‘ఫ్లూయిడ్ లెర్నింగ్’తోనే.. విద్యకు దిశా నిర్దేశం

by velandi.Saikiran |

ప్రస్తుత విద్యా విధానం ఒకే చోట స్థిరంగా ఉండే విద్యార్థుల కోసం రూపొందించబడింది.

‘ఫ్లూయిడ్ లెర్నింగ్’తోనే.. విద్యకు దిశా నిర్దేశం
X

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గిపోవడం ఇప్పుడు తీవ్రమైన సామాజిక-విద్యా సమస్యగా మారింది. తాజా అంచనాల ప్రకారం, సుమారు 25 నుంచి 40 శాతం వరకు విద్యార్థులు తరచూ గైర్హాజరు అవుతున్నారు. ఇది కేవలం గణాంకం కాదు… రాష్ట్ర భవిష్యత్తుపై మోపుతున్న మౌన హెచ్చరిక. విద్యార్థులలో ప్రతిభ కొరవడటం కాదు… వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, ఉపాధి కోసం జరుగుతున్న వలసలే ఈ సంక్షోభానికి అసలు కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుత విద్యా విధానం ఒకే చోట స్థిరంగా ఉండే విద్యార్థుల కోసం రూపొందించబడింది. కానీ ముఖ్యంగా కూలీ వర్గాల కుటుంబాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయి. ఈ మార్పుల మధ్య పిల్లల చదువు మధ్యలోనే ఆగిపోవడం, పాఠశాల మార్పులు కష్టసాధ్యంగా మారడం, చివరికి డ్రాపౌట్‌లకు దారితీస్తోంది. సంప్రదాయ విధానాలతో ఈ సమస్యకు పరిష్కారం కష్టమే. అందుకే విద్యావేత్తలు, పాలనాధికారులు కలిసి ‘ఫ్లూయిడ్ లెర్నింగ్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచిస్తున్నారు.

విద్యార్థి కేంద్రంగా వ్యవస్థ మార్పు

‘ఎనీవేర్ అడ్మిషన్’.. విద్యార్థి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి మారినప్పుడు, అడ్మిషన్ ఒక అడ్డంకి కాకూడదు. యూనివర్సల్ స్టూడెంట్ ఐడీ ఆధారంగా రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ పాఠశాలలోనైనా తక్షణ ప్రవేశం కల్పించే విధానం అవసరం. ఇది అమలైతే, వలసల వల్ల చదువు ఆగిపోవడం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుత వ్యవస్థలో ఒకసారి రెసిడెన్షియల్ స్కూల్‌లో చేరిన విద్యార్థి, మధ్యలో మార్పు చేసుకోవడం కష్టం. దీనికి పరిష్కారంగా రెసిడెన్షియల్ డే స్కాలర్, సెమీ రెసిడెన్షియల్ మధ్య సులభంగా మారే వెసులుబాటు కల్పించాలి.

సర్టిఫికెట్ల డిజిటలైజేషన్

అడ్మిషన్ ప్రక్రియలో సర్టిఫికెట్ల సేకరణ పెద్ద అడ్డంకిగా మారుతోంది. మీ సేవా ఈ -సేవా ద్వారా టీసీ స్టడీ సర్టిఫికేట్ మార్కుల మెమోలు పూర్తిగా ఉచితంగా, తక్షణమే అందేలా చేయాలి. ఇది అమలైతే పాఠశాలల చుట్టూ తిరిగే ఇబ్బందులు పూర్తిగా తగ్గిపోతాయి. ప్రస్తుతం టీచర్లు బోధనతో పాటు క్లరికల్ పనుల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు. సర్టిఫికెట్ జారీ బాధ్యతలను మండల విద్యాశాఖ అధికారి పరిధిలోకి తీసుకురావడం ద్వారా టీచర్ల పనిభారం తగ్గుతుంది. దీంతో డ్రాపౌట్ రేటు 70% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్లు క్షణాల్లో అందుబాటులోకి వస్తాయి. బోధన సమయం 30% నుంచి 90% వరకు పెరుగుతుంది.

విద్యార్థి ప్రగతికి బలమైన మద్దతు

వేసవి బ్రిడ్జ్ క్యాంపులు. వలసల వల్ల చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ప్రతి మండలంలో హై-లెవల్ మానిటరింగ్‌తో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారినప్పుడు, పాత పాఠశాలలోని ప్రగతి వివరాలు కొత్త టీచర్‌కు వెంటనే అందేలా డిజిటల్ పోర్ట్‌ఫోలియో వ్యవస్థ. అవసరం. ఈ సంస్కరణలు సామాజిక న్యాయం దిశగా కీలక అడుగు. వలసల వల్ల విద్యను కోల్పోవాల్సిన అవసరం లేదు.

ముందుగా పైలట్ ప్రాజెక్ట్‌

ఈ విధానాలను మొదట కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, తరువాత విస్తరించాలి. మారాల్సింది విద్యార్థులు కాదు… వ్యవస్థ. విద్యార్థులు తమ పరిస్థితులకు తగ్గట్టు మారిపోతున్నారు.. ఇప్పుడు వ్యవస్థ కూడా వారి అవసరాలకు అనుగుణంగా మారాల్సిన సమయం వచ్చింది. “అక్షరం గమ్యం వైపు సాగాలి… పేదరికం దానికి అడ్డు కాకూడదు!”

ఐనేని జయంత్ రావు

90308 08919

Next Story