'నేమ్‌'లో ఏముంది... 'ఫేమ్‌'తోనే పని ఉంది!

by Disha edit |
నేమ్‌లో  ఏముంది... ఫేమ్‌తోనే పని ఉంది!
X

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ నానుడి అంతరార్థం ఇతరులెవరికన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే ఎక్కువ తెలుసు. రాష్ట్ర సాధనకు, తాను శీర్షభాగాన ఉంటూ నడిపిన ఉద్యమానికి ఊపిరిపోసిన మూలసూత్రమిది! అటువంటి అవసరం ఏర్పడిందంటే, ఎంతటి శ్రమకోర్చి అయినా అది సాధించేవరకు ఆయన వదలరు. ఇలాంటి విషయాల్లో ఆయనది రాక్షస కృషి అంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)ని రాజకీయంగా విస్తరిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గా ప్రకటించి నెలలు గడుస్తున్నా.... ఆ పేరుకు ఇంకా అనుకున్న స్థాయిలో ప్రచారం లభించటం లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పత్రికల్లో, ఇతర ప్రసార మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వ్యాపార ప్రకటనలూ ఇప్పించారు. సంక్రాంతి పండుగ తర్వాత ఖమ్మం గుమ్మం నుంచి ఒక పెద్ద సభకు సన్నాహాలూ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఈ సంబూరం ద్వారా అక్కడి నుంచీ కొంతమందిని రప్పించి, సందేశం పంపాలన్నది ఒక వ్యూహం కావచ్చు!

విస్తరణ ఓకే కానీ…

సంస్థాగతంగా విస్తరణ తర్వాతి సంగతి, ముందు పేరైతే బలంగా వెళ్లాలిగా! బయటి సంగతలా ఉంచితే, పార్టీలోనే నాయకులు, కార్యకర్తల శ్రేణిల్లోకి పేరు మార్పు అంత తేలిగ్గా వెళ్తున్నట్టు లేదు. పార్టీ అంతర్గతంగా, బయటివారితో జరిపే సంప్రదింపులకు సంబంధించి కాగితాలపై టీఆర్‌ఎస్‌ స్థానే బీఆర్‌ఎస్‌ అని నాయకత్వం మారుస్తున్నా, అంత రూఢిగా ఈ మార్పు... ఆలోచనల్లో, నోటి మాటల్లో ప్రతిబింబించట్లేదు. ఇరవై మూడేళ్లుగా నాటుకుపోయిన 'టీఆర్‌ఎస్‌'అనే పదం, పార్టీ నాయకులు, కార్యకర్తల నోటి మాటల్లోంచి పోవట్లేదు. కొత్త పేరు ఇంకా పార్టీ శ్రేణుల 'మెదడు మ్యాప్‌' లోకి ఎక్కుతున్నట్టు లేదు, అందుకే 'బీఆర్‌ఎస్‌' అనే మాట అలవోకగా నాయకుల సంభాషణల్లో, ముచ్చట్లలో, ఎదుటివారి ప్రశ్నలకు సమాధానాల్లో ఇంకా పలకటం లేదు. అలవాటు పడ్డ టీఆర్‌ఎస్‌ గానే పలుకుతున్నారు. 'పీపుల్స్‌ పల్స్‌' సర్వే సంస్థ అప్పటికప్పుడు నిర్వహించిన ఓ 'మెరుపు సర్వే' ఫలితాలు దీన్నే ధృవీకరిస్తున్నాయి. నిర్దిష్ట ప్రశ్నలు వేయటం, పలుకరింపు సన్నివేశాల సృజన, సంభాషణలు జరుపడం, పక్కనుండి మౌనంగా వారి సంభాషణల్ని గమనించడం వంటి వేర్వేరు ప్రక్రియల ద్వారా ఈ సర్వే నిర్వహించారు. అత్యధికులు ఇంకా టీఆర్‌ఎస్‌ అనే పలుకుతున్నారు.

