అధికారంలో ఉన్నా అణగారినవారే.. వ్యవస్థ లోతుల్లోని కుల పక్షపాతం

by Ravi |   (  Updated:2025-10-21 01:15:54  IST  )

అత్యున్నత అధికార పీఠాలు అణగారిన వర్గాలకు అందుబాటులోకి వచ్చినా, సామాజిక వాస్తవికత ఆ పదవులను కూడా వివక్షా క్షేత్రాలుగా మారుస్తోంది. ఈ అధికార-సామాజిక వైరుధ్యం

అధికారంలో ఉన్నా అణగారినవారే.. వ్యవస్థ లోతుల్లోని కుల పక్షపాతం
X

అత్యున్నత అధికార పీఠాలు అణగారిన వర్గాలకు అందుబాటులోకి వచ్చినా, సామాజిక వాస్తవికత ఆ పదవులను కూడా వివక్షా క్షేత్రాలుగా మారుస్తోంది. ఈ అధికార-సామాజిక వైరుధ్యం భారత ప్రజాస్వామ్యంలో సామాజిక న్యాయ సాధనకు సవాలుగా పరిణమించి అణగారిన వర్గాల ప్రతీకార ఆవశ్యకతను నొక్కి చెబుతోంది.

అణగారిన వర్గాలు కేవలం పదవులను పొందడం మా త్రమే కాకుండా, ఆ పదవుల ద్వారా వ్యవస్థాగతమైన వివ క్షను సమూలంగా ఎదుర్కొనే చట్టబద్ధమైన అధికారా న్ని సాధించాలని. అలాగే వ్యవస్థీకృత వివక్షను ఎదు ర్కొనేం దుకు రాజకీయ అధికారం, ఏకీకృత శక్తి తప్పనిసరి అని ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు తెలియజేస్తున్నాయి.

న్యాయవ్యవస్థలో దాగిన కులతత్వం

భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అణగారిన నేపథ్యం నుంచి ఈ అత్యున్నత పదవికి చేరుకున్నారు. ఆయన స్థానాన్ని అంగీకరించలేని కులతత్వ రాజ్యాధికార ఆధిపత్యం ఇటీవల కోర్టు హాలులోనే ఒక న్యాయవాది దాడి చేసేందుకు ప్రయత్నించడం ద్వారా బహిర్గతమైంది. ఈ దాడి న్యాయవ్యవస్థను ధిక్కరించడమే కాక, దీని వెనుక అణగారిన నేపథ్యం పట్ల ఉన్న తీవ్ర పక్షపాతమే దాగి ఉందని స్పష్టమైంది. ఈ ఘటనపై జరిగిన దేశవ్యాప్త చర్చ, సమాజంలో అట్టడుగున ఉన్న కోట్లాది మంది నిస్సహాయ ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న తిరస్కరణకు, అగౌరవానికి ప్రతీకగా మారింది. ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ వివక్ష ఎదురైనప్పుడు, అది నిస్సహాయ ప్రజల గళాన్ని ఏకం చేసి, రాజ్యాంగ విలువలకు రక్షణగా నిలబడాల్సిన స్థానంలో సైతం పోరాడవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ఈ దాడిని అణగారిన నాయకత్వంపై ఆధిపత్య వర్గం చూపే తిరస్కరణగా, న్యాయవ్యవస్థ రాజ్యాంగ సమగ్రతను బలహీనపరిచేందుకు జరిగిన ధిక్కార చర్యగానే చూడాలి.

బ్యూరోక్రసీలోనూ వివక్షకు బలైన అధికారి..

హర్యానా కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య ఘటన, ఉన్నత పదవుల్లోని వ్యవస్థీకృత వివక్షకు తిరుగులేని సాక్ష్యం. అణగారిన వర్గానికి చెందిన పూరన్ కుమార్, సీనియర్ అధికారుల నుంచి కులం పేరుతో వేధింపులు, అవమానాలు, తప్పుడు కేసుల బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. అత్యున్నత పొలీస్ అధికారిగా ఉన్నా, ఆయనను లక్ష్యంగా చేసుకుని వేధింపులు ఆత్మహత్యకు దారితీయడం.. అధికారం అట్టడుగు వర్గానికి చేరినా, దానిపై వివక్ష నీడ పడుతుందనడానికి నిదర్శనం. ఈ సంఘటన, అణగారిన సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని, అభద్రతా భావాన్ని రేకెత్తించింది. పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా అణగారిన సంఘాలు ఏకమై నిరసనలు తెలుపడం, నిస్సహాయ ప్రజల గళం ఏకమవడానికి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడటానికి కారణమైంది. ఉన్నత పదవిలో ఉన్న అధికారి ఆత్మహత్య, కేవలం పాలనా వైఫల్యం కాదు. ఇది వ్యవస్థీకృత దౌర్జన్యానికి, రాష్ట్ర నైతిక నిర్మాణానికి జరిగిన ఘోర విఘాతంగా విశ్లేషించబడుతోంది. ఈ విషాదం, ఉన్నత స్థానంలో ఉన్న బహుజనుడికి సైతం రాష్ట్ర యంత్రాంగం రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిందని నిస్సహాయులకు స్పష్టం చేసింది. ఈ అంతర్గత వైఫల్యంపై ఉద్యమం తలెత్తింది.

