- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టన్నుల కొద్దీ సాక్ష్యాలున్నా.. ఇంకా విచారణ కొనసాగిస్తారా?
సీబీఐ కేసుల్లో విచారణ జరుగుతున్న తీరు, జాప్యం ఆ సంస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లేలా ఉంది. సీబీఐ పంజరంలో

సీబీఐ కేసుల్లో విచారణ జరుగుతున్న తీరు, జాప్యం ఆ సంస్థలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పూర్తిగా సన్నగిల్లేలా ఉంది. సీబీఐ పంజరంలో చిలకగా మారిందని పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వివేకానందరెడ్డి హత్య కేసులో నిజమేనని రుజువవుతున్నాయి. టన్నుల కొద్దీ సాక్ష్యాలతో నేర తీవ్రత కళ్లకు కనపడుతున్నా విచారణ ఏళ్ల తరబడి సాగదీసి చివరకు కేసులను మూసివేస్తున్నారు.
వివేకా రెడ్డి హత్య కేసులో జరుగుతున్న జాప్యం తీవ్ర నైరాశ్యంలోకి నెట్టివేస్తుంది. ఈ నైరాశ్యంలో వెలుగు రేఖగా నిలుస్తున్నది సునీత పోరాటం.
ఇంతటి సంచలనాత్మకమైన కేసులో..
ఈ కేసులో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కోసం, తన తండ్రి హత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. జులై 19న విచారణ జరిగింది. సునీత తన వాదనలను న్యాయవాదిలా ధైర్యంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడేందుకు కూతురు సునీత చేసిన పోరాటం ఫలితంగా నారాసుర రక్తచరిత్ర కాస్తా.. జగనాసుర రక్తచరిత్రగా మారింది. సునీత పోరాటం చేయకపోతే గొడ్డలి పోటు కాస్తా గుండెపోటుగా మారేది. నిజాలన్నీ సమాధి అయ్యేవి. వివేకా హత్య కేసుని హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ చేపట్టింది. ఇంతటి సంచలనాత్మకమైన కేసులో జరిగిన జాప్యం, సీబీఐ విచారణ జరిపిన తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ముగిసిన దర్యాప్తును మళ్లీ చేస్తారట..
వివేకా హత్య కేసు దర్యాప్తు ముగిసిందని సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. న్యాయస్థానం ఆదేశిస్తే మరలా విచారణ చేస్తామని చెప్పడంలో సీబీఐ ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కథ ముగిసింది అన్న తర్వాత ఏం విచారిస్తారు, ఎవరిని విచారిస్తారు? వివేకా హత్య జరిగిన రోజు వేకువ జామున జగన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చిందని సీబీఐ వెల్లడించింది. ఈ విషయాన్ని జగన్ సలహాదారుడు అజయ్ కల్లం రెడ్డి సీబీఐకి తెలిపారు. మరి జగన్ రెడ్డిని విచారించకుండా దర్యాప్తు ఎలా ముగిస్తారు? వివేకాది సహజ మరణ మని వార్త ప్రచురించి ప్రచారం చేసింది సాక్షి మీడియా. ఇలాంటి తప్పుడు కథనాల వెనుక ఎవరున్నారో విచారించాలి కదా ఆ మీడియా యజమాని, అలాగే సహజ మరణంగా చిత్రీకరించడానికి కుట్లు వేసి, కట్టు కట్టిన డాక్టర్ల బృందం సాక్షాత్తూ భారతి రెడ్డి కుటుంబ సభ్యులే. అలాంట ప్పుడు ఆమెను కూడా విచారించాలి కదా..
పెద్ద కేసులను నీరుగార్చేస్తున్నారు..
సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి ముద్దాయి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్న పోలీసు అధికారులను, అప్పటి హోంమంత్రి, ముఖ్యమంత్రిని విచారించాలి కదా. ఇవేవీ చేయకుండా దర్యాప్తు ముగిసిందని చేతులు దులుపుకోవడంలో అత్యున్నత దర్యాప్తు సంస్థపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సీబీఐ విచారణ జరుపుతున్న కేసుల్లో అపనమ్మకం, అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థగా పేరుగాంచిన సీబీఐ… నేడు ప్రతి కీలక కేసులో మొదటగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అనంతరం సుదీర్ఘ విచారణల పేరుతో తీవ్రంగా జాప్యం చేస్తూ కేసులను నీరుగారుస్తున్నారు. ఇందుకు వివేకానంద రెడ్డి హత్య కేసే నిదర్శనం.
కీలక వ్యక్తికి ఇన్ని అవకాశాలా?
వివేకా హత్య తాలూకు ఆనవాళ్లు తుడిచి వేయడంలోనూ, గుండెపోటు కథ అల్లడంలోనూ అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని కోర్టుకు నివేదించింది సీబీఐ కాదా? వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు సీబీఐ పలు సందర్భాల్లో వెల్లడించింది నిజం కాదా? మొదట అవినాశ్ ప్రధాన అనుచరుడు ఉదయ్‌కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో తర్వాత అరెస్టు అవినాష్ రెడ్డిదే అని అందరూ భావించారు. కానీ అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవినాశ్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీం ప్రకటననూ నీరుగార్చి..
అవినాశ్ రెడ్డి అరెస్టును ఆపలేం అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అడ్డంకులేవీ లేకున్నా అవినాష్ అరెస్టు మాత్రం ఎందుకు జరగలేదు? ఈ కేసులో తండ్రీ కొడుకులు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మొదట సాక్షులుగా, తర్వాత అనుమానితులుగా, చివరికి నిందితులుగా మారారు. వివేకా హత్యకు కుట్ర పన్నింది వాళ్లేనని, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారని సీబీఐనే సూటిగా చెప్పింది. అవినాష్‌ను అనేకసార్లు గంటల తరబడి ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో సహా నిందితులుగా తండ్రి, తనయులలో తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి, సహ నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ దాగుడుమూతలు ఆడింది నిజం కాదా? అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో అడ్డంకులు లేకపోయినా సీబీఐ ఆ దిశగా అడుగులు వేయలేదు.
సీబీఐ విశ్వసనీయతకు పరీక్ష
సీబీఐ లాంటి వ్యవస్థలు రాజ్యాంగ విలువలను కాపాడుతూ తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిక్కచ్చిగా, నిజాయతీగా వ్యవహరించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. విచారణలు వేగంగా, నిష్పక్షపాతంగా జరగాలి. దోషులు ఎంతటి శక్తిమంతులైనా శిక్ష తప్పదన్న నమ్మకం ప్రజల్లో పునరుద్ఘాటించాల్సిన అవసరం ఉంది. సీబీఐ తక్షణమే ఈ కేసును పునర్ విచారణ జరిపి కుట్రదారులను, దోషులను బోనులో నిలబెట్టి తమ విశ్వసనీయతను రుజువు చేసుకోవాలి.
మన్నవ సుబ్బారావు
99497 77727






