- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టిన ఊర్లో బతకలేని వృద్ధులు..!
ఉద్యోగాలు, విద్య కోసం యువత నగరాలకు వలస వెళ్లడంతో పల్లెల్లో వృద్ధులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆరోగ్య భద్రత, సామాజిక మద్దతు, అంత్యక్రియల ఖర్చులు వంటి కారణాలతో పుట్టిన ఊరిని వదిలి నగరాలకు వెళ్లాల్సి వస్తున్న వృద్ధుల జీవితం, మారుతున్న గ్రామీణ సామాజిక వాస్తవాలను విశ్లేషించే కథనం.

‘మనిషి ఎక్కడ పుట్టాడో.. చివరికి అక్కడికే చేరాలి’ ఇది ఒకప్పుడు మన సంస్కృతికి అద్దం పట్టిన జీవన సత్యం. పుట్టిన మట్టిలోనే చివరి శ్వాస విడిస్తే అది అదృష్టమని, పుణ్యమని భావించిన రోజులు అవి. కానీ ఇప్పుడు కాలం మారింది. మనుషులు మారారు.. బంధాలు బలహీనపడ్డాయి.. ఇప్పుడు పుట్టిన ఊరే వృద్ధులకు పరాయిగా మారుతోంది.
ఇప్పుడు పల్లె అంటే..
ఒకప్పుడు పల్లె అంటే ప్రేమ, పరామర్శ, మనుషుల మధ్య అనుబంధం. పక్కింటి వారు కూడా కుటుంబ సభ్యుల్లా పలకరించే రోజులు. ఇంటి ముందు కూర్చుంటే, ‘ఏమయ్యా, అన్నా, తమ్ముడు, చెల్లి,అక్క, బావ, బాబాయి, బాగున్నారా?’ అని అడిగే మనుషులు ఉండేవారు.. కానీ ఇప్పుడు అదే పల్లె.. నిశ్శబ్దంతో నిండిపోయిన ఖాళీ వీధిలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద ఇళ్లు ఉన్నాయి.. కానీ అందులో మనుషుల నవ్వులు లేవు. గుమ్మం ఉంది.. కానీ తలుపు తట్టే మనిషి లేడు. ఆవరణ ఉంది.. కానీ పిల్లల పరుగులు, నవ్వులు లేవు. పల్లె ఇప్పుడు మట్టితో ఉన్న ఊరు మాత్రమే.
గూడు చెదిరిన పల్లె..
విద్య, ఉద్యోగాల కోసం యువత నగరాలకు వలస వెళ్లారు. కానీ తల్లిదండ్రులు ‘ఇది మా ఇల్లు.. మా ఊరు..’ అనే మమ కారంతో అక్కడే మిగిలిపోయారు. కానీ కాలక్రమేణా వారికే ఆ ఊరు భయాన్ని కలిగిస్తోంది. రాత్రి ఒక్కసారిగా ఆరోగ్యం బాగోకపోతే ఆసుపత్రి దూరం, అంబులెన్స్ రాదు.. ఆ సమయంలో పక్కింటి వారు స్పందించడం కష్టమే.. ‘ఈ ఒంటరితనమే వృద్ధులను తొలచి వేస్తుంది’. చనిపోయినా చూసేవారు ఉండరేమో ననే భయం వెంటాడుతోంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు వృద్ధులకు పెద్ద భరోసా. ఇప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ చరిత్రలో కలిసిపోయింది. అందుకే ఇప్పుడు చాలామంది వృద్ధులు పుట్టిన ఊరిని వదిలి.. హైదరాబాద్ వంటి మహానగరాల్లో పిల్లల దగ్గర అపార్ట్‌మెంట్ గదుల్లో బతుకుతున్నారు.
ఊర్లో చనిపోవాలన్నా భయమే..!
ప్రాణ భద్రత కోసం పుట్టిన ఊరినే వదిలేస్తున్న పెద్దలు.. నగరాల్లో 24 గంటల వైద్య సేవలు, కార్పొరేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో గ్రామాల నుంచి వలస వచ్చిన వృద్ధుల సంఖ్య గణ నీయంగా పెరుగుతోంది. వారిలో చాలామంది ఒకప్పుడు తమ ఊళ్లలో భూస్వాములు.. గ్రామ పెద్దలు.. గౌరవనీయులు. కానీ ఇప్పుడు పరిస్థితులు వారిని తమ పుట్టిన మట్టినే వదిలి వెళ్లేలా చేస్తున్నాయి. అలాగే ఒకప్పుడు గ్రామాల్లో అంత్యక్రియలు అంటే సామాజిక బాధ్యత అని భావించేవారు. ఇప్పుడు ఊర్లో చనిపోతే ఆర్థిక భారంగా భారీ ఖర్చులు జతకడుతున్నాయి. ఒకప్పుడు ఊరం తా కలిసి చేసే కార్యక్రమం.. ఇప్పుడు లక్షల రూపాయల ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. దీంతో చాలా మంది కుటుంబాలు “ఊర్లో చనిపోతే ఖర్చులు ఎలా భరించాలి?” అనే ఆందోళనతో వృద్ధులను నగరాలకు తీసుకెళ్తున్నారు. అదే హైదరాబాద్ వంటి నగరాల్లో అయితే 30 నుంచి 50 వేల రూపాయల మధ్యే పూర్తి అంత్యక్రియలు ప్యాకేజీ రూపంలో పూర్తవుతున్నాయి. ఈ పరిస్థితి ఎంత విషాదకరమంటే.. పుట్టిన ఊర్లో బతకడానికి భయం.. పుట్టిన ఊర్లో చనిపోవడానికి ఇంకా పెద్ద భయం.
ఇది కుటుంబ సమస్య కాదు..
వృద్ధులకు అవసరమైంది పెద్ద ఇళ్లు కాదు.. “ఏమైనా అయితే చూసుకునే మనిషి” అనే భరోసా. అది ఇప్పుడు పల్లెల్లో కనుమరుగవుతోంది. ఇది కేవలం వృద్ధుల సమస్య కాదు..! సమాజానికి వినిపిస్తున్న ప్రమాద ఘంటికలు.. జన్మనిచ్చిన మట్టిలోనే జీవించలేని పరిస్థితి ఏర్పడితే.. అది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు.. సమాజం ఎదుర్కొంటున్న విలువల సంక్షోభం. “పుట్టిన ఊరు స్వర్గం” అనే మాట చరిత్ర పుస్తకాలలో మాత్రమే మిగిలి పోతుంది.
- కాడిగే శ్రీనివాస్ నేత
89198 27932






