శంభూకుని తల నుంచి సీజేఐ దాడి వరకు.. మనువాదం యథాతథం!

by Ravi |   (  Updated:2025-10-19 01:15:25  IST  )

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) సంఘానికి వందేళ్లు నిండిన సందర్భంగా మహారాష్ట్ర‌లోని అమరావతిలో నిర్వహించనున్న సభకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని ప్రధాన వక్తగా ఆహ్వానించారు.

శంభూకుని తల నుంచి సీజేఐ దాడి వరకు.. మనువాదం యథాతథం!
X

రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) సంఘానికి వందేళ్లు నిండిన సందర్భంగా మహారాష్ట్ర‌లోని అమరావతిలో నిర్వహించనున్న సభకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని ప్రధాన వక్తగా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు కూడా వేశారు. ఆహ్వాన పత్రంలో ఆమె పేరు అడిగివేశారో లేదో గానీ విషయం తెలుసుకున్న ఆవిడ సదరు సభకు తాను రాలేను అని నిర్వాహకులకు ఉత్తరం రాశారు..

తన కుటుంబం కొన్ని విలువలతో దశాబ్దాలుగా అంబే ద్కర్ ఆలోచనల భావజాలంతో పనిచేస్తున్నాం అంటూ.. తన భావజాలానికి భిన్నమైన ఆ వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదు, అని ఆమె చేసిన స్వాభిమాన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

తల్లిపై ట్రోల్.. సీజేఐపై దాడి..

తరాలుగా తమ కుటుంబం కాపాడుకున్న పరంపరకు విరుద్దమైన పని అని ఆ ఆహ్వానాన్నీ తృణీకరించి తన స్వాభిమాన ధిక్కార ప్రకటన మనువాదులను గంగ వెర్రి ఎత్తేలా చేసింది. ఆమె మరెవరో కాదు ప్రముఖ అంబేడ్కరైట్, స్వయంగా అంబేద్కర్‌తో కలిసి పనిచేసిన దళిత నాయకుడు గొప్ప రాజనీతిజ్ఞడు, రామకృష్ణ సూర్యభన గవాయ్ సహచరి, చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లి కళామతి థాయి. దీంతో ఆమె తిరస్కరణను నిర్వాహకులు అవమానంగా భావించి సామాజిక మాధ్యమాలలో విప రీతంగా ట్రోల్ చేశారు. ఆమెను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సుప్రీంకోర్టులో తన కొడుకు అయిన చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మీద దాడి జరిగింది.

చెప్పుల దాడి ఎందుకు జరిగిందంటే..

అంత పెద్ద ఉన్నత పదవిలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పుల దాడి ఎందుకు జరిగింది? ప్రసిద్ధ ఖజురహో పర్యాటక ప్రాంతంలో 'పది లేదా పన్నెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన విష్ణుమూర్తి విగ్రహానికి మరమ్మత్తులు జరిపించేలా కోర్టు ఆర్డర్ ఇవ్వాలి' అని రాకేష్ కిశోర్ అనే న్యాయవాది వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. 'సదరు విగ్రహం పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉండడం మూలంగా దాని మీద కోర్టుల జోక్యం కుదరదు' అని చీఫ్ జస్టీస్ గవాయ్ అన్నారు. సదరు పిటిషన్ వేసిన న్యాయ వాదికి ఆ విషయం తెలియంది కాదు. వాస్తవానికి అది కోర్టు పరిధిలో లేని అంశం. తెలిసి కూడా పదే పదే వాదన చేస్తున్న అతనిని ఉద్దేశించి 'వెళ్లి ఆ దేవుడినే అడుగుపో' అన్నాడు. ఆ మాటను అవమానంగా భావించిన రాకేష్ కిశోర్ చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో దాడి చేశాడు. పైగా 'సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా అదే రీతిలో దాడి చేయడానికి కూడా వెనకాడను' అని కనీస పశ్చాత్తాపం ప్రకటించకుండా ప్రకటన చేశాడు.

నాడు అంబేద్కర్‌నీ ఇలాగే అవమానించారు..

