గ్రామ స్వరాజ్యానికి ఆర్థిక స్వావలంబనే పునాది

by Ravi |   (  Updated:2026-01-29 00:45:17  IST  )

భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది గ్రామస్థాయి పరిపాలనే. దేశ రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించిన ప్రధాన ఉద్దేశం.. అధికారాలు, బాధ్యతలు, ఆర్థిక వనరులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే. గ్రామాభివృద్ధి మాటల్లో కాదు, గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనలోనే ప్రతిఫలిస్తుంది. ఆ స్వావలంబనకు పునాది పన్నుల వసూలు వ్యవస్థ...

గ్రామ స్వరాజ్యానికి ఆర్థిక స్వావలంబనే పునాది
X

భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది గ్రామస్థాయి పరిపాలనే. దేశ రాజ్యాంగంలోని 73వ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించిన ప్రధాన ఉద్దేశం.. అధికారాలు, బాధ్యతలు, ఆర్థిక వనరులు ప్రజలకు దగ్గరగా ఉండాలన్నదే. ఈ దృష్టికోణాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి రూపొందించిందే ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం- 1994. గ్రామాభివృద్ధి మాటల్లో కాదు, గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనలోనే ప్రతిఫలిస్తుంది. ఆ స్వావలంబనకు పునాది పన్నుల వసూలు వ్యవస్థ...

గ్రామ ఆదాయమే ఆధారం..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 G ప్రకారం పంచా యతీలు స్థానిక ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. పదకొండో షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై పథకాలను అమలు చేసే అధికారాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. ఈ క్రమంలోనే ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్–62 గ్రామ పంచాయతీలకు ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వృత్తి పన్ను, గ్రామ ఉత్పత్తులపై పన్ను, మార్కెట్ ఫీజులు, సేవా రుసుములు వసూలు చేసే అధికారం ఇస్తుంది. గ్రామ అవసరాలకు గ్రామ ఆదాయమే ఆధారం కావా లన్నదే ఈ నిబంధనల సారాంశం.

పరిమితమైన అధికారాలు..

అయితే, గ్రామ పంచాయతీలకు చెందిన స్థలాల లీజులపై కనీస ధర నిర్ణయం, ప్రకటనలపై పన్నుల విధింపు వంటి కీలక అధికారాలు జిల్లా పరిషత్‌లకు పరిమితం చేయడం వల్ల గ్రామ పంచాయతీలకు ఆర్థిక నష్టం జరుగుతోంది. దీనివల్ల పంచాయతీ భూములు అన్యాక్రాంతం అయ్యే ప్రమాదం కూడా ఏర్పడుతోంది. గతంలో గ్రామ పంచాయతీల పన్నుల వసూలు విధానం సరళంగా ఉండేది. గ్రామ సభల్లో పన్నులపై చర్చలు జరిగేవి.. ప్రజాప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉండేది. ప్రజలు చెల్లించిన పన్నులు గ్రామంలోనే వినియోగం అవుతున్నాయన్న విశ్వాసం ఉండేది.. ప్రస్తుతం డిజిటలైజేషన్, ఆన్‌లైన్ చెల్లింపులు, ఈ-రసీదుల వల్ల పారదర్శకత పెరిగి నప్పటికీ, గ్రామ పంచాయతీల నిర్ణయాధికారాలు పరిమిత మయ్యాయన్న భావన పెరుగుతోంది.

గ్రామ పాలనపై కొత్త ఆశలు..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సమస్య చట్టం, అమలు మధ్య ఉన్న అంతరం. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పాలనపై కొత్త ఆశలు ఏర్పడ్డాయి. గ్రామాలు కేంద్రంగా అభివృద్ధి జరగాలన్న ఆయన దృష్టి గ్రామ స్వరాజ్య భావనకు అనుగుణంగా ఉంది. ఈ దశలో పవన్ కళ్యాణ్ పరిపాలన ద్వారా గ్రామ పంచాయతీలు ఆశిస్తున్నది చట్టం ఇచ్చిన అధికారాల పునరుద్ధరణ, ఆర్థిక స్వావలంబనకు దారి చూపే సంస్కరణలు జరగాలని కోరుకుంటున్నారు.

కేంద్రం దృష్టిలో గ్రామ స్వరాజ్యం..

భారత ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే, లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు.. 73వ రాజ్యాంగ సవరణ, గ్రామ సభల ప్రాధాన్యం, ఈ-పంచాయత్, డిజిటల్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్ల ద్వారా నిధుల బదిలీ ఇవన్నీ గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనా పరంగా బలోపేతం చేయడానికే ఉద్దేశింపబడినవి. కేంద్ర ప్రభుత్వ దృష్టిలో పన్నులు ప్రజలపై భారం కాదు, అవి స్థానిక అభివృద్ధికి పెట్టుబడి. కానీ ఆ పెట్టుబడి ప్రయోజనం ప్రజలకు కనిపించాలి. అప్పుడే పన్నుల చెల్లింపుపై ప్రజల అంగీకారం పెరుగుతుంది.

గ్రామ పంచాయతీలకు భారీ నష్టం

పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలాలపై పన్ను నిబంధన లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలకు భారీ ఆర్థిక నష్టం జరుగుతోంది. కనీసం రూర్బన్ గ్రామ పంచాయతీలలో అయినా ఖాళీ స్థలాలపై పన్ను విధించే అధికారం కల్పిం చాలి. అదే విధంగా సీఆర్‌డీఏ, అర్బన్ డెవలప్‌మెంట్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు సకాలంలో అందడం లేదు.

గ్రామ స్వయం పాలన లక్ష్యం మరుగున పడకుండా డిజిటలైజేషన్ అమలు చేయాలి. రిజిస్ట్రేషన్ శాఖ (స్టాంప్ డ్యూటీ), వాణిజ్య పన్నుల శాఖ (వృత్తి పన్ను), గనుల శాఖ (సీనరేజ్ గ్రాంట్లు)లను స్వర్ణ గ్రామపంచాయతీ పోర్టల్‌తో అనుసంధానం చేసి, గ్రామ పంచాయతీలకు చెందాల్సిన నిధులు సకాలంలో జమయ్యేలా చర్యలు తీసుకోవాలి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపు జరిగితే గ్రామపంచా యతీలు ఆదాయ సమీకరణ పెంచుకోవడమే కాకుండా, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య కల సాకారం దిశగా పయనించే అవకాశం ఏర్పడుతుంది.

-టి.ఎం.బి. బుచ్చిరాజు

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వెల్ఫేర్ ట్రస్ట్

97034 25006

Next Story