మాగ్నెటిక్ టేప్ నుండి పెన్ డ్రైవ్ దాకా.. వందేళ్ల సినీ సంగీత పరిణామం

by Ravi |   (  Updated:2025-04-19 01:15:59  IST  )

సంగీతం, పాటలు లేకుండా భారతీయ జీవితాల్ని, కళల్ని ఊహించలేం. ముగ్గేస్తూ పాట, గొబ్బెమ్మలతో పాట, బతుకమ్మలతో పాట

మాగ్నెటిక్ టేప్ నుండి పెన్ డ్రైవ్ దాకా.. వందేళ్ల సినీ సంగీత పరిణామం
X

సంగీతం, పాటలు లేకుండా భారతీయ జీవితాల్ని, కళల్ని ఊహించలేం. ముగ్గేస్తూ పాట, గొబ్బెమ్మలతో పాట, బతుకమ్మలతో పాట, పిల్లాడు పుడితే పాట, మనిషి చనిపోతే పాట అట్లా మన జీవితాల్లో పాట లేని సందర్భాన్ని ఊహించలేం. కళల విషయంలో ఒగ్గు కథ, బుర్రకథ ఇలా ఒకటేమిటి అన్ని జానపద పాట, కథా రూపాల్లో పాట, సంగీతం సమ్మిళితమై వుంటాయి. ఇక నాటకం విషయానికి వస్తే పౌరాణిక నాటకాలలో పాట, పద్యం, సంగీతం లేకుండా వాటి ఉనికే లేదు. ఇది అనేక శతాబ్దాలుగా వుంది.

ఇక కొన్ని దశాబ్దాల క్రితం ఆవిష్కరించిన భారతీయ సినిమాల్లో కూడా పాట అంతర్భాగమై పోయింది. మూకీ సినిమాల కాలంలో కూడా పరదా మీద మాటల్లేని దృశ్యాలు నడుస్తూ వుంటే పరదా ముందు పిట్‌లో సంగీత కారులు తబలా హార్మోనియం లాంటి వాయిద్యాలతో పాటలు పాడుతూ వుండేవారు. అప్పుడు తెరమీది కథకి, పాడే పాటకి సంబంధం ఉండేది కాదు. అప్పుడు పరదా నిశబ్దంగా వుంటే హాలు గోల గోలగా వుండేది. పాటలే కాకుండా హాలులో పాన్ బీడీ సోడా అంటూ గోలగోలగా వుండేది.

నాటకంలో పాట సినీ సంగీతమై...

భారతీయ సినిమా అనేక అంశాల్ని నాటక రంగం నుంచి అరువు తెచ్చుకుంది ఆ క్రమంలోనే పాట వచ్చింది. అది క్రమంగా సినీసంగీతంగా రూపాంతరం చెందింది. హరిశ్చంద్రతో ప్రారంభమయిన సినిమా ‘ఆలం ఆరా’తో మాటల్ని పాటల్ని నేర్చుకుంది. ఇక వివిధ వాయిద్యాల synchronize సంగీత ప్రక్రియ ప్రపంచంలో మొదటిసారిగా జాజ్ సింగర్‌తో మొదలయింది. మన దేశంలో ఆలం ఆరాతో మొదలయి అనేక దశల్లో ఎదిగి విస్తృతమయింది. 1931లో విడుదలైన ఆలం ఆరాతో, సినిమా సంగీతం ప్రజల సంగీతంగా మారింది. అందులోని ప్రాథమిక కూర్పులు, హిందుస్తానీ కర్ణాటక సంగీతం వంటి సాంప్రదాయ శైలులతో పాటు, భక్తి శైలులైన కవ్వాలి, భజనల నుండి ప్రేరణ పొందాయి. అప్పటినుండి భారతీయ సినిమా సంగీతం సంప్రదాయ, ఆధునిక మూలాలను కలగలిపి, ప్రత్యేకమైన సాంస్కృ తిక దృగ్విషయంగా పరిణా మం చెందింది. తొలి రోజుల్లో పాటల్ని రికార్డ్ చేయడానికి ప్రత్యేక టేప్‌లు కనుగొనబడలేదు. అందు కోసం ఫిలిం మీదనే పాటలూ రికార్డ్ అయ్యేవి. అంటే అటు పాత్రలు కథా కథనాలతో పాటు కెమరాలో రికార్డ్ అయ్యేవి. ఫిలిం ప్రాసెస్ అయి వచ్చిన తర్వాత పాట ఎట్లా వుందో వినేవాళ్ళు. తర్వాత మాగ్నె టిక్ టేప్ వచ్చిన తర్వాత విడిగా రికార్డింగ్ జరిగేది దానికోసం రికార్డింగ్ స్టూడియోలు వెలిసాయి.

