పురుషాధిక్య జపాన్‌లో మహిళా నాయకత్వం – సనే తకైచి కొత్త అధ్యాయం

by Ravi |   (  Updated:2025-11-04 00:30:39  IST  )

జపాన్ దేశ‌ తొలి మహిళా ప్రధాన మంత్రిగా 64 ఏండ్ల సనే తకైచి ఎంపిక కావడం ఓ అద్భుత చరిత్ర. పురుషాధిక్య జపాన్‌లో ఒక మహిళ దేశ ప్రధానిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది.

పురుషాధిక్య జపాన్‌లో మహిళా నాయకత్వం – సనే తకైచి కొత్త అధ్యాయం
X

జపాన్ దేశ‌ తొలి మహిళా ప్రధాన మంత్రిగా 64 ఏండ్ల సనే తకైచి ఎంపిక కావడం ఓ అద్భుత చరిత్ర. పురుషాధిక్య జపాన్‌లో ఒక మహిళ దేశ ప్రధానిగా ఎంపిక కావడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నది. 64 ఏండ్ల సనే తకైచి కోబ్ యూనివర్సిటీ నుంచి‌ డిగ్రీ పట్టా పొందారు. ఆటో మోటివ్ సంస్థలో తండ్రి, పోలీసు శాఖలో తల్లి పనిచేసే వారు. ఈమె హెవీ మెటల్‌ డ్రమ్మర్‌గానే కాకుండా పియానో వాయిద్యకారిణిగా కూడా పేరు తెచ్చుకుంది. స్కూబా డైవర్‌, రచయిత్రి, శాసనసభ్యురాలు, టీవీ ప్రసారకురాలిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి జపనీయుల మన్ననలు పొందారు. 2025 నుంచి లిబరల్‌ డెమొక్రటిక్‌ పార్టీకి అధ్యక్షురాలిగా సేవలు అందించారు. గత పదేళ్లకు పైగా మంత్రి పదవులు కూడా నిర్వహించిన ఈమె 1993 - 94ల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 1994లో లిబరల్స్‌ సభ్యు రాలిగా, 1994 - 1996 మధ్య ఎన్ఎఫ్‌‌పిలో చేరి సభ్యురాలిగా ప్రజాసేవ చేశారు. నవంబర్‌ 1996లో ఎల్‌డిపీలో చేరి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ‘టకు యమమోటో’ను వివాహమాడిన ఈమెకు ముగ్గురు సంతానం. 2021లో జరిగిన పార్టీ నాయకత్వ ఎన్నికల్లో మూడవ స్థానంలో నిలిచిన తకైచి 2022 నుంచి 2024 వరకు ఆర్థిక భద్రతా సహాయ మంత్రిగా పని చేసింది. స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన తకైచి జీవిత భాగస్వాములకు ప్రత్యేక ఇంటి పేర్లను గుర్తించడంతో పాటు జపాన్‌ సింహాసనంపై స్త్రీ వారసత్వం వంటి సామాజిక అంశాలపై సంప్రదాయవాద వైఖరి తీసుకున్నారు. వివాదాస్పదమైన యసుకుని పుణ్యక్షేత్రాన్ని క్రమం తప్పకుండా సందర్శించే తకైచి తైవాన్‌ అనుకూల, చైనా ప్రతికూల భావాలను వ్యక్తం చేసేవారు. నేడు జపాన్‌ జనాభాలో వృద్ధులు అధికంగా ఉండటం తకైచి పాలనకు ఒక అగ్ని పరీక్ష కానుంది. రోజురోజుకు జపాన్‌లో జనాభా తగ్గుతూ వృద్ధుల సంఖ్య పెరుగుతూ పనిచేసే బలగాలు తగ్గడంతో అభివృద్ధి కుంటుపడే విషమ పరిస్థితి ఏర్పడింది. జపాన్‌ దేశ తొలి ప్రధానమంత్రిగా రుజువు చేసుకొని లింగ సమానత్వ లక్ష్యాలను అధిగమిస్తారని కోరుకుందాం. సనే తకైచికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.

-డాక్టర్‌ బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Next Story