అన్ని స్థాయిల్లోనూ అదే పరిస్థితి

మాజీ ఎమ్మెల్సీ ఒకరిని చాన్నాళ్ల తర్వాత పలుకరించి, కావాలనే... 'ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నది' అనడిగితే, 'ఇంకెక్కడన్నా, టీఆర్‌ఎస్‌ లోనే, అప్పుడు వెళ్లిన్నుంచి ఇక అక్కడే ఉన్నా!' అని బదులిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పరం సంభాషణల్లో అయినా, పార్టీ వారు ఇతరులతో జరిపే సంభాషణల్లో అయినా, పార్టీ ఇంకా టీఆర్‌ఎస్‌ పేరుతోనే చలామణి అవుతోంది. 'బీఆర్‌ఎస్‌' అనే మాట, అంత తేలిగ్గా నోటికి రావటం లేదు. మరో సీనియర్‌ నాయకుడితో మాట్లాడుతుంటే... 'పోటీనా, ఏముంది, మా జిల్లా వరకైతే ప్రధానంగా టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్యే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్‌ బాగా బలహీనపడింది' ఇదీ వరస! టీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవలి నిర్ణయంతో బీఆర్‌ఎస్‌గా మారిన సంగతి వారికి తెలియదని కాదు! తెలుసు, మళ్లీ అడిగితే ఓ చిన్నపాటి నవ్వు తర్వాత... 'అవును, ఇంకెక్కడి టీఆర్‌ఎస్‌, మేం మారిపోయాం కద! ఇక మేమిప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీయే' అంటారు కానీ, అలవోకగా నోటికొచ్చేది మాత్రం టీఆర్‌ఎస్‌ అనే!

తెలంగాణలోని దాదాపు సగానికిపైగా జిల్లాల్లోని యాబై మండలాల్లో ఓ చిన్నపాటి మెరుపు సర్వే నిర్వహించినపుడు 72 శాతం మంది, తమ రోజువారీ ముచ్చట్లలో, సంభాషణల్లో ఇంకా టీఆర్‌ఎస్‌ అనే పలుకుతున్నట్టు వెల్లడయింది. నేరుగా బీఆర్‌ఎస్‌ అంటున్న వాళ్లు 4 శాతం ఉంటే, ఒక 21 శాతం మంది మాత్రం ముందు టీఆర్‌ఎస్‌ అన్నా, వెంటనే సవరించుకొని బీఆర్‌ఎస్‌ అంటున్నారు. మామూలు సంభాషణల్లోనూ బీఆర్‌ఎస్‌ అనే మాటనే రావడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. 'కాలం గడుస్తుంటే దానంత అదే వచ్చేస్తుంది, ఈ జాప్యం వల్ల నష్టమేమీ లేదు కదా!' అన్న ధీమా కావచ్చు నాయకులు, కార్యకర్తలు కూడా దీన్నంత సీరియస్‌ ఇష్యూగా పరిగణించడం లేదు. మీడియాలో మాత్రం వేగంగా ఈ మార్పు ప్రతిబింబిస్తోంది. 'మీడియా వేగం వల్లే మా వాళ్లు క్రమంగా అలవడుతున్నారు. రోజూ అదే చదువుడాయె, ఇంక మేం మారకుండా ఎలా ఉంటాం! మహా అంటే, ఇంకా కొద్ది కాలం పడుతుంది అంతే!' అని, దక్షిణ తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌ నాయకుడు అభిప్రాయపడ్డారు.

సమస్య కాదనే...

బీఆర్‌ఎస్‌ నామ స్మరణకు పార్టీ నాయకత్వం ఎందుకు పట్టుబట్టడం లేదు అనే సందేహం సహజం. గులాబీ జెండా మారనప్పుడు, ఎన్నికల గుర్తు, కారు మారనప్పుడు...ఒక్క పేరు గురించే అంతగా పట్టింపు, శ్రేణులపై ఇప్పట్నుంచే ఒత్తిడి పెంచడం ఎందుకు అని అధినాయకత్వమూ ఒకింత ఉదాసీన వైఖరి వహిస్తోంది. 'నోటికి క్రమంగా అదే అలవడుతుందిలే' అన్నది అగ్రనాయకత్వం ధీమా! జాతీయపార్టీగా గుర్తింపు లభించే వరకు అన్ని రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ కు 'కారు'నే తప్పనిసరి ఎన్నికల గుర్తుగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, వారికి సానుకూలత ఉంది.

దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీకి, కారు ఎన్నికల గుర్తుగా లేదు. ఇప్పుడది, ఎవరికీ కేటాయించని 'ఫ్రీ సింబల్‌' బాస్కెట్‌లో ఉంది. 'మేం జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేసి, వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాం, అన్ని చోట్ల మా వారికి ఇదే గుర్తు కేటాయించండి' అని ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ వినతి చేసుకునే అవకాశం ఉంది. ఆ వినతిని ఎన్నికల సంఘం అనుమతించే ఆస్కారం బలంగా ఉంది. ఇటువంటి సందర్భాల్లో న్యాయస్థానాలు కూడా సదరు రాజకీయ పార్టీలకే దన్నుగా వ్యవహరించిన సందర్బాలు లోగడ ఉన్నాయి. మజ్లీస్‌ ఇత్తహాదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం) 'తక్కెడ' గుర్తు కోసం, ప్రజారాజ్యం (పీఆర్పీ) పార్టీ 'ఉదయించే సూర్యుడు' గుర్తు కోసం వినతి చేసిన సందర్భాలు ఇలాంటివే!

విస్తరణకొక మాధ్యమం...

బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తం చేయడం ఎలా అన్న అంశం మీదే కేసీఆర్‌ చాన్నాళ్లుగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు వార్త. విస్తరణ విషయంలో ఎదురయ్యే కఠిన అవరోధాలు, జఠిల పరిస్థితి గురించి కూడా పార్టీలోని ఇతరులు అందరి కన్నా కేసీఆర్‌కే ఎక్కువ తెలుసు. అలా వెళ్లడానికి ఒకటి లేదా కొన్ని ముఖ్యమైన సారూప్య అంశాలుండాలి. పలు రాష్ట్రాల్లోని జనానికి ఉమ్మడిగా వర్తించే బలమైన 'ఎజెండా' ఓ మాధ్యమంగా ఉండాలి. ఈ దూరదృష్టితోనే ఆయన గత కొంత కాలంగా దేశంలో పాలన ఘోరంగా ఉందని, అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ కూడా ఏమీ చేయకపోవడం వల్లే దేశానికి జరగాల్సినంత ప్రయోజనం కలగట్లేదని గొంతెత్తారు. బీజేపీని నేరుగా, కాంగ్రెస్‌ను పరోక్షంగా వ్యతిరేకించే శక్తులతో కలిసి ఉమ్మడి ప్రత్యామ్నాయం కావాలని కేసీఆర్‌ 2018 నుంచి ముమ్మరంగా యత్నిస్తున్నారు. వేర్వేరు పార్టీల నాయకులతో భేటీలు వేశారు. స్వయంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లారు, లేదా వారే తనవద్దకు వచ్చేలా చేసుకున్నారు.

