- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారమైనా ఉండాలి లేదా అధికారియై ఉండాలి!
అధికార వ్యవస్థలోని పనులు ఎలా జరుగుతాయో, అదే సమస్యలు ఎందుకు తిరస్కరణకు గురవుతాయో బాధితుల అనుభవాలు, నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాల గూర్చి ఈ వ్యాసం తెలియజేస్తోంది.

ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి పదవికి ఎందుకు విలువో తెలుసా? వారి చేతిలో అధికారం ఉండడం వల్లే.. మాజీ కాగానే అప్పటి దాకా ఇంటికొచ్చిన ఏ ఉద్యోగి కనిపించడు. అంతెందుకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు.. అందుకే ఉంటే అధికారియై ఉండాలి. లేదంటే అధికారమైనా చేతిలో ఉండాలి. లేదంటే ఏ పనీ కాదు.. ఎవరూ మీ మాట వినరు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా జర్నలిజం వృత్తిలో ఎదురైన సంఘటనలే దీన్ని రూఢీ చేస్తున్నాయి..
ఒక సమస్యను ఓ జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తాడు. మరో జిల్లా కలెక్టర్ అట్లెట్లా అంటూ పేచీ పెడతాడు.. ఇంకా విచిత్రం ఏమిటంటే ఓ భూ సమస్యకు ఓ తహశీల్దార్ పాజిటివ్‌గా రిపోర్ట్ పంపించాడు. ఆర్డీవో, అదనపు కలె క్టర్, కలెక్టర్ కూడా రికమండ్ చేశారు. సీసీఎల్ఏ దాకా వెళ్లింది. అక్కడ కొంత కాలం పెండింగులో ఉంచారు. ఆఖరికి మూకుమ్మడిగా అన్నింటినీ రిజెక్ట్ చేశారు.
ఒకే సమస్యకు రెండు వేర్వేరు రిపోర్టులు..
ఇప్పుడు అదే బాధితుడు మళ్లీ అప్లై చేస్తే పాజిటివ్ రాసిన తహశీల్దారే నెగిటివ్ రిపోర్ట్ పంపించాడు. ఆర్డీవో రిజెక్ట్ చేసేశారు. అదనపు కలెక్టర్‌కు పాత ఫైల్ చూపిస్తే.. ఔను కదా, ఇదేంది? ఒక్కటే సమస్యకు రెండు రకాల రిపోర్టులు ఎలా రాశారు? నేను ఎంక్వయిరీ చేయిస్తా నంటారు. ఆ తర్వాత ఏవో కారణాలతో రిప్లై వస్తుంది. ఆ కారణాలు పాజిటివ్‌గా రాసినప్పుడు ఎందుకు లేవు? ఆ తర్వాత ఎందుకు వచ్చాయి? దీనికి అందరి నోటా మౌనమే సమాధానం. అదే అధికారం. అది మా ఇష్టం. మా చేతిలో అధికారం. అందుకే అప్పుడలా, ఇప్పుడిలా. దీని వెనుక ఏం జరిగిందో, ఎలా జరిగింది? అనే ప్రశ్నల కంటే ముందు పాజిటివ్ గా పంపాం, తర్వాత నెగిటివ్‌గా పంపిస్తే ఎలా? అన్న స్పృహ కూడా లేదు. దానికి కారణం ఏమిటంటే సదరు అధికారికి సమాధానం చెప్పేందుకు కారణాలు రెడీగా ఉంటాయి. చట్టాలు, సెక్షన్లు, సబ్ క్లాజులు సిద్ధంగా ఉంటాయి. అప్పుడు బాధితుడు ప్రశ్నించేందుకు అవకాశమే లేదు.
పని చేయకూడదనుకుంటే..
