12 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఆ పిల్లాడు ఏమయ్యాడు?

by Ravi |   (  Updated:2025-05-14 00:45:55  IST  )

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా సింహాచలం సమీపంలో ఉంది శ్రీనివాస నగర్. అక్కడి దగ్గర్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో

12 ఏళ్లకే డ్రగ్స్ అలవాటు.. ఆ పిల్లాడు ఏమయ్యాడు?
X

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా సింహాచలం సమీపంలో ఉంది శ్రీనివాస నగర్. అక్కడి దగ్గర్లో ఓ ప్రభుత్వ పాఠశాలలో గత మూడేళ్లుగా చదువుతున్నాడు ఓ పిల్లాడు.. ఎనిమిదో తరగతి చదువుతున్న అతని వయసు 12 ఏళ్లు.. తండ్రి ఫాస్ట్‌పుడ్ సెంటర్‌లో పని చేస్తుంటాడు. తల్లి ఇళ్లల్లో పని చేస్తోంది. అతనికో చెల్లెలు.. పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు.. ఎలా అలవాటయ్యాయో తెలీదు, స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలు అలవాటయ్యాయి.. థ్రిల్.. మత్తు.. ఆనందం.. తొందరగా పెద్దవాణ్ని అనిపించుకోవాలన్న ఆత్రం అనుకుంటా ఇవన్నీ ఆ పిల్లాణ్ని మత్తుపదార్థాలకు బానిసను చేశాయి. అవి లేకపోతే బతకలేని స్థితికి తెచ్చాయి.

పిల్లల్ని కాపాడుకోలేరు..

ఈ విషయం ముందుగా టీచర్లకు తెలిసింది. వాళ్లు ఇంట్లో వాళ్లకు చెప్పారు. తండ్రి మందలించాడు. తల్లి బుజ్జగించింది. కొన్నాళ్లు మామూలే.. ఆ తర్వాత పరిస్థితి షరామామూలే.. ఇలా లాభం లేదని, కొడుకును స్కూల్ మానిపించారు. కొన్నాళ్లు తన వెంటే ఉండమన్నాడు తండ్రి. అలాగైనా కొడుకు ఆ అలవాటు నుంచి బయటపడతాడన్న ఆశ. గత బుధవారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. తాను ఇంటి దగ్గరే ఉంటానని చెప్పి ఆ పిల్లాడు ఉండిపోయాడు. పనులు చేసుకుని తల్లి ఇంటికొచ్చి చూసే సరికి కొడుకు ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడు తున్నాడు. ఓ తల్లికి అంతకన్నా నరకం మరొకటి ఉంటుందా? వెంటనే భర్తకు ఫోన్‌ చేసి పిలిచింది. అందరూ వచ్చి చూడగా, అప్పటికే ఆ బాలుడు మరణించాడు. 12 ఏళ్లకే నూరేళ్లు నిండాయి.

స్కూల్‌లో మత్తు పదార్థాలు..

స్కూల్‌లో ఫ్రెండ్సే తన కొడుక్కి మత్తు పదార్థాలు అలవాటు చేశారని తండ్రి వాపోతున్నాడు. ఈ విషయాన్ని టీచర్లు సరిగా పట్టించుకోలేదనేది అతని ఆవేదన. మత్తులో మునిగితేలే పిల్లలు టీచర్లు చెప్తే వింటారా? గట్టిగా మాట్లాడితే ఓ బండ నెత్తిన వేసి, హత్య చేసినా చేస్తారనేది టీచర్ల భయం. పోలీసులు పట్టించుకోలేదని స్థానికుల వాదన. వాళ్లది ధృతరాష్ట్ర అంశ. కొన్ని కనిపించవు.. కనిపించినా కనిపించనట్టే ఉంటారు. ఆ స్కూల్లో ఇంకా కొందరు పిల్లలు మత్తుకు బానిసలు అయ్యారని, కొందరు వారికి మత్తు పదార్థాలు అలవాటు చేసి, అమ్మిస్తున్నారని అంటున్నారు.

డ్రగ్స్ విక్రేతలకు పిల్లలే టార్గెట్

జైల్లోనే మత్తు పదార్థాలు దొరుకుతున్న రాష్ట్రంలో అవి స్కూళ్ల దాకా చేరడం పెద్ద వింతేం కాదు కద. పైగా డ్రగ్స్ అమ్మాలనుకునే వారికి 12-18 వయసులోని వారే తొలి టార్గెట్. ముందుగా వారికి అలవాటు చేసి, వారు మత్తులో మునిగాక వారి చేత వాటిని రవాణా చేయిస్తుంటారు. పోలీసుల రికార్డుల్లో ఇలాంటి కేసులెన్నో ఉన్నాయి. జువైనల్ హోంలలో ఇలాంటి పిల్లలు చాలామంది ఉంటారు. వారంతా ఆ కేసుల్లో చిక్కుకున్న వారే. ఒక్కసారి డ్రగ్స్ కేసులో చిక్కితే, దానినుంచి బయటపడటం చాలా కష్టమైన వ్యవహారం. అందునా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే ఇక అంతే గతి!

పిల్లల్ని కాపలా కాయలేం

మీ పిల్లలు ఇప్పుడు జాగ్రత్తగానే ఉండొచ్చు. కానీ రోజులన్నీ ఒక్కలాంటివి కాదు. ఏ అలవాటు ఎక్కడి నుంచి చొరబడుతుందో చెప్పలేం! ఏ స్నేహాలు ఎటువైపు తీసుకెళ్తాయో గుర్తించలేం! కాబట్టి ముందస్తు చర్యలే మేలు.. అన్నీ జరిగాక వేదన, రోదన తప్ప ఏమీ మిగలవు. కాబట్టి పిల్లలు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో కాస్తా కనిపెట్టుకుంటూ ఉండండి.

- విశీ

ప్రముఖ రచయిత

Next Story