- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ.. ఇస్రో 50 ఏళ్ల ప్రయాణం
ఓ పక్క ఆకలి, అసమానత, వివక్షత, నిరుద్యోగం వంటి మహమ్మారులతో పేదరిక సంగ్రామంలో పోరాడుతూనే

ఓ పక్క ఆకలి, అసమానత, వివక్షత, నిరుద్యోగం వంటి మహమ్మారులతో పేదరిక సంగ్రామంలో పోరాడుతూనే, అభివృద్ధి చెందిన భారతం కావాలంటే అంతరిక్ష ప్రయోగాల్లో మన సత్తా చాటాలన్న విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తితో ఎన్నో అవమానాలను, అప జయాలను దాటేసి అడుగు ముందుకేసింది మన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). యావత్ ప్రపంచం చూస్తున్న వేళ విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్-3M రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట స్మార కార్థం తయారు చేయబడ్డ మన తొలి ఉపగ్రహం "ఆర్యభట్ట"ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది."INDIA ENTERS SPACE AGE" అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో కీర్తించింది.
సోవియట్ యూనియన్ సహకారంతో..
ఈ ప్రయోగం కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు.. గర్వంతో ఐక్యమైన దేశ భావోద్వేగ సంబరం. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాల సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 360 కిలో గ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఎక్స్-రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం, సోలార్ ఫిజిక్స్‌లో ప్రయోగాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్‌లోని పరిస్థితులను అన్వేషించడం వంటి తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్ని ఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టి విజయవంతం చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారతీయ రెండు రూపాయల నోట్ల వెనుక భాగంలో ఆర్యభట్ట ఉపగ్రహ నమూనా చిత్రాన్ని మన దేశ ప్రభుత్వం ముద్రించింది.
ఈ యాభై ఏళ్లలో..
50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. అద్భుతమైన అంతరిక్ష విజయాలను ఎన్నో చవిచూశాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శతకోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధృవపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 మిషన్‌ను ప్రయోగించాం. నేడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి వున్నాం. డాకింగ్, అన్ డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్ యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. తొలి ఉపగ్రహం ఆర్యభట్టను అంతరిక్షంలోకి పంపడానికి రష్యా సాయం తీసుకున్న మనం కేవలం ఐదు దశాబ్దాలు తిరిగే సరికి ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ఈ సందర్భంగా విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం, సతీష్ ధావన్, హోమ్ జహంగీర్ బాబా వంటి మహానుభావుల కృషిని మనం స్మరించుకోవాల్సిందే. అంతరిక్ష పరిశోధనలో మన ఈ ప్రస్థానం ఇదే విధంగా కొనసాగుతూ ఏదో ఒక రోజు అగ్రదేశాలకు దీటుగా అగ్రస్థానంలో ఇండియా ఉంటుందని ఆశిద్దాం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
93947 49536