అవును వారు చేయకూడదనుకుంటే చేయరు. పని చేయకుండా ఉండేందుకు సెక్షన్లు, సబ్ క్లాజ్‌లు దొరుకుతాయి. ఎలాగైనా చేయొచ్చు. రిక్వెస్ట్ చేసినా, తెలిసిన వాళ్లతో చేయించినా డౌట్స్ ఉన్నాయి. క్లియర్ చేసుకోకుండా పని చేస్తే ఇబ్బంది అవుతుంది. వాళ్లకూ ఇబ్బందే. అందుకే ఎంక్వయిరీ చేయిస్తున్నాను. ఆఖరికి రాష్ట్ర స్థాయి అధికారుల చేత ఫోన్లు చేయించినా, సిఫారసు చేయించినా తిరస్కరించడానికి కారణాలు వెతుక్కుంటారు. ఓ సమస్యను పరిష్కరించడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయన్న విషయాన్ని మండల స్థాయి అధికారికి హెడ్ ఆఫీసు నుంచి వివరించారు. 15 నిమిషాల్లో తప్పు ఎక్కడ ఉన్నదో గుర్తించి సరి చేస్తూ రిపోర్ట్ పంపిస్తే చాలు అన్నారు.. కానీ సదరు మండల అధికారికి ఆ పని చేయడం ఇష్టం లేదు. అందుకే అది నాకు అర్థం కాలేదని, అలా ఎలా చేస్తామని, ఇక్కడ ఖాళీగా ఉన్నామా? అని అనేక రకాల కారణాలు వెతికి.. ఆఖరికి రిజెక్ట్ చేశారు.
పొరపాటు జరిగిందని తెలిసినా..
అదేనండీ అధికారి తలచుకుంటే ఎంతటి పనినైనా సునాయసంగా తిరస్కరించేందుకు అన్ని మార్గాలు కళ్ల ముందే కనిపిస్తాయి. ఇక మీరు ఎంత ప్రయాసపడినా ఆ పని కాదని గుర్తించాల్సిందే. దానికి కారణాలు వారు వెతికారు కదా.. మీరు చట్టాలను గుర్తు చేసినా, సెక్షన్లను వల్లె వేసినా డోంట్ కేర్ అంటారు. అంతెందుకు.. మా వాళ్లే తప్పుగా నమోదు చేశారు. పొరపాటు జరిగింది. దాన్ని సరి చేయలేం. మీరు కోర్టుకు వెళ్లండి. ఓ ఆర్డర్ తెచ్చుకోండి. అప్పుడు చూద్దాం అనే ధైర్యానికి కూడా వెనుకాడని అధికారులు కూడా ఉన్నారు. తప్పు ఉద్యోగి చేస్తే సరిదిద్దే బాధ్యత మీదే కదా అని గుర్తు చేస్తే కోపాలు వస్తాయి. ఆ ఇష్యూని ప్రచారం చేస్తే మండిపాటు. తనకు న్యాయం చేయండని గ్రామ స్థాయి నుంచి డిపార్టుమెంట్ స్టేట్ హెడ్ దాకా తీసుకెళ్లినప్పుడు మండలం, డివిజన్ స్థాయిలోనే కావాలి. మా దాకా ఎందుకొచ్చారని తిప్పి పంపారు. కానీ ఆర్డర్ చేయలేదు. దాంతో సమస్యగానే మిగిలింది. ఇక్కడ ఉద్యోగులు డేటా ఎంట్రీలో చేసిన తప్పును సవరించాల్సిన బాధ్యత, అధికారం వారికి ఉంది. కానీ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే ససేమిరా అంటున్నారు.
పని చేయాలనుకుంటే..
