- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుకు బ్రాండ్ ఇమేజ్ అవసరమే! ఎందుకంటే..?
ప్రపంచంలో ఏదైనా ఆగొచ్చు.. కానీ వ్యవసాయం ఆగొద్దు. మనిషి బతకాలంటే ఆహారం కావాలి. అందుకే ఆ ఆహారాన్ని పండించే రైతు బతకాలి.

ప్రపంచంలో ఏదైనా ఆగొచ్చు.. కానీ వ్యవసాయం ఆగొద్దు. మనిషి బతకాలంటే ఆహారం కావాలి. అందుకే ఆ ఆహారాన్ని పండించే రైతు బతకాలి. ఇప్పుడేం నష్టం జరిగిందన్న ప్రశ్న రావచ్చు. నిజమే... తీవ్ర నష్టం జరుగుతు న్నది. రైతును బతికించాలంటే రక్షణ చర్యలు చేపట్టాల్సిందే. రైతు అమాయకుడు. తను పండించిన పంట ఇది అని గర్వంగా చెప్పుకునే స్థితి లేదు. తన ఉత్పత్తి ఎంత నాణ్యమైనదో, ఎంత కష్టంతో కూడుకున్నదో నలుగురికి చెప్పలేని ధైన్యం. రైతు బతకాలంటే.. రైతు రైతుగా మిగలాలంటే వ్యాపారిగా మారాలి. అంతకు మించి పారిశ్రామికవేత్తగా, ఎంటర్ ప్రెన్యూర్‌గా ఎదగాలి. అప్పుడే రైతు విలువ పదింతలవుతుంది.
అవును.. ఇది కొత్తగా అనిపించినా ఎవరో పండించిన పంటకు యజమానిగా మారి వ్యాపారం చేస్తోన్న దళారీ వ్యవస్థ నుంచి విముక్తి పొందాలంటే మారక తప్పదు. ప్రతి ఒక్కరూ రైతు, వ్యవసాయం గురించే మాట్లాడుతున్నారన్న సందేహాలు తలెత్తొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, రైతు సంక్షేమం, రక్షణ కోసం అనేక చట్టాలు తెచ్చాయన్న డౌట్ రావచ్చు.. కానీ వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియకపోవడం వల్లే రైతుకు నష్టం, కష్టం.
చట్టాలపై అవగాహన కల్పించేందుకు..
అందుకే లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) అనే సంస్థ చట్టం రైతు చుట్టం కావాలంటూ సాగు న్యాయయాత్రను చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,400 కి.మీ. ప్రయాణించి, కనీసం 10 వేల మంది రైతులను నేరుగా కలిసి, కీలకమైన వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భూమి, విత్తనం, సాగు నీరు, పంట రుణాలు, పంటల బీమా, వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి అమల్లో ఉన్న కీలక చట్టాలను రైతాంగానికి వివరిస్తున్నారు. ఈ టూర్‌లో నేను కూడా భాగస్వామిని అయ్యాను.. జూన్ 28న లీఫ్స్ సంస్థ ఈ సాగు న్యాయయాత్రను ప్రారంభించింది. భూదానోద్యమానికి పురిగొల్పిన ఊరు భూదాన్ పోచంపల్లి నుంచే యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, మునుగోడు, చండూరు, నాంపల్లి, మల్లెపల్లి వరకు కొనసాగింది. ఐతే ఇందులో నల్లగొండ జిల్లా నాంపల్లి మా సొంతూరు.. అందుకే అక్కడ నాకు మా రైతు బంధు మిత్రులను కలుసుకునే అవకాశం లభించింది. ఇక్కడే నాకు మాట్లాడే అవకాశాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, భూమి చట్టాల నిపుణులు, లీఫ్స్ చైర్మన్ భూమి సునీల్ ఇచ్చారు.
బ్రాండ్ ఇమేజ్
నాకు పెబ్బేరులో ఓ మిత్రుడు ఉన్నాడు. అతను ఉన్నత చదువులు చదివాడు. కానీ ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నారు. అందుకే నాకు ప్రతి ఏటా మామిడిపండ్లు పంపిస్తాడు. మార్కెట్‌లో కిలో రూ.100 ఉంటే అక్కడి నుంచి వచ్చే వాటికి రూ.200 ఉంటుంది. అతను ఐదు కిలోల మామిడిపండ్లను ఓ అట్టపెట్టెలో ప్యాక్ చేస్తాడు. దానిపై తన ఫామ్ మ్యాంగోస్ అని బ్రాండ్‌ని కూడా ముద్రించాడు. గజ్వేల్ నుంచి బత్తాయిపండ్లు వస్తాయి. 10 కిలోల బ్యాగ్. దానిపైనా ఓ బ్రాండ్ ఉంటుంది. అదే కుర్మపల్లి నుంచి యాదయ్య అనే రైతు నాకు రెడ్ రైస్ బియ్యం పంపాడు. 50 కిలోలు బస్తాలో పోసి ఇచ్చాడు. దాని మీద ఎలాంటి పేరూ లేదు. ఈ మూడు ఉత్పత్తుల్లో తేడా చూడండి.. ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్లు వ్యవసాయం చేసి పండించిన పంటకు బ్రాండ్ ఇమేజ్ తోడయ్యింది. ఆ ప్యాకెట్ల మీద, అట్ట పెట్టెల మీద ఆ పండ్ల రకాలు, వాటి నాణ్యత, పండ్ల రకం వంటి అనేక విషయాలను ముద్రించారు. ఎలాంటి మందులు వాడలేదని కూడా పేర్కొన్నారు. అందుకే ఉత్పత్తికి డబుల్ రేట్ వచ్చింది. అదే సామాన్య రైతు రెడ్ రైస్ పండిస్తే సాధారణ ధర పలికింది. ఇక్కడ ఉత్పత్తి, శ్రమను చెప్పుకోగలిగితేనే ప్రయోజనం.
