- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగా తప్పుచేసినా.. ప్రజలు సంఘటితంగానే చూస్తున్నాయి జాగ్రత్త!
మన సామాజిక వ్యవస్థలో మానవులు తమ విద్యుక్త కర్మల ఆచరణశీలు రుగా ఎదగలేదు. ధర్మ శాస్త్రాలు చదువుతూ కూడా స్వంత లాభం కొరకు

మన సామాజిక వ్యవస్థలో మానవులు తమ విద్యుక్త కర్మల ఆచరణశీలు రుగా ఎదగలేదు. ధర్మ శాస్త్రాలు చదువుతూ కూడా స్వంత లాభం కొరకు మరొకరికి అన్యాయం చేయడంలో జంకు గొంకు లేకుండా తమ పరిచయాన్నలా పెంచుకుంటూ పోతున్నారు నేటి మానవులు. అలా అన్యాయంగా, అక్రమంగా అవినీతితో వ్యవహరి స్తున్న వారిని శిక్షించడానికి దండనీతి శాస్త్ర ఆవిర్భావం అని వార్యమైంది. ఆ శాస్త్రాన్ని ఆచరణ లో పెట్టడానికి రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు పుట్టుకొచ్చాయి. అందులో అంతర్గత రక్షణ వ్యవస్థ పోలీసులది. బాహిర్ వ్యవస్థ మిలిటరీది. ఆపత్సమయంలో ఈ ఇద్దరిదే కాదు, దేశభక్తులైన పౌరులందరిదీనూ..
ప్రభుత్వంలోని నాయకులు, వివిధ శాఖల్లోని ఉద్యోగులు అధిక శాతం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనుట అతిశయోక్తి కానేరదు. చేతివాటంలో అదృష్టం కలిసిరాని వారు అవినీతి నిరోధక శాఖకు పట్టుబడుతున్నారు. ఈ మధ్య వెలువడుతున్న అన్ని వరుస కేసుల వివరాలే అందుకు సాక్ష్యం.
అక్రమాలన్నీ సక్రమాలవుతూ..
ఎవరి పని వారు చేస్తే ఇక రాజ్యం, దాని పాలనకోరాజు ఎందుకు? అనేది ఆర్షవిజ్ఞాన సూచనలోని అంతరార్థం. అలా ఎవరి పని వారు చేసుకోకుండా మనుషులు అర్థవాదులై, అధికారవాదులై, విలాసవాదులై, హింసా వాదులై తమ సుఖం కోసం మరొకరికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. కలియుగానికొచ్చేసరికి అక్రమాలన్నీ సక్రమాలై పోయాయి. అందుకే మానవుడు పారమార్థిక వాది కావాలన్నాడు స్వామి వివేకానంద. ఒళ్లంతా కుళ్లిన వ్యవస్థకు చికిత్సను ఎక్కడినుండి మొదలిడాలో తెలియని దుస్థితి మనది. విజ్ఞులు, రసజ్ఞులు, పరిపాలనోద్ధండులు వెలసిన రాజ్యంలో ఓట్ల కొనుగోలు వ్యాపారం చిలికి చిలికి గాలివానైంది.
ప్రతి పౌరుడూ బాధితుడే..
పచ్చనోట్లు, కత్తిపోట్ల కబంద హస్తాల్లో పౌరుని ఓటు బందీ అయింది. ఎవరు ఎవరిని నిందించాలో, అభినందించాలో తెలియలేని విషవలయంలో ప్రతి పౌరుడూ బాధితుడే! ప్రలోభాల ఊబిలో ఇరుక్కుపోయిన పౌరుడు పాలకులను ప్రశ్నించలేకున్నాడు. అల్ప సంఖ్యాకులైన మేధావులు మాత్రం మొహం చాటే స్తున్నారు. సాధారణంగా పోలీసులు ఎదుర్కొనే సమస్యలకు ముఖ్యమైన కారణాలు మూడు.. ప్రభుత్వ పాలనా క్రమంలో ఎదురయ్యే సమస్యలు.. యాజమాన్య బాధ్యతలను నిర్వర్తించవలసిన ఉన్నతాధికారగణం వాటిని ఎదుర్కొని క్షేత్రస్థాయి అధికారులకు తగు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించాలి. పౌర సమాజపు సంచలనాల దుశ్చర్యల మూలంగా సామాజిక ఉద్యమాల కారణంగా ఎదురయ్యే వి రెండో రకం సమస్యలు.. ఆ సమస్యల వలన ఉత్పన్నమయ్యే పరిణామాల ప్రభావాలను అంచనా వేయగల పరిణతి, దక్షత గల ఉన్నతాధికారగణం పటిష్టమైన చర్యలను రచించి క్షేత్రస్థాయి అధికారులకు దిశా నిర్దేశనాలను అందించి అమలు చేయి అందించాలి.