ఓ అధికారికి పని చేయాలని ఉంటే చాలు.. ఇక అది పరిష్కారం అయినట్లే. పరిష్కరించడానికి చట్టాలు, సెక్షన్లు, సబ్ క్లాజ్‌లు దొరుకుతాయి. ఆఖరికి రెఫరెన్స్‌లు దొరుకుతాయి. ఏయే జిల్లాల్లో, ఏయే రాష్ట్రాల్లో ఎలా చేశారు? ఏయే కేసుల్లో ఎలాంటి తీర్పులు వచ్చాయి? దానికి దీనికి సిమిలారిటీస్ అన్నీ కళ్ల ముందే కదలాడుతాయి. ఇది ఎలాగైనా చేయొచ్చు. గతంలో ఇలాంటిదే ఫలానా అధికారి చేశారు. ఫలానా సర్వే నంబర్‌లో చేశారు. అందుకే చేసేయొచ్చు. అదే రెఫరెన్స్‌గా పెడదాం అంటూ చేసేస్తారు. అది అధికారం అంటే మరి! ఏదైనా సమస్య పరిష్కారం గురించి ముందే అధికారులతో చర్చించాలి. వారికి కావాల్సిందనో, నచ్చిందనో తెలియదు.. కానీ అప్లై చేసిన మరుసటి రోజే పరిష్కారం అవుతుంది. అందుకే ఇటీవల సూర్యాపేటలో ఓ ల్యాండ్ ఇష్యూలో సక్సెషన్ ఫైల్‌ని పరిశీలిస్తే అప్లై చేసిన రోజే పరిష్కారమైంది. కనీసం వారసులు ఎవరో తెలుసుకునేందుకు 15 రోజులైనా టైం తీసుకుంటారు. కానీ అక్కడ ఆ అధికారికి ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇలా అప్లై చేయడం, అలా ఓకే చేయడం పూర్తయ్యింది. పలుకుబడి ఉండాలే గానీ మరుసటి రోజు సర్టిఫికేట్ తీసుకురావడం పెద్ద కష్టం కాదు.
అధికారం ఉంటే..
ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి పదవికి ఎందుకు విలువో తెలుసా? వారి చేతిలో అధికారం ఉండడం వల్లే.. మాజీ కాగానే అప్పటి దాకా ఇంటికొచ్చిన ఏ ఉద్యోగి కనిపించడు. అంతెందుకు? ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయరు.. అందుకే అధికారంలో ఉన్న ఐదేండ్లల్లోనే అన్నీ పనులు చేయించుకునేందుకు తాపత్రయపడుతుండడం అందరికీ తెలిసిందే. ఆ ఐదేండ్లల్లోనే సంపద పెరుగుతుంది. ఆస్తులు రెట్టింపు అవుతాయి.. అందుకే మొదటిసారి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్‌కి, రెండోసారి పోటీ చేసేటప్పుడు సమర్పించే అఫిడవిట్‌కి చాలా తేడా ఉంటుంది. ఆస్తులు డబుల్ అవుతాయి. కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు, బంగారం, ప్రాపర్టీస్ పెరిగిపోతూనే ఉంటాయి. అధికారంలో ఉండడం వల్ల వారి పనులన్నీ చకచకా అవుతుంటాయి. అధికారం చేతిలో ఎందుకు ఉండాలో కొందరు నేతలు చెప్పే మాటలు చాలా మందికి అర్ధం కావడం లేదు.. కానీ అధికారుల చుట్టూ, లీడర్ల చుట్టూ.. సమస్యల పరిష్కారం కోసం తిరిగే వాళ్లకు అర్థమవుతుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంతటి అనుభవం ఉన్నా.. పూర్తి అవగాహన ఉన్నా సరే.. ఆ పని చేయించుకోవాలంటే ‘అధికారం’ ఉండాలి. అందుకే ఆ అధికారానికి జిందాబాద్ కొట్టాలి. ఆ అధికారానికి అనుభవం అవసరం లేదు. చదువు అంత కంటే అవసరం లేదు. ఆఖరికి ఆ అంశాలపై అవగాహన కూడా ఉండాల్సిన పని లేదు. ఒక్క ఫోన్, ఒక్క కాల్‌తో పని పూర్తవుతుంది.
- శిరందాస్ ప్రవీణ్‌కుమార్
80966 77450






