- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచి జీవితానికి పెన్షనర్లు అర్హులు కారా?
జీవితంలోని ఉత్తమ సంవత్సరాలలో ఈ సమాజానికి తమ శక్తి, యుక్తులను అంకితం చేసిన పింఛన్ దారులు వృద్ధాప్యంలో అనేక సమస్యలను

జీవితంలోని ఉత్తమ సంవత్సరాలలో ఈ సమాజానికి తమ శక్తి, యుక్తులను అంకితం చేసిన పింఛన్ దారులు వృద్ధాప్యంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. దేశ అభివృద్ధికి సాయపడిన ఈ పెద్దల జీవితం ఇప్పుడు ఆర్థిక భారం, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడితో నిండిపోయింది. వారు గౌరవప్రదమైన జీవనానికి అర్హులు. పింఛన్ దారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం దేశ అభివృద్ధిని సూచించే సూచికలలో ఒకటి. అందుకే ఇప్పుడు చర్యలు తీసుకొని, వారికి హాయిగా ఉండే జీవితం అందిద్దాం.
పింఛన్‌దారులకు ప్రధాన సమస్యలు ఆదాయపు పన్ను భారం, ద్రవ్యోల్బణం పరిస్థితి వారి జీవితాన్ని క్లిష్టతరం చేస్తోంది. అందుకే వారికి ఆదాయపు పన్ను నుండి పూర్తిగా మినహాయించడం లేదా మినహాయింపు పరిమితిని పెంచడం ద్వారా పింఛన్‌దారుల ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు. అలాగే వారికి ఆరోగ్య సంరక్షణ కొరత కూడా వారిని మానసికంగా కృంగదీస్తుంది. అందుకే వారికి పింఛన్‌దారులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య పాలసీ అవసరం. ఈ పాలసీలో ఆసుపత్రి సేవలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, మానసిక ఆరోగ్య సహాయం కూడా ఉండాలి. దీని ద్వారా పింఛన్‌దారులు తమ ఆరోగ్యాన్ని ఆర్థిక సమస్యలకు దూరంగా ఉంచుకోవచ్చు. ఇక వారి డియర్‌నెస్ అలౌన్స్ (డీఏ) పెండింగ్ బకాయిల ఆలస్యం వారిలో ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అందుకే ప్రభు త్వాలు ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం.
మానసిక, భావోద్వేగ సమస్యలు..
ఈ సమస్యలతో పాటు వృద్ధాప్యంలో ఎదురయ్యే మానసిక, భావోద్వేగ సమస్యలను కూడా గుర్తించాలి. ఒంటరితనం, డిప్రెషన్, ఆందోళనలకు శాశ్వత పరిష్కారాలు అవసరం. అందుకే వారికి కమ్యూనిటీ సెంటర్లు, కౌన్సెలింగ్ సేవలు, వినోద కార్యక్రమాలు ఏర్పరచాలి. అవే వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే వారికి అవసరమైన వస్తువులపై సబ్సిడీలు, విద్యుత్, నీటి బిల్లులపై తగ్గింపులు, రవాణా రాయితీలు లాంటి చర్యలు వారికి కొంత ఊరట కలిగిస్తాయి. వృద్ధులకు సత్వర సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌లు, సపోర్ట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలి.
దీర్ఘకాలిక చర్యలు తప్పనిసరి!
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు రంగాలలో పురోగతి సాధించినప్పటికీ పింఛన్‌దారుల అవసరాలను పరిష్కరించడంలో ఇంకా మెరుగుదల అవసరం ఉంది. ఉచిత వైద్య పాలసీలను అమలు చేయడం, డీఏ బకాయిలను విడుదల చేయడం ద్వారా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
- డాక్టర్ శ్రీరామ్ సాగర్
98493 28496