నటులే పాడుకున్న కాలం

సినిమా సంగీతం, పాటల సాంకేతిక పరిణామాన్ని పరిశీలిస్తే మొదట ఫిలిం పైన ఆ తర్వాత రికార్డింగ్ వసతులు పెరిగినాక సినిమాల్లో సంగీత ప్రాధాన్యత పెరిగింది. గొప్ప గాయ కులూ సంగీతకారులు సినిమాల్లోకి వచ్చారు. మొదట్లో పాటలు పాడగలిగిన వాళ్ళే నటీనటులుగా వుండేవాళ్ళు. వారిలో నాగయ్య, కే.ఎల్.సైగల్ లాంటి వాళ్ళు ముఖ్యులు. తర్వాత నేపధ్య సంగీతం రావడంతో నటీనటులు గాయకులు కావాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇక పాటలకు ప్రాముఖ్యత, మార్కెట్ పెరగడంతో రికార్డింగ్ కంపనీలు పెరిగాయి. హెచ్.ఎం.వీ. లాంటివి. అప్పుడే గ్రామ ఫోన్ కనుగొన్నారు. కంపెనీల నుంచి గ్రామ ఫోన్ రికార్డులు విడుదల అవడం మొదలయింది. వాటిల్లో ఎల్.పి. రికార్డులు మొదలయినవి వచ్చేవి. ఆ కాలంలో కొంత స్థితిమంతులయిన వాళ్ళ ఇండల్లో గ్రాంఫోన్‌లు, అందమయిన ప్యాక్‌లలో రికార్డులు వుండడం పెద్ద ఫాషన్ అయిపోయింది. అప్పుడు కొన్ని హోటల్స్‌లో ‘ఫర్మాయిష్ గానే’ అనే కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. చాయి కోసమో, బిర్యానీ కోసమో వచ్చే వాళ్ళు తమకిష్టమైన పాటల్ని వేయించుకుని వినేవాళ్ళు వాటికి హోటల్స్ ప్రత్యేకంగా చారానో ఎంతో వసూలు చేసేవాళ్ళు.

రేడియో, క్యాసెట్, సీడీలు, డీవీడీలు, డ్రైవ్‌లూ...

క్రమంగా రేడియో రావడం రేడియోల్లో సినిమా పాటల కార్యక్రమాలు నిర్వహించడం మామూలైపోయింది. మీరు కోరిన పాటలు లాంటి ప్రోగ్రాములు ఆప్ హీ కే గీత్ లాంటివీ ఉండేవి. తర్వాత క్రమంగా మాగ్నెటిక్ రికార్డింగ్ కాసెట్లు, టేపులు వచ్చాయి. అవి 60 నిమిషాలు, 90 నిమిషాల నిడివిలో ఉండేవి. వాటిని ప్లే చేసేందుకు టేప్ రికార్డులు వచ్చాయి. 80ల్లో మస్కట్, దుబాయ్ వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు టేప్ రికార్డులు వెంట తెచ్చేవాళ్ళు. టేపుల్లో రికార్డ్ చేయడానికి ప్రత్యేక సెంటర్లు ఉండేవి. అదొక విలక్షణమయిన కాలం. క్యాసెట్లు కాలం ముగిసిన తర్వాత సీడీల యుగం మొదలైంది. వాటితో పాటు సీడీ ప్లేయర్లు వచ్చాయి. దాని తర్వాత డిజిటల్ యుగం మొదలయి డీవీడీలు వచ్చాయి. సాంకేతికత విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో డీవీడీల కాలం ముగిసి పెన్ డ్రైవ్‌లు, పోర్టబుల్ డ్రైవ్‌లు వచ్చాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరిగి సినీ సంగీతం స్థితి మారిపోయింది. మొబైల్ డేటా, వైఫైలు ఆవరించిన నేపథ్యంలో ఆన్లైన్ ఆడియో రంగం శ్రోతలకు స్పష్టమైన, సరళమైన సంగీతం అందుబాటులోకి వచ్చింది. వాటికి తోడు ఎఫ్.ఎం. రేడియోలు లాంటి సాంకేతిక సదుపాయాలూ సినీ సంగీతాన్ని విప్లవాత్మకంగా ప్రజల్లోకి తీసుకొచ్చాయి. ఈ పరిణామ క్రమం కేవలం వందేళ్ల కాలంలో సినీ సంగీతం శ్రోతల దాక చేరే ప్రక్రియలో వచ్చిన స్థూలమైన మార్పులు.

- వారాల ఆనంద్

94405 01281

Next Story