సనాతన‌వాదానికి ఏ చిన్న ప్రశ్న ఎదురైనా దాడులు భౌతికంగా నిర్మూలన చేయడం ఇవాళ కొత్తగా మొదలు కాలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉత్సవాలకు చీఫ్ జస్టిస్ గవాయ్ తల్లిని వక్తగా పిలిచినట్టే... సరిగ్గా ఎనభై తొమ్మిదేళ్ల కింద ఆర్ఎస్ఎస్ కన్నా ముందే ఏర్పడిన జాత్ పాక్ తోడక్ మండల్ అనే సంఘం తమ వార్షిక ఉత్సవానికి అంబేద్కర్‌ను ముఖ్య వక్తగా లాహోర్ ఆహ్వానించారు. కుల అసమానతలు తొలగించే లక్ష్యంతో ఏర్పాటు అయిన ఆ సంఘ బాధ్యులు మీటింగ్ జరగడానికి ముందే బాబా సాహెబ్‌ను తన ప్రసంగ పాఠాన్ని పంపించాల్సిందిగా కోరారు. ఆ ప్రసంగ పాఠాన్ని ముందే చదివిన నిర్వా హకులు అందులో ఉన్న అంశాల పట్ల అంగీకారం లేదని మీటింగ్‌నే రద్దు చేసుకున్నారు. ఆనాడు అంబేద్కర్ కుల నిర్మూలన పట్ల తనకు ఉన్న మేధస్సును జోడించి రాసుకున్న ఆ ప్రసంగ పాఠమే కుల నిర్మూలన. అది లక్షలాది కాపీలు అమ్ముడుపోయిన విషయం జగత్ విదితమే. ఆనాడు అంబేద్కర్‌కు జరిగిన అవమానం, నేడు గవాయ్ కుటుంబానికి జరిగిన అవమానం రెండూ నాటి నేటి వివక్ష మూలాలకు ఉన్న ప్రాచీన జాడ్యాన్నే చూపెడుతున్నాయి. ఈ తొంబై ఏళ్లలో ఎన్నో స్వాభిమాన ఉద్య మాలు వచ్చాయి. కుల నిర్మూలన పేరుతో దేశం మొత్తం అంబేద్కర్ చూపిన అడుగు జాడల్లో నడిచారు.

సీజేఐ తల్లికి ఎంపిక హక్కూ లేదా?

ఈ దేశంలో మెజారిటీ పేరుతో, దేశ రక్షణ పేరుతో, జాతీయత పేరుతో ఎన్ని విద్వేష ప్రకటనలను అయినా సహించగలరు కానీ, ఒక దళిత మహిళ తనకు ఇష్టం లేని రాజకీయ వేదికలను పంచుకోవాలా లేదా అని నిర్ణయించుకునే హక్కు కూడా లేదు.. బతుకంతా దశాబ్ధాల పాటు అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచిన సీనియర్ గవాయ్ సహచరి ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు దూరంగా ఉండడం కుట్ర కాదు.. అది స్వాభిమాన ప్రకటన.

ఈ దమననీతి ఏ యుగపు అవశేషం?

యుగాలు మారినా దమన నీతి మారలేదు, వేదాలు నేర్చుకున్నాడని త్రేతాయుగంలో శంభూకుని తల నరికిన వారసులే.. వర్తమానంలో అమానవీయ కుల వ్యవస్థకు మనువాదమే దన్నుగా ఉన్నది అని ప్రశ్నించిన అంబేద్కర్‌ను జా‌త్ పాక్ తొడక్ మండల్ సభకు పిలిచి అవమాన పరిచింది. నిన్న గాక మొన్న ఆర్ఎస్ఎస్ సభకు రాలేను అన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తల్లి కళామతి థాయినీ అవమాన పరిచారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే సాక్షాత్తు సుప్రీంకోర్ట్‌లో పట్టపగలు దేశ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాన న్యాయాధిపతిని మై లార్డ్ అని సంబోధించడం ఇష్టం లేకనే చెప్పుల దాడి జరిగింది. దానికి కారణం నాగరిక సమాజానికి బుల్డోజర్ పేరుతో చేస్తున్న అన్యాయాన్ని ఎత్తి చూపి విగ్రహ పునరుద్దరణ తన పరిధిలో లేదు అన్నందుకే అనేది దాచేస్తే దాగని సత్యం. ఒక సీనియర్ అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి తనకు తాను కాల్చుకుని చనిపోయేలా చేసిన దమన నీతి ఏ యుగపు అమానవీయ అవశేషం. ఇది మానవాళికి మచ్చ... వ్యవస్థకు పట్టిన చెదలు.. వాళ్లు ఈ యుగపు ప్రశ్నగా చరిత్రలో మిగిలే ఉంటారు.

-డాక్టర్ గుర్రం సీతారాములు

ఇండిపెండెంట్ రిసెర్చర్,

77805 87586

Next Story