నడుస్తున్న చరిత్ర:పోడు భూముల పంపిణీ చిక్కుముడి

by Disha edit |
నడుస్తున్న చరిత్ర:పోడు భూముల పంపిణీ చిక్కుముడి
X

వచ్చిన అప్లికేషన్లపై మరో అడుగు వేయడమే క్లిష్టంగా తయారైంది. సగానికి పైగా గిరిజనేతరులే ఇందులో ఉన్నారనే మాట వినిపిస్తోంది. పరిశీలన మొదలు పెడితే కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఎందరికి భూమి హక్కులిచ్చినా ఇదే చివరి అవకాశం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మళ్ళీ ఒక్క అప్లికేషన్ వచ్చిన పరిశీలించవలసిందే. సరియైన లెక్కలు ఆధారాలు ప్రభుత్వం దగ్గర లేనందున కాదనడానికి కుదరదు. ఇలా కక్కలేక మింగలేక చిక్కుముడిని విప్పలేక ప్రభుత్వం దిగులు పడుతుంటే మరోవైపు అటవీ భూములపై సాగు చేసుకుంటున్న గిరిజనులకు, అధికారులకు మధ్య ఘర్షణ సాగుతోంది. ముప్పై ఏళ్లుగా దున్నుతున్న భూమిని అటవీ సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రైతులు అంటున్నారు. కొన్ని చోట్ల నివాసాలను తొలగించేస్తున్నారు. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కొందరిపై కేసులు పెట్టారు.

2006లో పంపిణీ కాగా మిగిలిపోయిన పోడు భూముల అభ్యర్థనలను ఇంకా నాన్చకుండా తేల్చివేస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సీఎం కేసీఆర్ అక్టోబర్ 2021లో జరిగిన అధికారుల సమావేశంలో తన నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక రకరకాల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో 'అర్హులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇచ్చి రైతుబంధు సొమ్మును కూడా ఇస్తామని'ఉంది. 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు పోడు భూముల పంపిణీలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పరిశీలించి వారికి పట్టాలు ఎప్పుడిస్తారో చెప్పమని రాష్ట్రాలను ఆదేశించింది. ఫిబ్రవరి 2021 నుండి హరితహారం కోసం గిరిజనుల పోడుభూములను అటవీ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంతో సమస్య పెద్దదైంది.

అక్టోబర్ 2021లో రాజకీయ విపక్షాలు, ఆదివాసీ సంఘాలు కలిసి భూ హక్కుల కోసం ఆందోళనలు చేపట్టాయి. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు రాష్ట్రాలు ఈ పంపిణీపై నెలవారీ నివేదిక అందించాలి. జనవరి 2018 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆ నివేదికను తిరిగి ఏప్రిల్ 2021లో ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం 145 భూహక్కులను అందించినట్లు అందులో పేర్కొంది. జూన్ 2021 లో ఆ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షా సమావేశం జరిపినందున రిపోర్ట్ పంపక తప్పలేదు. వీటన్నిటిని నిలువరించే దిశగా సీఎం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 8 నవంబర్ 2021 నుండి ఒక నెల రోజుల కాల పరిమితితో అధికారులు పోడు భూముల పంపిణీకి దరఖాస్తులు స్వీకరించారు. గడువులోగా మొత్తం 3.5 లక్షల అభ్యర్థనలు ప్రభుత్వానికి అందాయి. చట్టప్రకారం వీటికి మూడంచెల పరిశీలన ఉంటుంది. గ్రామసభ తర్వాత డివిజనల్, జిల్లా స్థాయిలో ఇది జరుగుతుంది. ఇవి నిరాకరిస్తే కోర్టుకు వెళ్ళవచ్చు. అంది ఆరు నెలలు గడిచిపోవడంతో దరఖాస్తుల పరిశీలన కోసం తహసీల్దార్లు, కలెక్టర్లపై అభ్యర్థుల ఒత్తిడి పెరుగుతోంది. అధికారులు సీఎం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ నిబంధనలు

