- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా నేలపై ఫ్యాక్టరీ.. ఉద్యోగాలు మాకే కావాలి!
కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణం దాదాపు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవు తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతీక. వరంగల్ జిల్లా ప్రజల చీరకాల కోరిక.

కాజీపేట అయోధ్యపురంలో నిర్మాణం దాదాపు పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమవు తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతీక. వరంగల్ జిల్లా ప్రజల చీరకాల కోరిక. ఈ ప్రాజెక్ట్ కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాలు, ప్రజా ఒత్తిడులు, ప్రతినిధుల హామీలు అన్ని కలిసి సాధించిన ఫలితం ఇది.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది కేవలం ఒక పరిశ్రమ కాదు, అది ఈ ప్రాంత ఆత్మగౌరవ ప్రతీక. 1980వ దశకంలోనే రాజీవ్ గాంధీ హయాంలో ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్న హామీ రాయబరేలీకి తరలిపోయింది. పీవీ నరసింహారావు హయాంలో మంజూరైనా, రాజకీయ కారణాలతో పంజాబ్‌లోని కపుర్తలాకు తరలించారు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 13వ షెడ్యూల్, 10వ అంశంగా పొందుపరిచినప్పటికీ, కేంద్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి జాప్యం జరిగింది.
ఇక్కడి యువతకు ప్రాధాన్యం వద్దా?
ఇలా ఎన్నో నిరసనలు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షల తర్వాత ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు చివరి దశకు చేరిన నేపథ్యంలో స్థాని కులకు ఉద్యోగావకాశం కల్పించే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఓ ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తోంది. కోచ్ ఫ్యాక్టరీ మన నేలపై, మన భూములపై నిర్మాణమైతే, ఉద్యోగాల్లో ఇక్కడ యువతకు ప్రాధాన్యం దక్కకూడదా? మడికొండలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ ప్రశ్నకే సమాధానం కోరింది. తెలంగాణ రైల్వే JAC ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. సందేశం స్పష్టం.. ప్రారంభో త్సవ వేడుకల కంటే ముందుగా నియామకాలపై స్పష్టత అవసరమని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని యువత రైల్వేలో ACT అప్రెంటిషిప్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోచ్ ఫ్యాక్టరీలోని నియామకాలు పూర్తిగా బాహ్య నియామకాలుగా జరిగితే అది సామాజిక న్యాయానికి విరుద్ధం.
డివిజన్ సాధన..
ఇక కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు న్యాయ సమ్మతమైన, సహేతుకమైన డిమాండ్. అన్ని రకాల అవకాశాలున్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా కార్మికులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.. ఉద్యమాలు చేస్తున్నారు. సౌత్‌సెంట్రల్ రైల్వేలోనే ఆరు డివిజన్లలోకెల్లా కాజీపేట డివిజన్ పరిధిలోనే 46.8% ఆదాయం వస్తుంది. అలాగే ఇతర డివిజన్లలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు.. ప్రతిపాదిత కాజీపేట డివిజన్ పరిధిలో మూడు జంక్షన్లు అధికారికంగా పెద్దపల్లి, డోర్నకల్, కారెపల్లి, అనధికారికంగా మానిగర్, జగ్గయ్యపేట జంక్షన్లు ఉన్నాయి. మొత్తం స్టేషన్లు 83 ఉన్నాయి. కాబట్టి రైల్వే డివిజన్ ఏర్పాటు సహేతుకమైనదే.
నిర్లక్ష్యం జరిగితే తరాలు క్షమించవు..
ఈ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం ఒక వేడుక మాత్రమే.. కానీ ఆ ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకున్నప్పుడు లోపల పని చేసే యువ కుడు స్థానికుడైతేనే అది నిజమైన విజయోత్సవం అవుతుంది. పాల కుల నిర్లక్ష్యం వల్లో, తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత నియామక విధానా ల వలన ఈ అవకాశం చేజారితే రాబోయే తరాలు మనల్ని క్షమించవు.. ఇక ప్రభుత్వాలు తరచూ ‘అభివృద్ధి’ని ప్రస్తావిస్తాయి. కానీ అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందనప్పుడు అది కేవలం గణాంకాల అభివృద్ధి మాత్రమే అవుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు మారవు.. కాబట్టి ఈ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టమైన తీర్మానం చేసి కేంద్రానికి పంపడం అవసరం.
ప్రజా మద్దతు ఉండాలంటే..
ఇక స్థానిక ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై గళమెత్తాలి.. కేంద్ర మంత్రులు రైల్వే శాఖతో సమన్వయం చేసి నియామక విధానంపై స్పష్టత తీసుకురావాలి. స్థానికులకు ప్రాధాన్య నియామకాలు, భూ నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకే జీలు, అప్రెంటిస్‌లకు న్యాయమైన వాటా ప్రకటిస్తే ప్రభుత్వాలకు ప్రజా మద్దతు మరింత బలపడుతుంది. లేదంటే సాధించిన విజయమే అసంతృప్తికి కారణమవుతుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రైల్వేలో వ్యాపార అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన వరకు మన పోరాటం ఆగకూడదు. ఈ పోరాటం ఎవరికీ వ్యతిరేక పోరాటం కాదు. ఇది హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేసే విజ్ఞప్తి. మార్చి 8న కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిరసన దీక్ష, పార్లమెంట్ సమావేశాల సమయంలో ఢిల్లీలో కార్యక్రమం చేపట్టాలనే నిర్ణయాలు ప్రజల్లో పెరుగుతున్న ఆవేదనకు ప్రతిబింబం. ఈ హెచ్చరికలను పాలకులు నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదు.
-బండి. దుర్గా ప్రసాద్
రైల్వేకోచ్ ప్యాక్టరీ సాధన పోరాట కమిటీ కన్వీనర్
79811 84208






