- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మం పేరుతో దుర్మార్గం.. ఇది దేశానికి హెచ్చరిక!
భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై సుప్రీంకోర్టు లోపల బూటు విసిరిన చర్య కేవలం ఒక వ్యక్తి ఆగ్రహ ప్రకటన మాత్రమే కాదు.

భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై సుప్రీంకోర్టు లోపల బూటు విసిరిన చర్య కేవలం ఒక వ్యక్తి ఆగ్రహ ప్రకటన మాత్రమే కాదు. ఇది మన దేశంలో పెరుగుతున్న మానసిక రుగ్మతల వాతావరణాన్ని స్పష్టంగా ప్రతిబింబి స్తుంది. న్యాయస్థానం అనేది చట్టం ఆధారంగా మాట్లాడే స్థలం. భావో ద్వేగాలకు స్థానం లేదు. ఈ సంఘ టన న్యాయస్థానం పవిత్ర గోడల్లోకి కూడా మత అసహనం చొచ్చుకు పోయిందని వెల్లడిస్తుంది.
2008లో ఇరాకీ జర్నలిస్ట్ ఒకరు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌పై బూటు విసిరారు. ఆ చర్య ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వ్యతిరేకతకు చిహ్నంగా మారింది. ఆ తర్వాత, భారతదేశంలో కూడా, పార్లమెంటు ప్రాంగణంలో రాజకీయ నాయకులు, మంత్రులపై బూట్లు విసిరిన సంఘటనలు ప్రజల ఆగ్రహ వ్యక్తీకరణగా నిలిచాయి.
వ్యక్తిగత నిరసనను మించిన దాడి..
అయితే, సుప్రీంకోర్టులో ఒక సిట్టింగ్ జడ్జిపై, అందులోనూ చీఫ్ జస్టిస్‌పై జరిగిన ఈ దాడి ప్రయత్నం వ్యక్తిగత నిరసనను మించినది. ఇది న్యాయం, చట్టం, ధర్మం, రాజ్యాంగ క్రమానికి చెందిన ఆదర్శాలపై అమానుషత్వంతో, మతోన్మాదంతో రెచ్చిపోయి చేసిన దాడి. న్యాయమూర్తులపై ఇటువంటి నిరసనలు చరిత్రలో చాలా అరుదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో కూడా సుప్రీంకోర్టు గౌరవం చెక్కు చెదరకుండా ఉండిపోయింది. న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా వృత్తిపరంగా ప్రమాదంలో పడినప్పటికీ, తన సిద్ధాంతాలలోనూ, వ్యక్తిత్వం విషయంలోనూ ఎన్నడూ రాజీ పడలేదు.
సనాతన ధర్మం.. సంయమనాన్ని నేర్పదా?
ఈ రోజు, ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై లేవనెత్తిన బూటు మన న్యాయ సంస్కృతిలో దుఃఖకరమైన క్షీణతను సూచిస్తుంది. ‘సనాతన సంకుచిత ధర్మం’ పేరుతో సాంస్కృ తిక దుందుడుకుతనం, రౌడీయిజం తీవ్రమైంది. ఈ దుశ్చ ర్యను చేపట్టిన వ్యక్తి న్యాయవాది ముసుగులో ఉన్న హిందు త్వ ఉగ్రవాది. ‘సనాతన ధర్మానికి జరిగే ఎలాంటి అవమానాన్ని సహించం’ అని అరిచాడు. ఇక్కడే నిజమైన సమస్య మొదలవుతుంది. వ్యక్తులు తమ భావజాలాన్ని మానవత్వం కంటే ఎక్కువగా ఉన్నతీకరించినప్పుడు, అదే సనాతన ధర్మం.. సంయమనం, కరుణ విలువలను బోధించలేదా?
రాజకీయ ఉగ్రవాదానికి పరాకాష్ట
మతం, ధర్మం, కుల, మత సంస్కృతి ఇప్పుడు వాదనల స్థాయి దాటిపోయి మతోన్మాద ధూర్తుల చేతిలో ఆయుధాలుగా మారాయి. సనాతనం, నిర్వచనం ప్రకారం, శాశ్వతమైనది, దానికి హింస ద్వారా రక్షణ అవసరం లేదు. కానీ, ఈ రోజు సంప్రదాయ రక్షకులుగా స్వీయ ప్రకటిత వ్యక్తులు దాని పునాది విలువైన సహనాన్ని విడిచిపెట్టి మరో ఉగ్రవాద రూపాన్ని తలకెత్తుకున్నారు. వారు రక్షిస్తున్నది ధర్మాన్ని కాదు, పెంచి పోషిస్తున్నది వారి ఆగ్రహాన్ని, అక్కసును, నిలువెల్లా ద్వేషాన్ని మాత్రమే. వారి అంధభక్తి, వారి రాజకీయ ఉగ్రవాదానికి పరాకాష్ట.
