చదువు అవసరమే.. కానీ అది పిల్లలకు అర్థం అవుతుందా?

by Ravi |   (  Updated:2025-06-11 00:30:46  IST  )

నిరుపేద తల్లిదండ్రులు మొదలు అత్యున్నతమైన సంప న్నుల కుటుంబాల వరకూ అందరిదీ ఒకే ఆలోచన.. మా పిల్లలు

చదువు అవసరమే.. కానీ అది పిల్లలకు అర్థం అవుతుందా?
X

నిరుపేద తల్లిదండ్రులు మొదలు అత్యున్నతమైన సంప న్నుల కుటుంబాల వరకూ అందరిదీ ఒకే ఆలోచన.. మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలి. అత్యున్నతమైన స్థానాలలో ఉండాలి. వీళ్ల కోరికలు, ఆలోచనలే కార్పొరేట్ విద్యాసంస్థలకు వరంగా మారాయి. తల్లిదండ్రులకు ఈ ఆలోచనలు, కోరికలు మంచివే కానీ స్తొమత ఎంత అనేది ఆలోచించాలి. ఎదురింటి వాళ్లు ఫలానా గొప్ప స్కూల్లో చేర్చారు, ఫలానా గొప్ప కాలేజీలలో చేర్చారు.. అనే మాయలో పడి, పిల్లల ఆలోచనలను అర్థం చేసుకోవడం మర్చిపోతున్నారు.. చదువు ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ ఆ చదివే చదువు పిల్లలకు అర్థం అవుతుందా? లేదా అనేది కూడా ముఖ్యం. ర్యాంకుల మోతలు మోగించే కార్పొరేట్ మాయలో పడి విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో దారుణ ఘటనలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నతమైన చదువు అంటే ఉద్యోగమే కాదు, అనేక మార్గాలు ఉన్నాయని పిల్లలకు తెలియజేయకపోవడంలో ఇటు తల్లిదండ్రులది, అటు విద్యావ్యవస్థ యజమాన్యాలదే తప్పు. చదువు మనిషి విలువని పెంచాలి, కాలానుగుణంగా మారగలగాలి, క్రమ శిక్షణను జీవితంలో భాగంగా అలవర్చుకోవాలి. కానీ నేటి విద్యావ్యవస్థ క్రమశిక్షణ తప్ప మిగితా అన్నీ నేర్పించే శిక్షణ కేంద్రంగా మారిపోయింది. విద్యార్థి అంటే డబ్బులు తీసుకొచ్చే యంత్రమే అనే భావనతో విద్యాసంస్థలు ఆలోచిస్తున్నాయి. చదువు జీవితానికి బంగారు బాటలు వేసే దారి.. విద్యార్థులు ఆ దారిలో తప్ప అన్ని దారులలో పయనిస్తున్నారు. ఈ లోపం ఎవ్వరిది? రేయనక, పగలనక కష్టపడి సంపాదించి డబ్బులు కట్టే తల్లిదండ్రులదా? ఫీజులను నిర్దాక్షిణంగా వసూలు చేస్తూ వాళ్లకు తోచిన చదువులు చెప్తున్న విద్యాసంస్థలదా? కష్టపడి తల్లిదండ్రులు సంపాదించి డబ్బులు కట్టించుకొని చదువును, చదవకుండా తప్పించుకుంటున్న విద్యార్థులదా? ఎటు వెళ్తుందీ విద్యాభ్యాసం.

- డాక్టర్. వై. సంజీవ కుమార్,

93936 13555

Next Story