పోడు వ్యవసాయమంటే అడవిలో ఒక చోట చెట్లను నరికివేసి నేలను చదును చేసి పంటలు తీసిన తర్వాత దిగుబడి తగ్గితే, ఆ నేలను వదిలేసి మరో అనుకూలమైన చోట అదే విధంగా సాగు చేయడమన్నమాట. దీనివల్ల అడవి తగ్గిపోతుంది. దీనిని నివారించేందుకు కేంద్రప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది.షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయిక అడవి నివాసులకు ఇది వర్తిస్తుంది. 13 డిసెంబర్ 2005 కన్నా ముందు నుండి ఆదివాసీల స్వాధీనంలో ఉన్న భూమిని స్థల లభ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో కుటుంబానికి 10 ఎకరాల దాకా కేటాయించవచ్చు. గిరిజనేతర అడవి నివాసులైతే మూడు తరాలు లేదా 75 ఏళ్లుగా అడవే జీవనాధారంగా బతుకుతున్నవారై ఉండాలి. 2008లో అవిభక్త ఆంధ్రప్రదేశ్​లో పోడు భూముల పంపిణీ జరిగినా వివిధ కారణాల వల్ల సుమారు సగం అప్లికేషన్లు తిరస్కరించబడ్డాయి. అప్పుడు వచ్చిన అభ్యర్ధనల్లో 96,676లకు 3.08 లక్షల ఎకరాల మేరకు పట్టాలు అందినాయి. 53 వేల ఎకరాలకు చెందిన 15,558 అభ్యర్థనలు పెండింగులో ఉన్నాయి. 91,942 తిరస్కరించబడ్డాయి. వాటికి ఇవ్వవలసి వస్తే 3.27 లక్షల ఎకరాల నేల అవసరమవుతుంది.

ప్రస్తుతం అందిన మొత్తం మూడున్నర లక్షల అప్లికేషన్ల ప్రకారం 13 లక్షల ఎకరాల అటవీ భూమి కేటాయించవలసి వస్తుంది. సర్కారు లెక్కల ప్రకారం పోడు భూమిగా గుర్తించిన దానికన్నా ఎక్కువ నేల కావాలి. రూల్ 13 ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని చట్టంలో ఉంది. అటవీ హక్కుల నిర్దారణ కోసం పాత పటాలు, రాత కాగితాలు, అటవీ శాఖ విచారణ నివేదికలు, ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలు, భౌతిక పరిస్థితులు, ఇళ్లు, గుడిసెలు, సాంప్రదాయిక కట్టడాలు, బావులు, స్మశానాలు, పెద్దల మాటలు ప్రామాణికంగా తీసుకోవాలని అందులో ఉంది. వీటిని సృష్టించగలిగితే బయటివాళ్ళు కూడా పోడు భూములపై హక్కులు సంపాదించే చాన్సు ఉంది. ఒక జిల్లాలో గూగుల్ మ్యాప్ ప్రకారం రెండు వేల ఎకరాల అటవీ భూమిలో పోడు వ్యవసాయం కనబడితే వచ్చిన అప్లికేషన్ల ప్రకారం 30 వేల ఎకరాల పంచవలసివస్తుంది. పెద్ద సంఖ్యలో గిరిజనేతరులు ఈ అవకాశాన్ని వాడుకునేందుకు అర్హుల అవతారమెత్తారనే వాదన నిజమని ఈ అంకెలే చెబుతున్నాయి.

