- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగుల సహనం పరీక్షించకండి!
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్లర్లు ఆశగా రెండు అంశాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తూ ఉంటారు. వాటిలో ఒకటవది నిర్ణీత

ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్లర్లు ఆశగా రెండు అంశాల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తూ ఉంటారు. వాటిలో ఒకటవది నిర్ణీత సమయానికి కరువు భత్యం, రెండోది వేతన సవరణ. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వారి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఏటా రెండుసార్లు జనవరి, జులై నెలల్లో కరువు భత్యం(డీఏ) మంజూరు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరువు భత్యం మంజూరు చేస్తుంది. గత ప్రభుత్వాలు ఇదే పద్ధతిని అనుసరించేవి. కానీ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలను పెండింగ్‌లో పెట్టడం పరిపాటిగా మారింది. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ రోజుకి ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టడం విడ్డూరం. జులై 2023 నుండి ఐదు డీఎలు కలిపి మొత్తంగా 14.56% పెండింగ్‌లో పెట్టడంతో వేతన జీవులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక జులై 2023 నుండి రెండో వేతన సవరణ(పీఆర్సీ) అమలు జరగాల్సి ఉండగా నేటికి రెండు సంవత్సరాల కాలం గడిచిపోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. గత ప్రభుత్వం గత రెండేళ్ల క్రితం పీఆర్సీ కమీషన్‌ను నియమిస్తూ జీవో-159 విడుదల చేసింది. అయినా నేటి ప్రభుత్వం రెండో పీఆర్సీని అమలు చేయకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న వైఖరిని సూచిస్తోంది. వాస్తవానికి ఉద్యోగులు కోరేవి గొంతెమ్మ కోరికలేం కాదు. కానీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడంతో ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఉద్యోగులు పెన్ డౌన్ చేసి సమ్మెకు పిలుపునిచ్చే దాకా సమస్యలను పెండింగ్‌లో పెట్టడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే ఐదు పెండింగ్ డీఏలను మంజూరుచేస్తూ రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని వేతన జీవులు ఆకాంక్షిస్తున్నారు.
-సుధాకర్.ఏ.వి
90006 74747






