మారని పంజరంలో చిలకలు

by Disha edit |
మారని పంజరంలో చిలకలు
X

న సామాజిక వ్వవస్థలో గతంలో కంటే అన్ని రంగాలలో వేగంగా 'విలువలు' పతనమవుతున్నాయి. సామాన్య ప్రజల విస్తృత ప్రయోజనాలు ఆశించే పనిచేసే రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు కట్టుతప్పి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఊడిగం చేస్తున్నాయి. గత 75 ఏళ్ల కాలంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చట్టపరంగా పరిపాలించటానికి బదులు, అనేకసార్లు అధికార దుర్వినియోగం చేసి, రాజ్యాంగ సంస్థలనూ, వ్యవస్థలను తన స్వార్ధానికి వినియోగించిందన్న అప్రదిష్టను మూటగట్టుకుంది.

ముఖ్యంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రతిపక్ష ప్రభుత్వాలను స్వతంత్ర్యంగా పనిచేసుకోనివ్వకుండా గవర్నరు వ్యవస్థను ఉపయోగించుకొని వివిధ రాష్ట్రాలలో అనవసరంగా జోక్యం చేసుకుని, అనేకసార్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి గవర్నరు రామ్‌లాల్ ఉదంతం కాంగ్రెసు పాలనకు మాయని మచ్చను తెచ్చిపెట్టింది. అలాగే ఇందిరాగాంధీ హయాంలో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి, ప్రతిపక్షాల నాయకులను జైళ్ళలో నిర్భంధించి. పత్రికలపై అనేక ఆంక్షలు విధించి, గొప్పగా చెప్పుకొనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి కళంకాన్ని తెచ్చిపెట్టింది, చరిత్రలో దోషిగా నిలిచింది.

పార్టీలు మారవచ్చు.. బుద్ధి మారలేదు

గతంలో కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనపై తీవ్రంగా విమర్శిస్తూ ధ్వజమెత్తిన మోడీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ అడుగుజాడల్లోనే నడుస్తూ, మరోసారి 'పార్టీలు మారవచ్చు' కానీ 'పాలకుల బుద్ధి' మారలేదనే విషయాన్ని రుజువు చేశారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ఇవి రెండు 'ఒకేతాను ముక్కలు' గానే ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు మోడీ పాలనలో గవర్నరు వ్యవస్థ పూర్తిగా అప్రతిష్టపాలైంది. అసలు గవర్నర్ వ్వవస్థనే రద్దు చేయాలనేంతగా భ్రష్టుపట్టించారు. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, తెలంగాణ మొదలైన రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణ.

గవర్నరు, ఈడీ, ఐటీ, సీబీఐ, ఈసీ, వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు. బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా, పంజరంలో చిలకలుగా మారాయనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు బీజేపి పాలనలో ఈడీ మొత్తం 121 కేసులు నమోదు చేస్తే, వాటిలో 115 అంటే 95 శాతం విపక్షాల మీద నమోదయ్యాయి. అలాగే ,సీబీఐ గత తొమ్మిదేళ్లలో 124 కేసులు నమోదు చేసింది. వాటిల్లో 118 ప్రతిపక్ష పార్టీ నాయకులపై నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలో రుజువు అయిన కేసులు 0.5 శాతం మాత్రమే. అంటే ఈ కేసుల సారాంశం బీజేపీ ఉద్దేశ పూర్వకంగా విపక్ష నేతలను వేధించటానికేనని స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ఈడీ, సీబీఐ సంస్థలపై ప్రజలకు చులకన భావం ఏర్పడుతుంది.

పార్టీ మారితే చాలు కేసులు మాయం..!

బీజేపీ పాలనలో మరో ట్విస్ట్ ఏమిటంటే అప్పటి వరకు నేర చరిత్ర కలవారని ఇదే దర్యాప్తు సంస్థల చేత ముద్ర వేయించిన విపక్ష నాయకులు, కాషాయ పార్టీలో చేరిపోగానే కేసులు, విచారణ మూలన పడిపోతాయి. సాక్షాధారాలు మాయం అయిపోతాయి. నిన్నటిదాకా నేరస్థులు ఒక్కసారిగా సచ్ఛీలురుగా మారిపోతారు. దీనికి ఉదాహరణ గత ఎనిమిదేండ్లుగా బీజేపీలో చేరిన నాయకులు. చేరిన వారిలో చాలా మంది నేరారోపణలు ఎదుర్కొన్నవారే. వారంతా బీజేపీ కండువా కప్పుకోగానే పునీతులు అయిపోయారు. వారికి లొంగని నాయకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. అలాగే బీజేపీ పార్టీ వారు తప్పు చేసినా ఈడీ, ఐటీలు అటువైపు తొంగిచూడవు. ఇటీవల కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కొడుకు 40 లక్షల లంచం తీసుకుంటూ పోలీసులకు పట్టుబడినా అక్కడ ఈడీ,ఐటీలు పత్తాలేవు. ఇకనైనా బిజేపీ, ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు, వేధింపులు మాని నిష్పాక్షికంగా తన, పర భేద భావాలు చూపకుండా అవినీతిని అంతమొందిస్తే ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి నీరాజనం పలుకుతారు. అవినీతిని ఎవరూ ప్రోత్సహించరు.

డా. కోలాహలం రామ్ కిశోర్

9849328496.



Next Story