బీసీల కోసం.. చరిత్రాత్మక ఆర్డినెన్స్

by Ravi |   (  Updated:2025-07-17 00:45:33  IST  )

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో

బీసీల కోసం.. చరిత్రాత్మక ఆర్డినెన్స్
X

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, బీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018లో సవరణలు చేస్తూ, ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. దీనివల్ల బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయి. అవసరమైతే 50% రిజర్వేషన్ పరిమితిని దాటే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ఒక సామాన్య నిబంధన కాదని, ఇది రాజ్యాంగబద్ధమైన, సామాజిక న్యాయానికి అనుగుణమైన, బీసీ వర్గాల దీర్ఘకాలిక పోరాటానికి స్పందనగా వచ్చిన చర్యగా అర్థమవుతుంది.

ఆర్డినెన్స్ ఎందుకంటే?

తెలంగాణలో బీసీలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నా, పాలనా వ్యవస్థలో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని హక్కుగా భావించే దేశంలో పూర్తిగా అన్యాయం అనే చెప్పాలి. దీనిని సరిచేసేందుకు ఆర్టికల్ 213 ప్రకారం శాసనసభ సమావేశం లేనప్పుడు తక్షణ చర్యగా ఆర్డినెన్స్ మంజూరు చేయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశాన్ని కోల్పోకుండా, న్యాయం ఆలస్యం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ డేటా ఆధారంగా..

ఇందిరా సాహ్నీ తీర్పు (1992)లో 50% పరిమితి ప్రస్తావించబడినా, అదే తీర్పులో “అసాధారణ పరిస్థితుల్లో” ఆ పరిమితి మించవచ్చని కోర్టు పేర్కొంది. అది డేటా ఆధారంగా, సరైన పరిశీలనతో ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మేరకు కుల గణాంక సర్వేలు, బీసీ జనాభా 50%కి మించి ఉందని నిరూపించాయి. అలాగే బీసీ కమిషన్ బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయని స్పష్టం చేసిన నివేదికలు ఉన్నాయి, దీంతో పాటు సమకాలీన అధ్యయనాలు, బీసీలు పాలనా వ్యవస్థలో తక్కువ స్థాయిలో ఉన్నారని సూచిస్తున్నా యి. ఈ డేటా ఆధారంగా తీసుకొచ్చే ఆర్డినెన్స్ రాజ్యాంగాన్ని విస్మరించేది కాదు. దాన్ని పరిపూర్ణం చేసే ప్రయత్నం.

ముస్లిం రిజర్వేషన్‌లో విజయగాథ

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను తొలుత కోర్టుల్లో సవా ల్ చేసినా, బీసీ కమిషన్ నివేదికలు, వెనుకబడినతనం ఆధారాలపై సుప్రీంకోర్టు చివరికి ఈ రిజర్వేషన్‌ను సమర్థించింది. ఇది ఇప్పుడు తెలంగాణలో తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌కు న్యాయపరమైన అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుంది.

రాజకీయ పునరుద్ధరణకు శ్రీకారం!

ఈ ఆర్డినెన్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఓ రాజకీయ హామీని కాదు, ఒక సామాజిక బాధ్యతను నెరవేర్చింది. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీకి నిదర్శనం. “జిత్ని ఆబాదీ, ఉత్నా హక్క్” (ఎంత జనాభా ఉంటే అంత ప్రాతినిధ్యం ఉండాలి). ఈ ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీ వర్గాలను పాలనలో భాగస్వామ్యం చేసే చారిత్రక ఆరంభానికి దారితీస్తోంది. బీసీ ఉద్యమకారులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన ఉద్యమానికి గట్టి మద్దతు ఇవ్వాలి. ఇది బీసీల రాజకీయ పునరుద్ధరణకు శ్రీకారం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్, సామాజిక న్యాయ చరిత్రలో ఒక మైలురాయి.

-ఎ. సంజీవ్ ముదిరాజ్

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

Next Story