ఉచిత పథకాల భారమా? ప్రభుత్వాల ఆర్థిక స్థితిపై హెచ్చరిక!

by Ravi |   (  Updated:2026-03-18 00:46:25  IST  )

ఉచిత పథకాల వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా దెబ్బతింటోంది? పెరుగుతున్న అప్పులు, పన్నుల భారం, అభివృద్ధి పనులపై ప్రభావం వంటి అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసం.

ఉచిత పథకాల భారమా? ప్రభుత్వాల ఆర్థిక స్థితిపై హెచ్చరిక!
X

అన్ని ఉచితమైనప్పుడు ప్రజలు ఎందుకు పనిచేయాలి? అనే భావన రావడం, ప్రభుత్వాలు ఎక్కువగా అప్పులు చేయడం, ఫలితంగా ప్రజలపై అదనపు పన్నుల భారం మోపడం జరుగుతుంది. ప్రభుత్వాలు కొత్త రోడ్లు, ఆసు పత్రులు, పాఠశాల, క్రొత్త పరిశ్రమలు నెలకొల్పలేకపోవడంతో పాటు, ప్రజలకు కరెంట్, నీరు, నిత్యావసర వస్తువులపై చార్జీలు పెంచడం జరుగుతుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు..

ఎన్నాళ్లీ ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దాదాపుగా రెవెన్యూ లోటులోనే ఉన్నా ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న రెండు పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు.. ప్రభుత్వ బాధ్యత ఇంత వరకేనా? ఉద్యోగావకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించవద్దా? అని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.. ఇక కొందరు వ్యక్తులు అన్నీ ఉండి కూడా తమకున్న పలుకుబడితో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, ఉచితాలు మొదట తమ జేబుకే చేరాలంటున్నారు..

ఉచిత పథకాల వల్ల జరిగే నష్టాలు..

ఈ ఉచిత పథకాలు సరైన లక్ష్యంతో, ఆర్థిక క్రమశిక్షణతో అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం, అవి ఉచితాలు ఇవ్వడం దేశ ఆర్థిక వ్యవస్థకు హానికరం కావచ్చు.. ఎప్పుడూ ప్రభుత్వం డబ్బు ఇస్తే కొంతమంది స్వయం ఉపాధి, వ్యాపారం, పొదుపు వంటి విషయాల్లో ఆసక్తి తగ్గించే ప్రమాదం ఉంటుంది. దీనితో కుటుంబాల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినవచ్చు.. ప్రభుత్వ డబ్బు ఎక్కువ భాగం ఉచిత పథకా‌లకు వెళ్తే కొత్త రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, పరిశ్రమల నిర్మాణానికి నిధులు మిగలకపోవచ్చు.. ప్రభుత్వం ఎక్కువగా అప్పు తీసుకుంటే, ఆ డబ్బు తిరిగి చెల్లించాలి. పన్నులు పెంచడం ద్వారా, చార్జీలు పెంచడం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఉచిత విద్యుత్ పథకాల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టాల్లోకి వెళ్తాయి. అప్పుడు ప్రభుత్వం ఆ నష్టాలను భరించడానికి మరింత రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెరగ‌వచ్చు లేదా పవర్ కట్లు ఎక్కువ కావచ్చు.

గత ఐదేళ్లలో తెలంగాణ ఆర్థిక అప్పులు..

2019-20 నాటికి సుమారు రూ. 1.95 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి సుమారు రూ. 3.5 - రూ. 3.9 లక్షల కోట్ల వరకు చేరింది. 2024-25 నాటికి రూ. 4.51 లక్షల కోట్ల వరకు చేరింది. ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నుల నుంచి మంచి రోడ్లు, మంచి పాఠశాలలు, మంచి ఆసు పత్రులు ఇటువంటి సౌకర్యాలు కోరుకోరా? చాలా చోట్ల ఎన్నికలకు ముందు ప్రజలు అడిగినా, అడగకపోయినా, సాధ్యమైనా కాకపోయినా హామీలు ఇవ్వడం. పూర్తిగా న్యాయం చేయలేకపోవడం చూస్తూనే ఉన్నాం.

ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి!

ప్రభుత్వం ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల నాయ కులతో ఆలోచించి పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. పిల్లలకు మంచి ప్రభుత్వ పాఠశాలలు, మంచి టీచర్స్‌ని ఇవ్వాలి. ప్రభుత్వాలు ప్రజలకు మంచి ఆసుప త్రులను నెలకొల్పాలి. ప్రభుత్వాలు అప్పులలో ఉన్నాయి. ఇలా విచ్చలవిడి ఉచితాలు పంచుకుంటూ పోవడం పైనే అందరి ఆందోళన. ఏడాదిలో వసూలయ్యే ఆదాయంలో కనీసం 25 శాతాన్ని కేవలం అభివృద్ధి కోసమే ఎందుకు కేటాయించకూడదు ప్రజలకు వోటు వేసేటప్పుడు ఉచితాలపై కాకుండా అభివృద్ధి, ఉద్యోగాలు, విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి.

- సి.వి.వి. ప్రసాద్

80196 08475

Next Story