లీటర్ పాలు రూ.230
నాకు తెలిసిన ఓ డెయిరీ యాజమాన్యం లీటరు పాలను రూ.230 కి అమ్ముతున్నది. అవే పాలు మా ఊరిలో రూ.80 మాత్రమే. మా ఊర్లో కూడా చిక్కగానే పోస్తారు. నీళ్లు కలపకుండానే పోయడానికి రైతులు సిద్ధం. కానీ ధరలో ఎంతో తేడా ఉంది. దీనికి కారణం.. ఆ యాజమాన్యం ఉన్నత విద్యావంతులు.. పైగా ఉత్పత్తి, నాణ్యతపైన రీసెర్చ్ చేశారు. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా గాజు బాటిళ్లనే వాడుతున్నారు. ప్లాస్టిక్‌ని వాడడం వల్ల ఎంత నష్టమో ప్రచారం చేస్తున్నారు. దాంతో వాళ్ల ఉత్పత్తికి డిమాండ్. ఊర్లల్లో రైతు లు కూడా బర్లకు నాణ్యమైన గడ్డినే మేతగా వేస్తారు. కెమికల్ వేసి గడ్డి పెంచాల్సిన అవసరం కూడా లేదు. రైతు బర్ల పాలు కూడా ఆర్గానిక్ పాలే కదా. డిమాండ్ మాత్రం లేదు. దీనికి కారణం శ్రమ, నాణ్యతను చెప్పుకోవడంలో నెలకొన్న తేడా.
ఇది నా ఉత్పత్తి
నేను రైతును.. నా ఊరు ఇది. ఇది నేను పండించిన పంట. అని రైతు సొంతంగా బ్రాండ్‌ని క్రియేట్ చేసుకోవాలి. కార్పొరేట్ కంపెనీ ఎలాగైతే పేరు పెట్టుకొని ఆర్గానిక్ పంటలను అమ్మేస్తున్నదో, అదే తరహాలో రైతు కూడా బ్రాండ్‌ని రిజిస్టర్ చేసుకోవాలి. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడే రైతు పండించిన తన పంటను వ్యాపారి తరహాలో అమ్ముకోవచ్చు. చిన్న రైతులెవరూ రసాయనాలు వినియోగించకుండానే కూరగాయలు పండిస్తారు.. సేంద్రీయ ఎరువులు మినహా ఏవీ వాడరు. అలాంటప్పుడు చిన్నకారు రైతులు పండించిన కూరగాయలన్నీ ఆర్గానిక్ రకమే. అందుకే ఆ రైతు ఆర్గానిక్ కూరగాయల పేరిట మార్కెట్‌లో అమ్ముకోవడం ద్వారా కార్పొరేట్ కంపెనీల లాభాలకు అడ్డుకట్ట వేయొచ్చు. అలాగే రైతు శ్రమకు కాస్త అధిక లాభం దక్కుతుంది. ఇది నా ఉత్పత్తి అని చెప్పుకొని అమ్ముకోవడానికి ప్రతి రైతు సమూహానికి ఓ బ్రాండ్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఊరంతా కలిసి కూడా ఓ బ్రాండ్‌ని రిజిస్టర్ చేసుకొని ఎగుమతి చేయొచ్చు. ఈ రకమైన సదుపాయం చట్టాల్లో ఉన్నది. రైతులు కూడా సొంత బ్రాండ్‌ని క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. రైతులు పండించిన పంటలు కార్పొరేట్ అద్దాల మేడల్లో లేబుల్స్ అతికించి ఆర్గానిక్ పేరిట ఎంత ధరలు పలికిస్తున్నారో ఆలోచించాలి. ఆ లేబుల్ కూడా రైతు సొంతం కావాలి. ఈ అంశాలనే మా ఊరి నా స్పీచ్‌లో మాట్లాడాను. చాలా మందికి అవునా, నిజమా? అన్న డౌట్‌తోనే సమావేశం ముగిసింది.
– శిరందాస్ ప్రవీణ్‌కుమార్