రాజకీయ అధికార పీఠంలోనూ అవమానమే!

గతంలో ఒక మంత్రి పరిస్థితి గంజీల ఈగను గుంజేసినట్లు ఉండేది. ఇప్పుడు పీటలపై కుర్చోవడం, కుర్చీ నుంచి లేపడం, ఒక మంత్రిని, తోటి మంత్రి వివక్ష వాఖ్యలు చేయ డం, సదరు మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు, మాదిగ వర్గానికి చెందిన నాయకుడైనందునే జరిగాయని అణగారిన సంఘాలు ఆరోపించాయి. ఇలా ఏ కోణంలో చూసినా ఆ వాఖ్యలు మంత్రి పదవిలో ఉన్న తోటి మంత్రిపై చూపిన అగౌరవాన్ని ప్రతిబింబించాయి. అణగారిన సంఘాల ఒత్తిడితో చివరకు తోటి మంత్రి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. ఈ ఘటన, తమ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి, తమ రాజకీయ శక్తిని మరింత పటిష్టం చేసుకోవడానికి నిస్సహాయ ప్రజల గళం ఏకం కావాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది. ఈ పోరాటంలో వ్యక్తిగత ఆత్మగౌరవం, వర్గ ఆత్మగౌరవంగా రూపాంతరం చెందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయ వేదికపై ఆత్మగౌరవ యుద్ధం

తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అసెం బ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ నుంచి ఎదుర్కొన్న వ్యాఖ్యలు, అధికారంలో ఉన్నప్పటికీ గిరిజన నేపథ్యం పట్ల ఉన్న చిన్నచూపును ప్రతిబింబించాయని విమర్శకులు అరోపించారు. ఒవైసీ, తాను చెప్పేది సీతక్కకు అర్థం కావడం లేదంటూ, ‘ఆమెకు ఉర్దూ, ఇంగ్లీష్ రాదు’ అని వ్యంగ్యంగా మాట్లా డడం, గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన నాయకురాలిని, ఆమె ఆదివాసీ గుర్తింపును, నేపథ్యాన్ని కించపరిచేలా ఉం దంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పోరాటాల ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చిన సీతక్కను లక్ష్యంగా చేసుకొని భాషా ప్రాతిపదికన అగౌరవపరచడం, కేవలం వివక్షకి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనలు అణగారిన వర్గాల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుందనడానికి ప్రబలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని వాదిస్తున్నారు.

నిస్సహాయ ప్రజల ఏకగళం అవసరం!

అందుకే వ్యవస్థీకృత వివక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ అధికారం, ఏకీకృత శక్తి తప్పనిసరి. కేవలం సంక్షేమం లేదా రిజర్వేషన్లు కాదు. ఇది వ్యవస్థాగత వివక్షను కూలదోసి, రాజ్యాంగ రక్షణను నిజంగా అమలు చేయగలిగే 'బలహీనుల కోసం బలమైన అధికారం' అనే సిద్ధాంతాన్ని భారత రాజకీయాల్లో స్థాపించడం. అణచివేతకు అంతిమ సమాధానంగా, దేశవ్యాప్త సామాజిక ఉద్యమానికి నాంది పలకాలని ఆశిస్తున్నారు. నిస్సహాయ ప్రజల గళం ఏకమై, రాజకీయ అధికారాన్ని తమ రక్షణకు, అభివృద్ధికి వినియోగించుకున్నప్పుడే, రాజ్యాంగ సమానత్వం సంపూర్ణంగా సాకారమవుతుంది.

-డా.కట్కూరి

న్యాయ నిపుణులు

80192 01820

Next Story