న్యాయవ్యవస్థను.. అపవిత్రం చేయకండి!

by Ravi |   (  Updated:2025-07-05 00:46:20  IST  )

న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు విరిచే వాడు వకీలు.. అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఈ మాటలు చూస్తే న్యాయ వ్యవస్థలో లాయర్ల

న్యాయవ్యవస్థను.. అపవిత్రం చేయకండి!
X

న్యాయాన్ని ఏ కీలుకు ఆ కీలు విరిచే వాడు వకీలు.. అలిశెట్టి ప్రభాకర్ చెప్పిన ఈ మాటలు చూస్తే న్యాయ వ్యవస్థలో లాయర్ల ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం అవుతోంది. కానీ న్యాయవ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత గలవారే న్యాయాన్ని మోసం చేస్తే, ప్రజలు ఇక ఎవరిని ఆశ్రయించాలి? తాజాగా తెలంగాణా బార్ కౌన్సిల్ 9 మంది న్యాయవాదులను ప్రాక్టీస్ నుండి తొలగించింది. అందులో 8 మంది నకిలీ డిగ్రీలలో నమోదు అయ్యారని, మరొకరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వృత్తిపరమైన నైతికతను పూర్తిగా ఉల్లంఘించారని వారిని సస్పెండ్ చేసింది.

నకిలీ లాయర్లను నమ్మి..

ఈ నకిలీ లాయర్లు ప్రాక్టీస్‌లోకి వచ్చే ముందు అంటే 2024కి ముందు బార్ కౌన్సిల్ వారు ప్రతి అభ్యర్థి నుండి డిగ్రీ ధృవీకరణ, ప్రాసెసింగ్ ఖర్చులు, లైసెన్స్ ఫీజు పేరిట ఓసీ, బీసీల నుంచి రూ.13,000, ఎస్సీ, ఎస్టీల నుంచి రూ.10,000 వసూలు చేశారు.. ఇలా అధిక ఫీజులు వసూలు చేసి కూడా ధ్రువీకరణ లోపించడం తీవ్ర నిర్లక్ష్యం. ఇక ఈ నకిలీ న్యాయవాదుల్లో ఒకరు ప్రముఖ యూట్యూబ్ చానెళ్లలో, న్యూన్ చానెళ్లలో న్యాయ సలహాదారుగా కనిపిస్తూ, ప్రజలకు న్యాయ సూచనలు ఇస్తూ తాను నకిలీ వకీల్ అనే విషయాన్ని దాచిపెట్టాడు.. ప్రజలు ఆయన మాటల్ని నమ్మి అనేక కేసులు అప్పగించారు..

సమాజమే న్యాయం కోల్పోయే ప్రమాదం!

ఒక నకిలీ వకీల్ వల్ల నష్టపోయే వాడు ఒక్క వ్యక్తి కాదు, సమాజం మొత్తం. ఎందుకంటే అతని చేతిలోని ప్రతి కేసు వెనుక ఒక జీవితం ఉంటుంది. నకిలీ డాక్టర్ వల్ల ఒక్కరే బాధపడతాడు. కానీ నకిలీ వకీల్ వల్ల నిండుగా సమాజమే న్యాయం కోల్పోతుంది. ఈ నకిలీ వకిల్‌లు తెలంగాణాలో మాత్రమే కాదు. ఢిల్లీలో 107 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది నకిలీ వకీళ్లను ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిల్‌లు తొలగించాయి. కనుక ఇదో జాతీయ స్థాయి సమస్య. అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాప్తంగా న్యాయవాదుల డేటాబేస్‌ను ఏర్పాటు చేయాలి. ప్రతి న్యాయవాది వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వారి డిగ్రీలను తిరిగి ధృవీకరించాలి. నకిలీ వకీల్ల వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేక న్యాయ సహాయం అందించాలి. వెరిఫికేషన్‌లో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. నకిలీ వకీళ్లకు సంబంధించి కేవలం ప్రాక్టీస్ హక్కు రద్దు చేయడమే కాకుండా, నేరపూరిత చర్యలు కూడా తీసుకోవాలి. నిజమైన అభ్యాసకులను గుర్తించి యువ న్యాయవాదుల అభివృద్ధికి ఆర్థిక, వృత్తిపరమైన మద్దతు ఇవ్వాలి.

తప్పుడు న్యాయం జరగొద్దు!

ఈ నకిలీ లాయర్లతో పోలిస్తే, నిజంగా చదువుకుని, అనేక కష్టాలు ఎదుర్కొంటూ వృత్తినే ఆశ్రయించి బతికే నిజమైన యువ న్యాయవాదులు, న్యాయవాద వృత్తిలో కష్టంగా జీవనం సాగిస్తున్నారు.. వారికి ప్రభుత్వాలు బార్ కౌన్సిల్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం లేదు. ప్రభుత్వం, న్యాయ శాఖ ఈ సమస్యను తక్షణమే పట్టించుకొని దేశవ్యాప్తంగా సమగ్ర ధృవీకరణ విధానం రూపొందించాలి. ప్రజలు భయపడకుండా న్యాయాన్ని ఆశ్రయించేలా సురక్షితమైన న్యాయ వ్యవస్థను నిర్మించాలి. నిజమైన న్యాయవాదులను గౌరవించడంతో పాటు, నకిలీ న్యాయవాదులను తొలగించడం ప్రభుత్వ ధర్మం. న్యాయవ్యవస్థ అనేది సమాజం చివరి ఆశ. దాన్ని అపవిత్రం చేయకుండా, నైతికతతో ముందుకు తీసుకె ళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. న్యాయం ఆలస్య మవొచ్చు కానీ తప్పుడు న్యాయం జరగకూడదు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి.. న్యాయవ్యవస్థను రక్షించండి. నిజమైన న్యాయవాదులను ఆదుకోండి.

-బద్దం తిరుపతి రెడ్డి

తెలంగాణ హైకోర్టు న్యాయవాది

93917 24720

Next Story