ప్లాస్టిక్ వ్యర్థం నుంచి పచ్చని రహదారుల దాకా..

by Ravi |   (  Updated:2025-09-23 00:45:42  IST  )

మన రహదారులు ఎన్ని కిలోమీటర్లు పెరుగుతున్నాయో, పర్యావరణ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి

ప్లాస్టిక్ వ్యర్థం నుంచి పచ్చని రహదారుల దాకా..
X

మన రహదారులు ఎన్ని కిలోమీటర్లు పెరుగుతున్నాయో, పర్యావరణ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. రోడ్ల నిర్మాణానికి సిమెంట్, బిట్ మెన్, ఇనుము వంటి పదార్థాలు వాడటం వల్ల వాయు కాలుష్యం, కర్భన ఉద్గారాలు ఎక్కువ అవుతున్నాయి. మరోవైపు, రోజూ వాడే ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, గ్లాసులు చెత్త కుప్పల్లో పేరుకుపోతూ భూమిని నాశనం చేస్తున్నాయి. ఈ రెండు సమస్యలకు ఒకే పరిష్కారం ఉంటే ఎంత బాగుంటుందో అనిపించిందా.. ఆ పరిష్కారం ఇదే – ప్లాస్టిక్‌తో రహదారులు.

30 శాతం ఎక్కువ దృఢత్వం..

మన దేశంలోనే “Plastic Man of India”గా పేరుగాంచిన ప్రొఫెసర్ వాసుదేవన్ ప్లాస్టిక్ రోడ్ల ఆవిష్కర్త. ఆయన సలహాతో 2002లోనే తమిళనాడులో మొదటి ప్రయోగం జరిగింది. తరువాత కేరళ, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాయి. భారతదేశంలో ఇప్పటివరకు ఒక లక్ష కిలోమీటర్లకు పైగా రహదారులు ప్లాస్టిక్‌తో నిర్మించబడ్డాయి. ప్లాస్టిక్ కలిపిన రహదారులు 30% వరకు ఎక్కువ దృఢంగా ఉంటాయి. వర్షాకాలంలో గుంతలు పడే సమస్య తగ్గుతుంది. అదే సమయంలో, ఒక్క కిలోమీటర్ రహదారి నిర్మించడానికి సుమారు 1 టన్ను ప్లాస్టిక్ వ్యర్థం వినియోగించవచ్చు. అంటే మనకు చెత్తగా కనిపించే ప్లాస్టిక్, రహదారుల బలానికి మూలం అవుతుంది.

ప్రపంచ దేశాల కొత్త ఆవిష్కరణలు..

భారతదేశం మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో “Plastic Road” ప్రాజెక్ట్ కింద పూర్తిగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ తో రహదారులు నిర్మించారు. ఈ రహదారులు 80% వరకు తక్కువ కార్బన్ ఉద్గారాలు కలిగిస్తాయి. ఆస్ట్రేలియాలో ఒక హైవే నిర్మాణానికి పది లక్షల ప్లాస్టిక్ బ్యాగులు, 50 లక్షల గ్లాస్ బాటిళ్లు వాడారు. అమెరికా, కెనడాలో పాత రబ్బరు టైర్లు, నిర్మాణ వ్యర్థాలతో కొత్త రహదారులు వేసి, పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఈ ఉదాహరణలు మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. చెత్త అనేది భూమికి భారమవ్వకూడదు, అది మన భవిష్యత్తుకి బలమవ్వాలి.

మనం చేయగల మార్పులు..

మన పట్టణాల్లో, గ్రామాల్లో ఇలాంటి పర్యావరణానుకూల రోడ్లు నిర్మించాలంటే కొన్ని చిన్న మార్పులు చాలవు. మున్సిపాలిటీలు సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాన్ని ప్రత్యేకంగా రీసైక్లింగ్ యూనిట్‌లకి పంపాలి. కొత్త రహదారి టెండర్లలో ప్లాస్టిక్ మిశ్రమాన్ని వాడటం తప్పనిసరి చేయాలి. విద్యార్థులు, యువత “Plastic for Roads” వంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే సమాజం త్వరగా మారుతుంది. దీర్ఘకాలంలో సోలార్ రోడ్లు, కూల్ పేవ్‌మెంట్స్ వంటి సాంకేతికతలపై కూడా మనం దృష్టి పెట్టాలి.

భవిష్యత్ తరాలకు ఇచ్చే బహుమతి..

భారతదేశంలో ఇప్పటివరకు ఒక లక్ష కిలోమీటర్లకు పైగా రహదారులు ప్లాస్టిక్‌తో నిర్మించబడ్డాయి. రోడ్డు అనేది కేవలం ప్రయాణానికి కాదు, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఒక బహుమతి. ప్లాస్టిక్ వల్ల పర్యావరణం నాశనం అవుతుందని భయపడటం కంటే, దానిని సరైన పద్ధతిలో ఉపయోగించి పచ్చని అడుగులు వేయడం మన బాధ్యత. రేపటి తరాలు మనను గుర్తుంచుకోవాలంటే, మన అడుగులు పచ్చదనం వైపు ఉండాలి.

-మద్దు భాను ప్రసాద్,

88869 68535

Next Story