- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెన్షనర్లను విభజించొద్దు!
పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం, పాత పెన్షన్ దారులకు హాని చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు

పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం, పాత పెన్షన్ దారులకు హాని చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మరో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిం ప జేసుకుంది. ఈ చట్టం డి.ఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధం. రాష్ట్రాలన్నీ ఈ చట్టం అమలు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని పెన్షనర్లను విభజన చేసి, పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉంది.
ఈ పెన్షన్ పథకం డేంజర్!
"కొత్త పెన్షన్ వద్దు - పాత పెన్షన్ ముద్దు" అని ఉద్యోగులు, పెన్షనర్లు రెండు దశాబ్దాలుగా ఆందోళన చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదు. కొత్త పెన్షన్ విధానంలో కొన్ని మార్పులు తెస్తూ 2025 ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే "యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని" తెచ్చింది. అంతేకాకుండా పాత పెన్షన్ దారులకు హాని చేసే మరో బిల్లును 2025-2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతో పాటు, అఖిల భారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది సుప్రీం తీర్పు ధిక్కరణ
ఈ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌర సేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972, 2021 అసాధారణ (ఎక్స్ట్రార్డినరీ) పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణల ద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ విధంగా పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఏ కోర్టు ప్రకటించిన డిక్రీ, ఉత్తర్వు, తీర్పులతోనూ సంబంధం లేకుండా పెన్షనర్లను గ్రూపులుగా విభజించి, పెన్షన్ సవరణకు అర్హత అన్న గ్రూపుకు ఎప్పటి నుంచి పెన్షన్ సవరణ అమలు పరచాలనే విషయంలో ప్రభుత్వానికి అధికారాన్ని దఖలు చేస్తుందీ ఈ చట్టం.
పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు కట్!
కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేసే ప్రమాదం ఉంది. రాష్ట్రాలన్నీ అమలు చేస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు అని పెన్షనర్లను విభజన చేసి, పాత పెన్షనర్లకు పెన్షన్ పెంపు లేకుండా చేసే ప్రమాదం పొంచి ఉంది. ఆకాశాన్ని అంటుతున్న ధరల పెరుగుదలతో, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రపంచంలో వృద్ధాప్యంలో సహజంగా దాపురించే అనారోగ్యాలతో ఎల్లకాలం ఎదుగు బొదుగులేని పెన్షన్‌తో కాలం గడపవలసి వస్తుంది. దీన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే, మన అసమ్మతిని ఉద్యమ రూపంలో వ్యక్తపరచకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది.
సుదీర్ఘ సమరం తప్పదు!
ఈ పరిణామాన్ని ముందే అడ్డుకోవాలని ఉద్దేశంతో అఖిల భారత స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దశలవారీ ఉద్యమ నిర్మాణానికి నడుం బిగించింది. మొదటి దశలో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా జూన్ 23 నాడు ప్రధానమంత్రికి లేఖలు పంపాలనే పిలుపును అందుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం విజయవంతం అయింది. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతో పాటు, అఖిల భారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-కె. వేణుగోపాల్,
విద్యారంగ విశ్లేషకులు,
98665 14577






