- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబేద్కర్ ఆలోచనలు.. నేటి భారతానికి దిక్సూచి!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను కేవలం రాజ్యాంగ రూపకర్తగానే కాకుండా, అణగారిన వర్గాల గొంతుకగా, సమానత్వ పోరాట యోధుడిగా ఆయన అందించిన స్ఫూర్తి అజరామరం. నేటి ఆధునిక భారతంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక అసమానతలను అధిగమించడానికి ఆయన 'బోధించు, సమీకరించు, పోరాడు' అనే నినాదం ఎలా మార్గదర్శకమో చదవండి.

డా. బి. ఆర్. అంబేద్కర్ దేశ చరిత్రలో మహత్తర మార్పుకు నాంది పలికిన యుగదర్శి. ఆయన రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాదు.. సమానత్వం, న్యాయం, మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత. నేడు భారతదేశం ప్రపంచ వేదికపై వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా నిలుస్తున్న వేళ, దేశ అభివృద్ధి నిజంగా ప్రతి పౌరుడి జీవితాన్ని స్పృశిస్తున్నదా? లేక అది కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోతుందా? అనే ప్రశ్నకు సమాధానం కోసం అంబేద్కర్ ఆలోచనల వైపు చూడాల్సిన అవసరం ఉంది.
అంబేద్కర్ జీవితం ఒక మహత్తర పోరాట గాథ. చిన్నప్పటి నుంచే కుల వివక్షను ఎదుర్కొన్న ఆయన, అదే సమాజాన్ని సమానత్వ దిశగా మలచాలని సంకల్పించారు.. పాఠశాలలో నీళ్లు తాగేందుకు కూడా అనుమతి లేకపోవడం, ఇతరులతో కలిసి కూర్చోనివ్వకపోవడం వంటి అనుభవాలు ఆయనలో మార్పు కోసం అచంచల సంకల్పాన్ని నింపాయి. కానీ ఆ ఆవేశం ప్రతీకారంగా మారలేదు.. అది సమాజ మార్పు కోసం సృజనాత్మక పోరాటంగా మారింది.
గౌరవంగా జీవించే హక్కు ఉండాలని..
‘విద్యే విముక్తికి మార్గం’ అనే విశ్వాసంతో ఆయన తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు.. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేసి ఆర్థిక శాస్త్రం, న్యాయ శాస్త్రం, రాజకీయ శాస్త్రం రంగాల్లో లోతైన అవగాహన పొందారు.. ఈ విద్య ఆయనకు వ్యక్తిగత విజయాన్ని మాత్రమే కాకుండా సమాజాన్ని విశ్లేషించే శక్తిని ఇచ్చింది. అంబేద్కర్ తత్వశాస్త్రం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూడు మూల సూత్రాలపై ఆధారపడింది. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కు కాదు. ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉండాలి. ఆయన చెప్పినట్లు ‘Political democracy cannot last unless there lies at the base of it social democracy’.
సమసమాజ నాయకుడు..
అంబేద్కర్ దృష్టిలో రాజ్యాంగం అంటే కేవలం చట్టపరమైన పత్రం కాదు. అది సమాన సమాజ నిర్మాణానికి మార్గదర్శక గ్రంథం. ‘విద్య హక్కు’ సామాజిక న్యాయానికి ప్రధాన సాధనమని ఆయన విశ్వసించారు. రిజర్వేషన్ల ద్వారా చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారు. సర్వసామాన్య ఓటు హక్కు ద్వారా ‘ఒక్కో ఓటు – ఒక్కో విలువ’ అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలోపేతం చేశారు.. అంటరానితనం నిర్మూలనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ -17 ద్వారా చట్టపరమైన అడ్డుకట్ట వేశారు.. కార్మికుల కోసం 8 గంటల పనిదినం, కార్మిక రక్షణ చట్టాల బలోపేతానికి కృషి చేశారు.. మహిళల సాధికారత కోసం హిందూ కోడ్ బిల్ ద్వారా ఆస్తి హక్కులు, పునర్వివాహ హక్కుల వంటి సంస్కరణలకు పునాది వేశారు.. ఆయన ప్రసిద్ధ నినాదం ‘Educate, Agitate, Organize’ నేటికీ సామాజిక చైతన్యానికి శాశ్వత మార్గదర్శకం.
సమాజంలో మార్పు రావాలంటే..
ప్రతి మనిషికి సమాన హక్కులు కలగాలని లింగ, కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు కలగాలని ఆయన జీవితాంతం పోరాడారు.. చట్టాలు ఉండటం మాత్రమే సరిపోదని, వాటిని ప్రజలు అవగాహనతో వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. హక్కులపై అవగాహన, చైతన్యం, న్యాయపరమైన పోరాటం ఇవే సమసమాజ నిర్మాణానికి అసలు పునాది అని ఆయన విశ్వసించారు. అలాగే దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అంబేద్కర్ నమ్మారు.. అందుకే విద్యార్థులు, యువకులు నాయకత్వం వహించి పాలనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంట్ వంటి వేదికల్లో సామాన్య ప్రజల ప్రాతినిధ్యం పెరిగినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని ఆయన విశ్వసించారు.
ఇంకా అసమానతల సవాళ్లు..
నేటి భారతదేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు ఇంకా అసమానతలను చూపిస్తున్నాయి. విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల్లో వర్గాల మధ్య వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం వంటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. డిజిటల్ యుగంలో కూడా డిజిటల్ విభేదాలు, సామాజిక వివక్ష, ఆర్థిక అసమానతలు కొత్త రూపాల్లో కని పిస్తున్నాయి. అందుకే అంబేద్కర్ ఆలోచనలు నేటికీ అత్యంత ప్రాసంగికం. అందుకే యువత మార్పు దిశగా అడుగులు వేయాలి. యువత అన్యాయాన్ని ప్రశ్నించాలి. సమాజ మార్పులో భాగస్వాములు కావాలి. అదే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి. భారతదేశం నిజమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలంటే ఒక మార్పు అవసరం.
(అంబేద్కర్ జయంతి సందర్భంగా)
-కేతవత్ పండరినాథ్
పీహెచ్‌డీ పరిశోధకుడు, పూణే
97054 44419