రాజకీయంగా ఈ అడుగులు వేస్తూనే... అంశాల పరంగా కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కావాలన్నారు. తద్వారా... వ్యవసాయాన్ని పండుగ చేయడం, సమర్థ జలవినియోగంతో ప్రతిపంటకు నీరు, తగిన ఉత్పత్తితో ఉచిత విద్యుత్తు, బడుగు బలహీనవర్గాలను వివిధ '...బంధు' పథకాల ద్వారా ఆదుకోవడం.... వంటివి చేయాలని, చేస్తామని ప్రకటించారు. ఒక ప్రత్యామ్నాయ 'ఫ్రంట్‌' అంటూ తానే మొదట్లో ప్రచారం చేసినా, తర్వాతి కాలంలో ''ఫ్రంట్‌, టెంట్‌ ఏమీ లేదు. కలిసివచ్చే ప్రగతిశీల శక్తులతో కూడి ఏం చేస్తే దేశానికి మంచిదో ఆలోచిస్తామ'ని ప్రకటించారు. వ్యవసాయాన్ని ఒక ఉమ్మడి ఎజెండా చేయాలన్న వ్యూహం ఆయన మెదడులో ఉండబట్టే, తగినంత ముందుగానే పంజాబ్‌, మహారాష్ట్ర వెళ్లి రైతులకు ఆర్థిక సహాయంగా చెక్కులు పంపిణీ చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకుల తెలంగాణ పర్యటన ఏర్పాటు చేసి, వారితో పలు దఫాలు భేటీలు చేశారు. ఎన్నో హామీలు ఇచ్చారు.

ఇది నిలిచే నమూనాయేనా?

తెలంగాణలో వ్యవసాయం తన అభివృద్ధి నమూనా అని, దీన్నే దేశవ్యాప్తం చేస్తామనేది... బీఆర్‌ఎస్‌ విస్తరణకు కేసీఆర్‌ నినాదంగా ఉంది. దానికైనా 'ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిందే'! రాష్ట్రంలో వ్యవసాయం నిజంగా, 'ఎదురేలేని విజయ నమూనానా' అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎప్పట్నుంచో ఉన్న ఉచిత విద్యుత్తు సరే! ఒక్క రైతు బంధుతో వ్యవసాయ సమస్యలన్నీ గట్టెక్కడం లేదు. అదీ, 10 ఎకరాలలోపు వారికే పరిమితం చేయాలనే డిమాండ్‌ వస్తోంది. రైతులకు హామీ ఇచ్చిన రుణమాఫీ జరుగలేదు. కొత్త అప్పులు పుట్టట్లేదు. 60 లక్షల కుటుంబాలకు రైతు బంధు అందుతుంటే, బ్యాంకుల (వ్యవస్థీకృత) ద్వారా రుణాలు 15 లక్షల కుటుంబాలకు మించటం లేదు. దాంతో, అత్యధికులు ప్రయివేటు అప్పులకు వెళ్లి అలమటిస్తున్నారు.

అందుకే, గత ఎనిమిదేళ్లలో 8 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 లో తమది 'గుజరాత్‌ అభివృద్ది నమూనా' అని మోదీ చేసిన ప్రచారం, దానికి లభించిన ఆదరణ... ఆయనను ప్రధానిగా చేసింది. 'నమూనా' ప్రచారానికి ఉన్నంత వ్యవస్థ ఆనాడు, ఆ వాదనను శాస్త్రీయంగా ఎదురించే కౌంటర్‌ ప్రచారానికి లేదు, ఇవాళ, బీజేపీకి ఉన్న ప్రచార పటిష్ట వ్యవస్థ లేవనెత్తే అంశాలకు జవాబు చెప్పే సంసిద్ధత బీఆర్‌ఎస్‌కు ఉందా నీతితో, నిజాయితీతో రైతుల కోసం పనిచేసుకునే ఒక చిన్న 'రైతుస్వరాజ్య వేదిక' లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక... 'ఉరికిచ్చి కొడతాం...' అని బెదిరించిన వాళ్లు రేపటి విమర్శలను తట్టుకొని నిలబడగలరా? తన అభివృద్ది నమూనాని ఉమ్మడి ఎజెండాగా దేశవ్యాప్తం చేసి పొందే 'ఫేమ్‌' ముఖ్యం బీఆర్‌ఎస్‌ విస్తరణకు. 'నేమ్‌'దేముంది ఇవ్వాల కాకుంటే రేపైనా 'టీఆర్‌ఎస్‌' వదిలి 'బీఆర్‌ఎస్‌' అనడం మొదలెడతారేమో!

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected],

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨


Read more:

బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సే.. నెల దాటినా మారని పార్టీ పేరు


Next Story