సుంకాలు పెంచినా.. భారత్ లొంగిపోవటం కల్లే!

by Ravi |   (  Updated:2025-08-08 01:15:38  IST  )

ఇటీవల భారత్-అమెరికా సంబంధాలు రష్యా చమురు కొనుగోళ్ల చుట్టూ తీవ్రమైన వివాదంతో కొత్త మలుపు తిరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం

సుంకాలు పెంచినా.. భారత్ లొంగిపోవటం కల్లే!
X

ఇటీవల భారత్-అమెరికా సంబంధాలు రష్యా చమురు కొనుగోళ్ల చుట్టూ తీవ్రమైన వివాదంతో కొత్త మలుపు తిరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ, భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తోంది. యుద్ధానికి ముందు రష్యా నుంచి భారత్ దిగుమతి కేవలం 0.2 శాతం ఉండగా, ప్రస్తుతం అది 35 - 40 శాతానికి పెరిగింది. తక్కువ ధరలో చమురు అందించడం దీనికి కారణం.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొనుగోళ్లను తీవ్రంగా విమర్శించారు. 2025 ఆగస్టు 1 నుంచి భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని, రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని ఆంక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. దానికి తగ్గట్టుగా, అమెరికా భారత్‌పై మరో 25 శాతం సుంకం పెంచి, మొత్తం 50 శాతం సుంకం విధించిన అమెరికా భారత్‌పై గట్టి సవాల్ విసిరింది. అయితే ఈ సవాల్‌కు భారత్ లొంగిపోతుందా! లేక ఎదురొడ్డి ప్రతి చర్యకు పూనుకుంటుందా? అనేది నేటి ప్రశ్నగా మిగిలింది.

భారత్ స్పందన..

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఒత్తిడిని అన్యాయమై‌న, అసమంజసమైన దాడిగా విమర్శించింది. చమురు కొనుగోళ్లు రాజకీయ ఆమోదం కోసం కాక, ఆర్థిక అవసరాలు, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తూనే భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చే ద్వంద్వ ప్రమాణాలను భారత్ ఖండించింది. ఉదాహరణకు, 2024లో ఈయూ, రష్యా నుంచి 16.5 మిలియన్ టన్నుల గ్యాస్ దిగుమతి చేసుకుంది. అమెరికా యురేనియం, పల్లాడియం వంటి వస్తువులను రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ వాస్తవాలను ఎత్తి చూపుతూ, భారత్ అమెరికా విమర్శలను తిప్పి కొట్టింది.

రైతుల ప్రయోజనాలపై రాజీపడం!

భారతీయ రైతుల ప్రయోజనాలను విషయంలో రాజీపడబోమని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పడం గమనార్హం ‘రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం. రైతులు, మ త్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోం. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు.. రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎం త చెల్లించేందుకైనా నేను సిద్ధమే. భారత్‌ సిద్ధమే’ అని చెబు తూ ట్రంప్ హెచ్చరికను మోడీ పరోక్షంగా తోసిపుచ్చారు..

ఆర్థిక, రాజకీయ విధానం

భారత్ స్పందన దాని సంప్రదాయేతర విదేశాంగ విధా నాన్ని ప్రతిబింబిస్తుంది. రష్యాతో దీర్ఘకాలిక రక్షణ, శక్తి సం బంధాలను ఒకవైపు కొనసాగిస్తూనే, మరోవైపు అమెరికాతో సహకారాన్ని బలోపేతం చేయడం భారత్ వ్యూహం. దేశీయ ఉత్పత్తులను పెంచుకోవడం ద్వారా ఆర్థిక స్వావలంబనను సాధించే లక్ష్యంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపు‌నిచ్చారు. అమెరికా సుంకాలు, ఆంక్షలు భారత్‌ను ఈ దిశలో మరింత దృఢంగా నడవడానికి పురిగొల్పాయి.

అమెరికా ఒత్తిడి, ఉద్దేశాలు..

ట్రంప్ ఒత్తిడి వెనుక రెండు ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తా యి. ఒకటి, రష్యా ఆర్థిక ఆదాయాన్ని తగ్గించడం. రెండవది, అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో తమకు అనుకూల షరతులను రుద్దడం. అమెరికా- భారత్ వాణిజ్య లోటు 45 బిలియన్ డాలర్లుగా ఉంది. దీనిని తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే, చైనా, టర్కీ వంటి ఇతర రష్యా చమురు కొనుగోలుదారులపై సమాన ఒత్తిడి లేకపోవడం విమర్శలకు దారి తీసింది. ఈ వివక్ష సరైనది కాదు. అమెరికా విధానం దాని వైరుధ్యాలను బహిర్గతం చేస్తుంది. రష్యా నుండి భారత్ చేస్తున్న తక్కువ ధరల చమురు కొనుగోళ్లు ప్రపంచ చమురు ధరల స్థిరీకరణకు సహాయపడతాయని గతంలో అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికా మాట మార్చింది. ట్రంప్ ఒత్తిడి ఈ వైరుధ్యాన్ని బయటపెట్టింది. భారత్‌పై ఒత్తిడి తెచ్చే సమయంలో, పాకిస్తాన్‌తో ఇందన ఒప్పందాలను ప్రోత్సహించడం అమెరికా విధానంలో అస్థిరతను చూపిస్తుంది. రష్యా చమురు దిగుమతులను ఆపితే, భారత్ చమురు దిగుమతి ఖర్చు సంవత్సరానికి 9-11 బిలియన్ డాలర్లు పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది.

ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి..

అమెరికాతో వాణిజ్య చర్చల్లో భారత్ స్థానం బలహీనపడే అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ధీటైన స్పందన జాతీయ ఆసక్తుల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేస్తుంది. ఆగస్టు 25-29 లో న్యూఢిల్లీలో జరిగే వాణిజ్య చర్చలు ఈ సమస్యలను పరిష్కరించడానికి కీలకం కానున్నాయి. చివరిగా... రష్యా చమురు వివాదం భారత్ స్వయంప్రతిపత్తి, ఆర్థిక వ్యూహాన్ని పరీక్షిస్తోంది. అమెరికా ఒత్తిడి రాజకీయ ఒత్తిడిగా కనిపిస్తున్నప్పటికీ, భారత్ స్పందన దాని దీర్ఘకాలిక విదేశాంగ విధానాన్ని బలోపేతం చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమం, రష్యాతో సంబంధాల ద్వారా భారత్ తన ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి దృఢ సంకల్పంతో ఉంది. ఈ సంక్షోభం అంతర్జాతీయ రాజకీయాలలో శక్తి సమతుల్యతను, ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టింది. భవిష్యత్తులో భారత్ ఈ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని, తన జాతీయ ఆసక్తులను రక్షించుకోగలదని ఆశిద్దాం. అమెరికా ఒత్తిడులకు, బెదిరింపులకు భారత్ లొంగిపోవడం కల్లే..

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story