గుర్తించడం కష్టం

శాటిలైట్ చిత్రాల ఆధారంగా కూడా అటవీ, రెవెన్యూ శాఖలకు 2005 నాటికి ఉన్న పోడు భూములను ఖచ్చితంగా గుర్తించడం కష్టంగానే ఉంది. అయితే, దీనికి కూడా 2013లో గుజరాత్ లోని ఒక కోర్టు కేవలం శాటిలైట్ చిత్రాల ఆధారంగా తుది నిర్ణయానికి రావద్దని, హక్కును తిరస్కరించవద్దని అడ్డం పడింది. అటవీ భూముల హక్కు చట్టం తెచ్చినప్పుడు కేంద్రం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సూక్ష్మస్థాయి పరిశీలన చేయించి అడవిలో ఏ భూమి సాగులో ఉందో, ఏది అడవిగా మిగిలివుందో రాష్ట్రాలకు తెలియజేసింది. దీని ఆధారంగానే 2008 లో మన దగ్గర భూ పంపిణీ జరిగింది.

రాష్ట్ర స్థాయిలో ఆ సర్వే సాధ్యపడదు. వీలైతే పోడు సాగుతున్న చోట లేదా దాని సమీపంలోని ప్రభుత్వ భూమిని అర్హులకిచ్చి ఆ భూమి సాగుకు సరిపడే నీటిని, విద్యుత్ సరఫరాను అందించాలని సీఎం ఆదేశాలున్నాయి. పోడు సాగు కోసం కాకుండా ప్రభుత్వ భూములలో అడవిని ధ్వంసం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే, పీడీ యాక్ట్ ప్రయోగించాలని అటవీ శాఖను ఆయన ఆదేశించారు. అదే విధంగా పోడు హక్కుల భూములలో గంజాయి సాగు చేసేవారి భూపత్రాలను రద్దు చేయాలన్నారు. ఇంతవరకు పోయింది పోగా, మిగిలిన అడవికి సరిహద్దులు పెట్టి కట్టుదిట్టంగా కాపాడుకోవాలనే ఆలోచన ఆయన మాటలలో వ్యక్తమవుతోంది.

వారే అధికంగా ఉన్నారు

అయితే, వచ్చిన అప్లికేషన్లపై మరో అడుగు వేయడమే క్లిష్టంగా తయారైంది. సగానికి పైగా గిరిజనేతరులే ఇందులో ఉన్నారనే మాట వినిపిస్తోంది. పరిశీలన మొదలు పెడితే కొత్త చిక్కులు వచ్చేలా ఉన్నాయి. ఎందరికి భూమి హక్కులిచ్చినా ఇదే చివరి అవకాశం కాదు. ఇది నిరంతర ప్రక్రియ. మళ్ళీ ఒక్క అప్లికేషన్ వచ్చిన పరిశీలించవలసిందే. సరియైన లెక్కలు ఆధారాలు ప్రభుత్వం దగ్గర లేనందున కాదనడానికి కుదరదు. ఇలా కక్కలేక మింగలేక చిక్కుముడిని విప్పలేక ప్రభుత్వం దిగులు పడుతుంటే మరోవైపు అటవీ భూములపై సాగు చేసుకుంటున్న గిరిజనులకు, అధికారులకు మధ్య ఘర్షణ సాగుతోంది. ముప్పై ఏళ్లుగా దున్నుతున్న భూమిని అటవీ సిబ్బంది బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని రైతులు అంటున్నారు. కొన్ని చోట్ల నివాసాలను తొలగించేస్తున్నారు. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన ఆదివాసీలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. కొందరిపై కేసులు పెట్టారు.

రాజకీయ పక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు వాస్తవ లబ్ధిదారుల ఎంపిక దిశగా ఒక అడుగు వేసేలా ప్రభుత్వం అధికారులను ఆదేశించక తప్పదు. డబుల్ బెడ్ రూము ఇళ్ళలాగానో, దళితులకు మూడెకరాల భూమి మాదిరో పక్కన పెట్టడానికి ఇది పార్టీ ఎన్నిక హామీ కాదు. కేంద్ర చట్టం, కాబట్టి దారి వెతుక్కోవాలి. రాబోయే ఎన్నికలలో ఓట్లతో ముడిపడివున్న ఈ సున్నిత సమస్యను అర్హులకు న్యాయం జరిగేలా, అన్ని వర్గాలు అంగీకరించేలా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

బి.నర్సన్

94401 28169


Next Story

Most Viewed