- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమస్యల సాధనకై ఉద్యోగుల పోరుబాట!
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై టీజీఈజేఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్ అమలు వంటి కీలక డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ కార్యచరణ గురించి తెలుసుకోండి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న ఏళ్ల తరబడి జాప్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడమే లక్ష్యంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానంగా నాలుగు అంశాలను ఏప్రిల్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన లేఖలో జేఏసీ ప్రభుత్వం ముందు ఉంచింది.
జేఏసీ డిమాండ్లు ఇవే!
కేసీఆర్ హయాంలో తొలి పీఆర్సీ 33 నెలలు ఆలస్యమైతే, 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన రెండో పీఆర్సీ ఇప్పటికే 34 నెలలు ఆలస్యం అయింది. అందుకే ప్రభుత్వం ఆలస్యం చేయకుండా జూన్ 2 లోపు ఆ నివేదికను ఆమోదించి, 51% ఫిట్‌మెంట్‌తో కొత్త వేతనాలు అమలు చేయాలి. అలాగే 2024 జనవరి వరకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ₹700 కోట్లు సరిపోవడం లేదు. దీన్ని 1500 కోట్లకు పెంచి ఉద్యోగులు, పెన్షనర్లకు సమంగా కేటాయించాలి. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ చికిత్స అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ నెలలు గడుస్తున్నా ఆచరణలో పెట్టడం లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను వెంటనే అమలు చేయాలి. అదే విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి, ఎన్నికల హామీ మేరకు ఓపీఎస్‌ను అమలు చేయడంతో పాటు 2004 సెప్టెంబర్ 1కి ముందు నియామకమైన వారికి ఓపీఎస్ వర్తింప చేయాలి.
ఆందోళన కార్యక్రమాలు..
తమ సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ జేఏసీ దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఏప్రిల్ 17న రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు నిర్వహించగా, మే 5న అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మే 14న తదుపరి కార్యాచరణ ప్రకటించనుంది. తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సి రావడం ఆందోళనకరమని, దీనిని ప్రభుత్వం తేలికగా తీసుకుంటే ఉద్యోగులు- ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను త్వరగా పరిష్కరిస్తుందని ఆశించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రస్తుతం నిరాశలో ఉన్నారు, దేశంలోనే అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం తెలంగాణకే పరిమితమైంది. ఉద్యోగుల డిమాండ్లు కేవలం ఆర్థిక విషయాలు కాకుండా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. వారు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగితే ప్రజాసేవలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
సీఎం చొరవ చూపాలి!
ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలి. ఇచ్చిన హామీలను అమలు చేసి, తమ విశ్వసనీయతను నిలుపుకోవాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సత్వరం చొరవ తీసు కోవాలి. జేఏసీతో నేరుగా తనే చర్చలు జరపాలి. తనను కోసినా పైసలు రావు లాంటి డొల్లమాటలు బంద్ పెట్టి సమస్యల పరి ష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. రేవంత్‌రెడ్డి సర్కారుకు సమయం ఇవ్వాలనే యోచనతోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు రెండున్నర ఏళ్లు ఓపిక పట్టిన విషయాన్ని వారు గుర్తు పెట్టు కోవాలి. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల ధోరణితో స్పందిస్తేనే పాలన సజావుగా సాగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నారు..
-మానేటి ప్రతాపరెడ్డి,
రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF
98484 81028






