అప్పుల కోసం... విద్యారంగం అస్తవ్యస్తం!

by Ravi |   (  Updated:2024-02-15 01:00:40  IST  )

For debt... the education sector is chaotic!

అప్పుల కోసం... విద్యారంగం అస్తవ్యస్తం!
X

నూతన విద్యా విధానం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన దిక్కుమాలిన ప్రయోగాలతో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు గడచిన మూడేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారనేది వాస్తవం. జగన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్న ఘనమైన విద్యావిధానానికి విరుద్ధంగా ఏపీ విద్యారంగం పూర్తిగా భ్రష్టు పట్టి పోయింది.

పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని టీడీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ నివాస సముదాయాలకు సమీపంలోనే ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తే, జగన్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ అప్పు నిబంధనల కోసం పెత్తందారీ పోకడలకు పోయి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక పాఠశాల మాత్రమే ఉండాలంటూ వేలాది బడులకు తాళాలేయించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చేరిన ఒకటో తరగతి విద్యార్థుల సంఖ్య 4.65లక్షల మంది అయితే, ప్రైవేటు పాఠశాలల్లో కొత్తగా చేరిన వారి సంఖ్య కూడా దాదాపు 4 లక్షలకు చేరింది. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య గతేడాది 29 లక్షలుగా ఉంటే, ఈ విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34 లక్షలకు పెరిగింది.

ప్రభుత్వ స్కూళ్ల నుంచి జంప్

జగన్ రెడ్డి అప్పుల పిచ్చితో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. ఒక ఊరికి గతంలో రెండు, మూడు ఉండే ప్రాథమిక పాఠశాలల్ని తీసేసి, 3, 4, 5 తరగతుల్ని కూడా ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు లేకపోవడంతో 1, 2 తరగతుల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి విముఖత చూపారు. గతేడాది 10లోపు విద్యార్థులు ఉన్న బడుల్లో ఈ ఏడాది ఒక్కరు కూడా చేరలేదు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వం వందలకొద్దీ పాఠశాలల్ని మూసేసింది.

విద్యాశాఖ గణాంకాల ప్రకారం, 2021-22 నాటికి దాదాపు 43 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారు. 2023 జూలై నాటికి ఆ సంఖ్య 37.80 లక్షలకే పరిమితం అయ్యింది. జగన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో 4.50 లక్షల నుంచి 5 లక్షల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు గుడ్ బై చెప్పారు.

అసలేమిటి ఈ రుణం?

SALT (supporting Andhras Learning Transformation) ఒప్పందంలో భాగంగా 2021లో అయిదేళ్ల కాలానికి గాను విద్యారంగ అభివృద్ధికి 250 మిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంకు లోన్ (రూ.2,200 కోట్లు) తీసుకున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 1020 మిలియన్ డాలర్లు. అంటే 8,500 కోట్లు దానిలో ప్రపంచ బ్యాంకు వాటా 2,200 కోట్లు. కాకపోతే ఇందులో మానవ వనరుల మీద ఖర్చును తగ్గించుకోవాలనే నిబంధనను ప్రపంచ బ్యాంక్ పెట్టింది. మానవ వనరుల తగ్గింపు అంటే ప్రధానంగా ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడమే. ప్రపంచ బ్యాంకు పెట్టిన ఈ షరతుకు లోబడి జగన్ సర్కార్ నిస్సిగ్గుగా అప్పు తీసుకుంది. అందువల్లనే తన హయాంలో ఇప్పటివరకు టీచర్ పోస్టుల భర్తీకోసం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు.

ఎమ్మెల్యేలే ఎదురుతిరిగినా..

ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యేలే ఎదురు తిరిగారు. కానీ జగన్ సర్కార్ అప్పుల కోసం తాను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లింది. విలీనం పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థుల్ని హైస్కూళ్లకు తరలించారు. దాంతో 1,2,3,4 ప్రాథమిక పాఠశాలలు విలీనమయ్యాయి. 3, 4, 5 తరగతులు లేకపోవడంతో 1, 2 తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే దిక్కయ్యాడు. దాంతో రాష్ట్రంలో 9వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంతో కాస్త ఆర్థికంగా భారమైనా ప్రైవేటు పాఠశాలల్లో అయితే 1 నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసే అవకాశముందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులు మాన్పించారు. విద్యార్థులు లేక రాష్ట్రంలో 500 వరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి.

ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో 23 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న జగన్, తాను ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా డీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయలేదు? ఎందుకంటే, ప్రపంచ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సాహసించ లేకపోయింది. ఇప్పుడేమో... ఎన్నికలు సమీపించాయి కాబట్టి మొక్కుబడిగా 6,100 పోస్టులకు డీఎస్సీ విడుదల చేశారు. ఎన్నికల ముందు నిరుద్యోగులపై జగన్ రెడ్డికి ఎంత ప్రేమ.. ఎంత ఔదార్యమో కదా! విద్యావిధానంలో గుట్టుమట్లు, బైజూస్ కంటెంట్ వెనకున్న కథాకమామిషు ఏమిటో త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాం!

- నీలాయపాలెం విజయ్ కుమార్

ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి

Next Story