హద్దులెరిగిన స్నేహం

by Ravi |   (  Updated:2025-09-03 00:30:55  IST  )

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల మోత మోగిస్తున్న సమయంలో భారత్, చైనాల స్నేహం ఆసక్తి కలిగిస్తోంది.

హద్దులెరిగిన స్నేహం
X

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల మోత మోగిస్తున్న సమయంలో భారత్, చైనాల స్నేహం ఆసక్తి కలిగిస్తోంది. షాంఘై సహకార సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ చైనాకు వెళ్లడం.. జిన్‌పింగ్‌తో సమావేశం కావడం.. అది సానుకూలంగా జరగడం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా సుంకాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఈ దేశాలు.. మరలా స్నేహ యుగళగీతం అందుకోవడం ముదావహం. ఆవశ్యం. రెండు దేశాలదీ హద్దు లెరిగిన స్నేహమే కనుక ఇబ్బందేమీ లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా అహం కార ధోరణి, శతృ, మిత్ర బేధం లేకుండా అందరికీ ఒకేలా పన్నులు వడ్డించడం వల్ల నిన్నటి దాకా ప్రత్యర్థులుగా మెలిగిన భారత్, చైనాలు తమలో దాగిన స్నేహాన్ని గుర్తించి, పెద్దపీట వేస్తున్నాయి. తమ మధ్య భేదాలకు కారణమైన సరిహద్దు సమస్య కూడా కూర్చుని పరిష్కరించుకోవాల్సిన సమస్యే తప్ప అలవికానిది కాదని చెప్తున్నాయి. అలాంటి చిన్న చిన్న విషయాలు స్నేహానికి, కలిసి ఎదగడానికి అడ్డు రాకూడదని భావిస్తున్నాయి. ఇది అవసరార్థపు కలయిక అయినంత మాత్రాన తక్కువదేమీ కాదు. ఇరుగు పొరుగు దేశాలు వాణిజ్యంలో సహకరించుకుంటే ఇరువురికీ మేలు.. భారత్ , చైనా కలిసి ఫైట్ చేస్తూ కూర్చుంటే మధ్యలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు చులకన కావడం, వారి దెబ్బకు దొరకడం తప్పించి ఫలితం నాస్తి. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సహకారం అన్నది సరిహద్దు సమస్యతో వేరుగా చూడడం సాధ్యం కాదు. కనుక దాని పరిష్కారాన్ని వాయిదా వేయకుండా సాధ్యం చేయాలి. అప్పుడు పరస్పర నమ్మకం పెరుగుతుంది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ ఆందోళనను గుర్తించి చైనా సహకరించాలి. తమ సొంత ప్రయోజనాల్ని కాపాడుకుంటూనే ఉభయతారకంగా వ్యవహరించాలి. ప్రపంచ వాణిజ్య సంబంధాల్లో ప్రస్తుతం నెలకొన్న కుదుపుల్ని పాఠాలుగా తీసుకుని కొత్త ఆలోచనలు చెయ్యాలి.

-డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story