అధికార దర్పం... ధనార్జన!
పై రెండు సమస్యల స్థాయిని బట్టి పోలీసు శాఖలోని వివిధ హోదాల అధికారగణం ఒక సంఘటిత శక్తిగా ఎదుర్కొని, అవి జటిలమైన సమస్యలు కాకుండా నిరోధించి శాంతి భద్రతలను నెలకొల్పగలగాలి. కానీ, దానికి ముందే రాజకీయ ఒత్తిళ్ల ప్రభావం మూలంగా పోలీసుల కర్తవ్యదీక్ష ధృఢ సంకల్పం నీరుగారిపోతోంది. క్షేత్రస్థాయి అధికారులు అనాలో చితంగా పాలక రాజకీయ పార్టీ, ప్రభుత్వ దురాలోచనల మూసలోనికి నెట్టివేయబడుతున్నారు. తమ స్వార్థ రాజకీయాలకు కొమ్ముకాసే అధికారులకు అన్ని విధాల ప్రోత్సాహకాలు అందించడం జరుగుతోంది. ప్రతి పనికి ధరల పట్టి ఉండడం షరా మామూలే అనుకోండి. ప్రభుత్వ, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో నేటి తరం పోలీసు అధికారులు కొందరు ఉచితానుచిత విజ్ఞత, ఆత్మ పరిశీలన ద్వారా జనితమైన నిర్ణయాలతో ముందుకు సాగడంలో తెగింపును ప్రదర్శించలేకపోవడం కడు శోచనీయం. దాని కిటుకు వారి వారి బలహీనతల్లో ఉందని తెలుస్తోంది. అధికార దర్పం కొందరిదైతే ధనార్జన బలహీనత మరికొందరిది కావచ్చును.
ప్రభుత్వాల అవినీతి అందరినీ పాడు చేస్తే..
‘అధికారం అవినీతికి పురిగొల్పుతుంది. సంపూర్ణ అధికారం దుర్వినియోగానికి ఆజ్యం పోసి అధికారులను సాంతంగా అవినీతి పరులుగా మారుస్తుంది.’ ఎన్నో అనుభవాల దొంతరల్లోంచి వచ్చిన ఈ నానుడి నేటి పరిపాలనారీతులకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ స్థాయిలో, పౌర సమాజస్థాయిలో జరిగే అవినీతి, అక్రమాలను మౌనంగా వీక్షిస్తున్న కొందరు పోలీసు అధికారుల మస్తిష్కంలో స్వార్థపూరిత ఆలోచనలు రావడం ఓ యాంత్రిక క్రియగా మారిపోయింది. ఆ యాంత్రిక ఆలోచనను అర్ధవంతంగా తమ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి అడ్డ దారులు తొక్కుతూ నేటి పోలీసులు కొందరు అవినీతి సంపాదనలకు ఎగబడుతున్నారు. దాని పర్యవసానాన్ని, అవినీతి శాఖకు పట్టు బడుతున్న ఉదంతాల పరంపరలను యావత్ సమాజం చూస్తూనే ఉన్నది.
నీతి, నిజాయితీ.. అనగామేమి?
పోలీసుల సమస్యలకు అది మూడవదిగా ఎంచబడుతుంది. ఈ సమస్య పోలీసు అధికారి తనకై తాను సృష్టించుకున్నదే కదా! పౌర హక్కులు, శాంతి భద్రతల పరిరక్షణ, నిమిత్తమైన బంధనాలెరుగని అధికారాలను చట్టం పోలీసు అధికారికివ్వడం జరిగింది. కాని పోలీసు అధికారి మాత్రం తన ఉద్యోగ బాధ్యతలను నిజాయితీగా నిర్వహించడం గగనమైపోతోంది. నేనొక్కడినే నిజాయితీగా ఉంటే ప్రయోజనమేమిటి? అనే సాకులు సైతం ముందుకొస్తున్నాయి. పోలీసు అధికారి ఒక వ్యక్తిగా పనిచేయ వచ్చుగాక, కానీ ప్రజలు, చట్టం అతన్ని ఒక సంఘటిత శక్తిగా చూస్తున్నాయి. వ్యక్తి నీతి నిజాయితీనే వ్యవస్థ నీతి నిజాయితీగా ఎంచబడుతుంది. ఆ మూసలో ఇమిడిపోయి తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించే పోలీసు అధికారి ప్రజాస్వామ్య సిద్దాంతానికి, సమాజ కళ్యాణానికి పట్టుగొమ్మగా మారగలడు. అతనికి కావలసిందల్లా రాజకీయ కబంద హస్తాల నుండి చట్టబద్ధత మిళితమైన స్వేచ్ఛ.
-పెద్దిరెడ్డి తిరుపతి రెడ్డి
94400 11170






