వెలుగు నుంచి చీకట్లోకి... బెంగాల్ కొత్త యుగం!

by Ravi |   (  Updated:2026-05-06 01:00:37  IST  )

ఒకప్పుడు భారతదేశానికి మార్గదర్శకంగా నిలిచిన పశ్చిమ బెంగాల్ ఎలా పతనమైందో, రాజకీయ మార్పులతో మళ్లీ అభివృద్ధి దిశగా సాగుతుందా?

వెలుగు నుంచి చీకట్లోకి... బెంగాల్ కొత్త యుగం!
X

భారత జాతీయ ఉద్యమంలో అగ్రగామిగా ఉండి, అనేకమంది విప్లవకారులను అందించిన నేల బెంగాల్. 19వ శతాబ్దపు బెంగాల్ పునరుజ్జీ వనం భారతీయ సామాజిక-సాంస్కృతిక పరిణామానికి పునాది వేసింది. ఒకప్పుడు ‘భారతదేశపు ఆభరణం’ అని పిలుచుకున్న పశ్చిమ బెంగాల్ మేధో సంపత్తికి, పారిశ్రామిక ప్రగతికి మారుపేరు. అయితే, దశాబ్దాల తరబడి సిద్ధాంతాల ముసుగులో జరిగిన దోపిడీకి, అభివృద్ధి నిరోధక చర్యలకు మొన్న వెలువడిన ఫలితాలు చరమగీతం పాడాయి.

మేధో సంపత్తికి, పారిశ్రామిక ప్రగతికి మారుపేరుగా నిలిచిన రాష్ట్రం.. ఇప్పుడు వలస కూలీల ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి మహామహులను అందించిన గడ్డపై నేడు రాజకీయ హింస, నిరుద్యోగం తాండవిస్తున్నాయి. స్వర్ణయుగం నుంచి అంధకారంలోకి ఆ రాష్ట్రం ఎలా జారిపోయిందో విశ్లేషిస్తే విస్తుపోయే వాస్తవాలు కనిపిస్తాయి.

వైభవం నుంచి పతనం వైపు..

1970వ దశకం ప్రారంభంలో పశ్చిమ బెంగాల్ పరిస్థితి దేశానికే ఆదర్శం. 1960-70 మధ్య కాలంలో దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో బెంగాల్ వాటా 20% పైగా ఉండేది. అప్పట్లో దేశంలోని మొత్తం ఫ్యాక్టరీ కార్మి కులలో అత్యధికంగా 15-18% మంది బెంగాల్‌లోనే ఉండేవారు. కోల్‌కతా పోర్ట్ ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా విరాజిల్లిన తరుణంలో, 1977లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసలు కథ మొదలైంది. 34 ఏళ్ల వామపక్ష పాలనలో మిలిటెంట్ ట్రేడ్ యూనియనిజం వల్ల పరిశ్రమలు పారిపోయాయి. ఇంగ్లిష్ విద్యను దూరం చేయడం వల్ల ఒక తరం యువత ప్రపంచ పోటీలో వెనుకబడ్డారు. 1970లో దేశ జీడీపీలో 10% పైగా ఉన్న బెంగాల్ వాటా, మమత పాలన ముగిసే నాటికి అత్యంత కనిష్టానికి పడి పోయింది. కమ్యూనిస్టుల నుంచి విముక్తిని ఆశించిన బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ పాలనలో 'సిండికేట్' అరాచకాలు, రాజకీయ హింస మిగిలాయి. సింగూర్ నుంచి టాటా నానో ప్లాంట్‌ను వెళ్లగొట్టడం రాష్ట్ర పారిశ్రా‌మిక ఆత్మహత్యగా మారింది. అవినీతి ఆరో పణలు, నిరుద్యోగం, ఓటు బ్యాంక్ రాజకీయాలతో విసిగి‌పోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో మమత పతనాన్ని శాసించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని బెంగాలీలు బలంగా విశ్వసించారు. బీజేపీ అఖండ విజయంతో ఒక అంధకార యుగం ముగిసి, కొత్త ఆశలు చిగురించాయి.

బీజేపీ విజయం - మలుపు తిరిగిన చరిత్ర

ఈ గెలుపు వెనుక ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, కేంద్ర పథకాల అమలుపై ప్రజల్లో కలిగిన నమ్మకం ఉంది. మహిళా భద్రత, సందేశ్‌ఖాలీ వంటి ఘటనలు మమత ఓటమికి ప్రధాన కారణాలు కాగా, మోడీ నాయకత్వంపై బెంగాల్ యువత ఆశలు పెంచుకుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం వల్ల నిలిచిపోయిన పారిశ్రామిక ప్రాజెక్టులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. కేంద్ర నిధుల మళ్లింపు ఆగి, నేరుగా లబ్ధిదారులకు చేరడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది.

తెలంగాణ ఒక దిశానిర్దేశం..

బెంగాల్ కునారిల్లుతుంటే, పదేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో ఎలా దూసుకుపోతుందో ఆ పాలకులు గమనించాలి. కేవలం ఐటీ రంగమే కాకుండా, ఫార్మా, మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ చూపిన చొరవ అద్భుతం. తెలంగాణ తలసరి ఆదాయం నేడు దేశంలోనే అగ్రగామిగా ఉండగా, బెంగాల్ జాతీయ సగటు కంటే వెనుకబడి ఉంది. హైదరా‌బాద్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతుంటే, కోల్‌కతా మాత్రం పాత భవనాలతో, మూతపడిన మిల్లులతో నిట్టూరుస్తోంది. సిద్ధాంతాల పేరిట కాలం చెల్లిన పద్ధతులను పాటించినా, అభివృద్ధిని కాదని కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేసినా రాష్ట్రాలు ఎలా వినాశనం అవుతాయో చెప్పడానికి బెంగాల్ ఒక సజీవ సాక్ష్యం. అందుకే ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే సర్కార్ తెలంగాణ వంటి అభివృద్ధి మోడళ్లను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

బెంగాల్ మళ్లీ వెలుగులోకి వచ్చేనా..?

బెంగాల్ ప్రస్తుతం ఒక చారిత్రక మలుపులో నిలబడి ఉంది. అఖండ మెజారిటీతో వచ్చిన కొత్త నాయకత్వం, మళ్లీ ఆ రాష్ట్రాన్ని పూర్వ వైభవానికి తీసుకెళ్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. బెంగాల్ పునరుజ్జీవనం సాధ్య మవ్వాలంటే కొత్త ప్రభుత్వం గతంలో జరిగిన పొర పాట్లను పునరావృతం చేయకుండా, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే, రాజకీయ హింసను పూర్తిగా నిర్మూలించి, శాంతి భద్రతలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంపొందించాలి. ఐటీ, తయారీ, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, టూరిజం వంటి రంగాల్లో భారీ అవకాశాలు దాగి ఉన్నాయి. అలాగే రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు ఆ నేలలో ఉన్నాయి. వాటిని సరైన దిశలో వాడుకుంటే, బెంగాల్ మళ్లీ భారతదేశ అభివృద్ధికి దారిదీపంగా నిలిచే రోజు దూరంలో ఉండకపోవచ్చు.

- పెద్ది విజయ భాస్కర్,

80080 01377

Next Story