ఈ తీవ్రవాదం దేశానికి ప్రమాదకరం
ప్రధాన న్యాయమూర్తి గవాయ్ స్వయంగా దళిత నేపథ్యం నుండి వచ్చినవారు. ఆయన అత్యున్నత న్యాయస్థాన అధికారిగా ఎదగడం మన ప్రజల సమానత్వ స్ఫూర్తికి, రాజ్యాంగం ద్వారా సాధ్యమైన అవకాశానికి నిదర్శనం. ‘సనాతనం’ పేరుతో ఆయనపై దాడి జరగడం కుల వాదం, మతపరమైన అసహనం, క్షీణ భావజాల సంస్కృతికి ప్రతీక. ఈ తీవ్రవాదం మన దేశానికి చాలా ప్రమాదకరమైంది. ప్రధాన న్యాయ మూర్తి గవాయ్ గౌరవప్రదమైన జనాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘న్యాయవాదులు తమ వాదనలను సమర్పించనివ్వండి. ఈ చర్యలు నన్ను ప్రభావితం చేయవు. న్యాయ వాదులు శాంతిని కాపాడటం నేర్చుకోవాలి. ఆయన ఆ తర్వాత కూడా కేసును వినడం కొనసాగించారు. ఈ ఒక్క వాక్యం సమకాలీన రాజకీయ భాషపై తీర్పుగా నిలుస్తుంది.
మొగ్గలోనే తుంచేయాలి!
న్యాయస్థానం గౌరవం సమాజపు గౌరవం. సుప్రీంకోర్టు కేవలం న్యాయ సంస్థ మాత్రమే కాదు, ఇది మన దేశ నైతిక శిఖరం. దాని బెంచ్‌ను అపవిత్రం చేయడానికి చేసిన ప్రయత్నం మన గణతంత్రంపై నీతి, ధర్మంపై చేసిన దాడి. జనాభిప్రాయం హింస ద్వారా మాత్రమే బలహీనపడదు, గౌరవం క్షీణించినప్పుడు అది క్షీణిస్తుంది. న్యాయ వ్యవస్థపై గౌరవం మనలో ఇంకా మానవత్వం ఉందనడానికి నిదర్శనం. బూటు విసరడం న్యాయం చిహ్నం కాదు. అది దాని అంతం. ఈ పతనం మన దేశంలో 2014 నుండే ప్రారంభం అయింది. దీనిని మొగ్గలోనే తుంచి వేయాలి. మన సమాజం తప్పనిసరిగా ఒక గుణం పాఠాన్ని తిరిగి నేర్చుకోవాలి. ఈ మత వ్యాధి పీడితులకు దూరంగా ఉండాలి.
తీర్పు నచ్చకపోతే దాడి చేయవచ్చా?
ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వాదన సాగిస్తున్నప్పుడు కోర్టు టైం పాడు చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మందలించి ఉండవచ్చు. అది తప్పు అనుకుంటే కచ్చితంగా ఆ న్యాయమూర్తిని అభిశంసన చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దానికి బదులు చెప్పు విసిరికొట్టి, దేశంలోని సర్వోన్నత న్యాయస్థానాన్ని భ్రష్టు పట్టించటం తప్పు కదా? ఆ చెప్పు విసిరిన ఘటనను సమర్థించే వాళ్లకు ఒక ప్రశ్న. మనకి ఇష్టం లేకుండా ఒక జడ్జిమెంట్ వస్తే లేదా కామెంట్ వస్తే చెప్పులు తీసుకుని జడ్జిలను కొట్టవచ్చా? తన కుటుంబం వేసిన పిటిషన్‌పై అసహనంగా ఒక మాట మాట్లాడాడు అని ఏకంగా జడ్జినే చంపేయవచ్చా? ఏదేమైనా న్యాయంపై నమ్మకం ఉన్నవాడు విజయం సాధిస్తాడు. న్యాయాన్ని తిరస్కరించేవాడు చరిత్ర హీనుడై పతనం చెందుతాడు.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496






