స్థానిక అవసరాలకు.. ఈ ఎన్నికలే పరిష్కారం!

by Ravi |   (  Updated:2025-11-30 01:15:55  IST  )

మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా స్థానిక అవసరాలు గుర్తించి ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనే అవగాహన, కానీ సమయం గానీ వాటికి ఉండవు. స్థానిక సమస్యలు ఒక ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి..

స్థానిక అవసరాలకు.. ఈ ఎన్నికలే పరిష్కారం!
X

మన దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా స్థానిక అవసరాలు గుర్తించి ఆ సమస్యలకు పరిష్కారం కనుగొనే అవగాహన, కానీ సమయం గానీ వాటికి ఉండవు. స్థానిక సమస్యలు ఒక ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి.. ఈ స్థానిక సమస్యలను, అవసరాలను తీర్చడంలో స్థానిక ప్రభుత్వాలు ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. ప్రజాస్వామ్య విజయం అధికార వికేంద్రీకరణపై ఆధారపడి ఉంటుంది.

అధికార వికేంద్రీకరణకు స్థానిక ప్రభుత్వాలు ఉప కరిస్తాయి. మనదేశంలోని స్థానిక సంస్థలను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, పట్టణ, నగర స్థానిక ప్రభుత్వాలు.. మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామీణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఉదాహరణ. పట్టణాలలోని మున్సిపా లిటీలు, నగరాల్లోని నగరపాలక సంస్థలు పట్టణాలు ఈ వ్యవస్థ కిందకి వస్తాయి.

పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్వాపరాలు..

గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్‌లతో కూడిన మూడంచెల గ్రామీణ స్థానిక ప్రభుత్వ సంస్థల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడిన బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957 సిఫాస్సు చేయడం జరిగింది. ఈ సిఫార్సులను అనుసరించి రాజస్థాన్ ప్రభుత్వం 1957 అక్టోబర్ 2న మొట్టమొదటిగా పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959లో అక్టోబర్ 11వ తేదీన పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాయి.

నేటికీ 95 కోట్లమంది గ్రామాల్లోనే..

1977లో అశోక్ మెహతా కమిటీ గ్రామ పంచాయతీలో జిల్లా పరిషత్తులతో కూడిన రెండంచెల స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ పంచాయతీల ద్వారా సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ ఆశయం. ఈనాడు నగరీకరణ పెరిగినప్పటికీ ఇంకా సుమారు 95 కోట్ల మంది భారతీయులు గ్రామాల్లో నివసిస్తున్నారు. వీరిలో సుమారు 45% మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రభుత్వాలైన పంచాయతీరాజ్ వ్యవస్థకు ప్రాముఖ్యం ఉంది.

73వ రాజ్యాంగ సవరణతో రాజ్యాంగ ప్రతిపత్తి..

పంచాయతీ రాజ్ అంశం రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో చేర్చడం జరిగింది. ఆదేశిక సూత్రాలలోని అంశాలను ప్రభుత్వాలు విధిగా పాటించాలన్న నియమం లేదు. ఈ కారణంగా మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ కొంత నిరాదరణకు గురైంది. 1992 సంవత్సరంలో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి జవసత్వాలను ఇచ్చింది. 73వ రాజ్యాంగ సవరణను అనుసరించి ప్రతి గ్రామ పంచాయతీలో అనివార్యంగా గ్రామసభ సమావే శాలను సంవత్సరంలో కనీసం రెండు సార్లు నిర్వహించాలి. గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులు.. గ్రామసభ, గ్రామస్థాయి శాసనసభ వలె పని చేయాలి. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఈ సభ ప్రధాన పాత్రను పోషిస్తుంది. అయితే, దురదృష్టవశాత్తు ఈ గ్రామ సభ సమావేశాలు మొక్కుబడిగా మారాయి అన్న విమర్శ ఉంది.

అధికారులే ‘స్థానిక’ పాలకులు

తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలతో పాటు 539 మండల ప్రజా పరిషత్‌ల పాలక వర్గ గడువు 2024 ఫిబ్రవరి 1తో ముగిసినా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పెండింగ్‌లో ఉన్న కారణంగా పంచాయతీ ఎన్నికల అంశం కొంత గందరగోళానికి గురైంది. పంచాయతీ రాజ్ వ్యవస్థకు ఎన్నికలు నిర్వహించని కారణంగా ఆ సంస్థలు పూర్తిగా అధికారాలు అధికారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ కారణంగా గ్రామీణులు ప్రజా ఆరోగ్యం, తాగు నీరు, పారిశుధ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. స్థానిక సంస్థలకు పాలక వర్గాలు లేకపోవడం వలన గత 20 నెలలుగా కేంద్రం నుండి రావాల్సిన ₹3000 కోట్లు నిధులు ఆగిపోయాయి. దీంతో గ్రామీణ అభివృద్ధి నిధులు లేక సమస్యలు ఎదుర్కొంటోంది.

బీసీ రిజర్వేషన్ రహిత ఎన్నికలు..

తెలంగాణ హైకోర్టు 42% బీసీ రిజర్వేషన్‌పై తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు వల్ల కొత్త రిజర్వేషన్ విధానం అమలులోకి రాకపోవడంతో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక‌లను పాత రిజర్వేషన్ ప్రకారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరో ముఖ్య విషయం.. పంచాయతీ ఎన్నికలు మార్చి నెలాఖరు కంటే ముందు నిర్వహించకపోతే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ₹3,000 కోట్ల నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు వినియోగానికి అనర్హం కావడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను త్వరితగతిన విడుదల చేసింది.

-డా. పి. మోహన్ రావు

మెంబర్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.

99495 95509

Next Story