- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలబ్రెటీలకు.. సామాజిక బాధ్యత అవసరం లేదా?
ఇటీవలి కాలంలో, తెలుగు సినీ పరిశ్రమతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అక్రమ బెట్టింగ్ యాప్ స్కామ్‌లకు సంబంధించి ఈడీ

ఇటీవలి కాలంలో, తెలుగు సినీ పరిశ్రమతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అక్రమ బెట్టింగ్ యాప్ స్కామ్‌లకు సంబంధించి ఈడీ సమన్లను అందుకున్నారు. ఈడీ 29 మంది ప్రముఖులపై కేసులు నమోదు చేసింది. వీరిలో నటులు, టెలివిజన్ ప్రముఖులు, డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. వీరంతా అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను ప్రచారం చేయడం, వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ఈ ప్రచారాల ద్వారా భారీ మొత్తంలో చెల్లింపులు పొందడం వంటి ఆరోపణలు ఈ వ్యక్తులపై ఉన్నాయి.
ఈ కేసు కేవలం వ్యక్తిగత నేరాలుగా కాకుండా సమాజంపై ప్రముఖుల ప్రభావం, డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు, ఆర్థిక నేరాల మధ్య పెరుగుతున్న సంబంధాన్ని వెల్లడిస్తోంది.
ఈ కేసు నేపథ్యం
ఈ కేసు విచారణ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో స్థానిక పోలీసు స్టేషన్లలో దాఖలైన అనేక ఎఫ్‌ఐఆర్‌ల నుండి ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేసిన ఫిర్యాదు ఈ విచారణకు ఒక ముఖ్యమైన కారణం. ప్రముఖులు ప్రచారం చేస్తున్న డిజిటల్ ప్రకటనలు అమాయక వినియోగదారులను ఆర్థికంగా నాశనం చేస్తున్నాయని ఆ ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లు.. బీఎన్‌ఎస్ (సెక్షన్లు 318(4), 112 సెక్షన్ 49తో కలిపి), తెలంగాణ రాష్ట్ర గేమింగ్ చట్టం (సెక్షన్ 4), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 66-డి కింద మోసపూరిత కార్యకలాపాలు, అక్రమ జూదం ప్రచారం, ఆన్‌లైన్ మోసాలను ఎదుర్కొనే నిబంధనల కింద అభియోగాలు మోపాయి. భారతదేశ ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ఉన్న గణనీయమైన చట్టపరమైన సందిగ్ధతను, నియంత్రణ సవాళ్లను స్పష్టం చేస్తాయి. పాత చట్టాలు, ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు అనుగుణంగా లేకపోవడం ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఈడీ విచారణ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి వస్తుంది.
ఈడీ విచారణ తీరు..
ఈడీ తన విచారణల సమయంలో విస్తృత అధికారాలను కలిగి ఉంది. అనుమానితులు, సాక్షులు, సంబంధిత సమాచారం ఉన్న ఎవరికైనా ప్రశ్నించడానికి సమన్లు జారీ చేయవచ్చు. ఇది ప్రధానంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) 2002, విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) 1999, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం (ఎఫ్‌ఈఓఏ), 2018 కింద నేరాలను విచారించడానికి బాధ్యత వహిస్తుంది. పీఎంఎల్‌ఏ కింద దాని ప్రధాన విధి. నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించడం, అటువంటి ఆస్తిని తాత్కాలికంగా జప్తు చేయడం, నేరస్థులపై విచారణ, ఆస్తిని స్వాధీనం చేసుకోవడం. అయితే మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ విచారణను ప్రారంభించినప్పుడు ఈసీఐఆర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్)ను నమోదు చేస్తుంది. అయితే దీనిని ఎఫ్‌ఐఆర్ కాపీ లాగా నిందితుడికి తప్పనిసరిగా అందించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు, విజయ్ మదన్‌లాల్ చౌదరి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఈసీఐఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌తో సమానం చేయలేమని, అందువల్ల దానిని అందించకపోవడం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించదని స్పష్టంగా తీర్పు ఇచ్చింది. అయితే సెక్షన్ 19 ప్రకారం, ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అరెస్టుకు గల కారణాలను తెలియ జేయాలి. ఇది మౌఖికంగా చేయవచ్చు. ఈ కేసులో అరెస్టైతే పీఎంఎల్‌ఏ కింద ఉన్న కఠినమైన రెండు షరతులతో నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.
అరెస్టులు చేయవచ్చా?
ఈడీ సమన్లు అందుకున్న తర్వాత, ఆరోపణలు ఎదుర్కొనే వారిని ప్రశ్నించడానికి పిలుస్తారు. వారు సహకరించి, సంతృప్తికరమైన వివరణలు అందించి, వారి వద్ద మనీలాండరింగ్‌కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు కనుగొనబడకపోతే, వారిని నిర్దోషులుగా ప్రకటిస్తారు. అందుకు తగిన ఆధారాలు కనుగొనబడితే మాత్రం అరెస్టు లు సాధ్యమే. వారి ఆస్తులు నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులుగా గుర్తించబడితే, వాటిని తాత్కాలికంగా జప్తు చేసి, చివరకు శాశ్వతంగా స్వాధీనం చేసుకోవచ్చు. ఈడీ విచారణ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, సెలబ్రిటీల బాధ్యతను స్పష్టంగా గుర్తు చేస్తుంది. ఏదేమైనా నైపుణ్యం ఆధారిత ఆటలుగా ముసుగు కప్పుకున్న బెట్టింగ్ యాప్‌ల పట్ల పాఠకులు జాగ్రత్తగా ఉండాలి. ఇవి వినియోగదారులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఇక ఈ కేసును గమనిస్తే, నియంత్రణ సంస్థలు టెక్నాలజీకి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది. పాత చట్టాలు, ఆధునిక డిజిటల్ పద్ధతుల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి ఆన్‌లైన్ జూదం, మోసపూరిత ప్రకటనలను సమర్థవంతంగా నియంత్రించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు, కఠినమైన అమలు యంత్రాంగాలు అవసరం.
డా.కట్కూరి
సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు
80192 01820






