చిత్ర పరిశ్రమకు జీవం పోసి..

గద్దర్ ప్రదర్శనలు ఆట, పాట, మాటల సమ్మేళనంగా ఉండేవి. పురాణ కథలకే పరిమితం కాకుండా భూమిలేని రైతులు, పేదరికం, కుల వివక్ష, దోపిడీ వంటి సమస్యలను తన కళా రూపాల ద్వారా ప్రతిబింబించాడు. ఆయన పాటలు నిరసన స్వరాలుగా మారి విప్లవోద్యమాలకూ, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికీ సాంస్కృతిక చైతన్యాన్ని కల్పించాయి.. అలాంటి మహానీయుడిని గుర్తించుకోవడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ప్రజాకళలకు, కళాకారులకు, రచయితలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు ‘గద్దర్’ పేరుతో అవార్డులు ఇస్తున్నారు.. గత పది సంవత్స రాలుగా నిద్రాణమై‌పోయిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవా‌ర్డు పేరుతో జీవం పోశారు.. ప్రపంచ స్థాయిలో ఐరిష్ రచయిత నాటకరంగ పితామహుడు ఆస్కార్ విల్డ్, పాల్ రాబ్సన్ భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం అవార్డు, అస్సాంలో ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికాకు ఇచ్చిన గౌరవం ఎంత గొప్పదో, తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దర్‌కు అదే స్థాయి గౌరవాన్ని ఇచ్చింది.

ప్రజా ఉద్యమాలకు గౌరవం ఇచ్చినట్టే!

దేశం నలుమూలల నుంచి కళాకారులను సత్కరించుకోవడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. చిన్న సినిమా‌లకు, కళాత్మక సినిమాలకు, తక్కువ బడ్జెట్ సినిమాలకు, డాక్యుమెంటరీలు, కథనాలకు, సాంకేతిక నిపుణులకు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం కళాకారులకు మాత్రమే కాకుండా ప్రజా ఉద్యమాలకు కూడా గౌరవం ఇచ్చినట్టే. అలాగే పరిశ్రమలో కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ అవార్డులు ముందుకు రావడం అభినందనీయం. అందుకే సినీ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రముఖ నటులు కోరారు.. ఇక కమల్‌హాసన్ కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ ఉడ్ ఏవీ ఉండకూడదని కేవలం ఇండియన్ సినిమా ఉండాలని ప్రభుత్వాన్ని, గద్దర్‌ని ప్రశంసించడం గర్వకారణం. గద్దర్ పేరుతో పురస్కారాలు ఇవ్వడం తెలంగాణ సంస్కృతి, పోరాట చరిత్రకు గుర్తింపుగా నిలుస్తుంది.

ప్రజాకళలకు పట్టం!

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చే నంది పురస్కారాలకు ఎంతో గౌరవం ఉండేది, కానీ గత కొన్ని సంవత్సరాలుగా అవి నిలిచిపోవడంతో సినీ పరిశ్రమలో ఒక లోటు ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ప్రారంభించడం ద్వారా కళాకారులకు మళ్లీ ప్రోత్సాహం కలిగింది. ముఖ్యంగా ఈ అవార్డుల్లో యువతరానికి ఎక్కువ అవకాశాలు రావడం సంతోషకరమని తెలంగాణ ప్రజానీకం భావిస్తుంది. అనేక విభాగాల్లో కొత్త ప్రతిభ కనిపించడం సినీ రంగానికి మంచి సంకేతం. ఉత్తమ పౌర సమాజ నిర్మాణంలో చిత్ర పరిశ్రమకు అంటూ ఒక అర్థం ఉండాలని భావించి కళాకారులను అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఆలోచించడానికి వారిని అభినందించడానికి గద్దర్‌ని స్ఫూర్తిగా తీసుకోవడం ప్రజాకళలకు పట్టం కట్టడమే.

-డా. ముచ్చుకోట సురేష్ బాబు

99899 88912

Next Story