రూటు మారనున్న డాలర్ డ్రీమ్స్!

by Ravi |   (  Updated:2026-02-13 01:11:04  IST  )

దశాబ్దాలుగా భారతీయ మధ్య తరగతి మేధావులకు ‘అమెరికా’ ఒక స్వర్గధామం. సాంకేతిక నైపుణ్యం కలిగిన భారతీయులకు, వారిని క్లయింట్ల వద్దకు చేర్చే ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా ఒక వారధిలా పనిచేసింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం తర్వాత, ఈ వారధిపై ఆంక్షల కంచెలు పెరుగుతున్నాయి..

రూటు మారనున్న డాలర్ డ్రీమ్స్!
X

దశాబ్దాలుగా భారతీయ మధ్య తరగతి మేధావులకు ‘అమెరికా’ ఒక స్వర్గధామం. సాంకేతిక నైపుణ్యం కలిగిన భారతీయులకు, వారిని క్లయింట్ల వద్దకు చేర్చే ఐటీ కంపెనీలకు హెచ్-1బీ వీసా ఒక వారధిలా పనిచేసింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పునరాగమనం తర్వాత, ఈ వారధిపై ఆంక్షల కంచెలు పెరుగుతున్నాయి.. ఫిబ్రవరి 2026 నాటికి అమల్లోకి వస్తున్న మార్పులు కేవలం ఒక దేశ విధాన నిర్ణయాలు మాత్రమే కాదు, ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి.

తాజాగా కొద్దిరోజుల కిందట అర్కాన్సాస్ సెనెటర్, రిపబ్లి‌కన్ పార్టీలో కన్జర్వేటివ్ (సంప్రదాయవాది) నాయ కుడిగా పేరొందిన టామ్ కాటన్ ఓ వేదికపై మాట్లాడుతూ మొత్తంగా హెచ్-1బీ వీసా వ్యవస్థనే ఎత్తివేయాలని డిమాండ్ చేశాడు.. దీంతో ఇప్పటికే అమెరికాపై భారతీయ టెకీలకు ఉన్న కాసింత ఆశలపై ఆయన నీళ్లు చల్లేశాడు. ఇప్పుడు సగటు ఐటీ ఉద్యోగితో పాటు కంపెనీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, తనొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టు.. ట్రంప్ అమెరికన్లకు ఉద్యోగం రావాలని హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తుంటే.. భారతీయ కంపెనీలు ప్లాన్ బీ అమలు చేసేందుకు సిద్ధమవు‌తున్నాయి. దీంతో ఉద్యోగాల మాట అటుంచి.. ఐటీ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం కూడా అమెరికాకు అందకుండా పోయే ప్రమాదం ఉన్నది. దీంతో ట్రంప్ నిర్ణయాలు బూమరాంగ్ అయ్యేందుకు ఎంతో సమయం పట్టేలా లేదు..

భారత కంపెనీలకు అవరోధాలు..

భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు ప్రస్తుతం ముందెన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రతి కొత్త హెచ్-1బీ వీసా పిటిషన్‌పై $100,000 అదనపు రుసుము విధించాలనే ప్రతిపాదన కంపెనీల లాభదాయకతను దెబ్బతీస్తున్నది. వేల సంఖ్యలో ఉద్యోగులను పంపే కంపెనీలకు ఇది కోట్లాది రూపాయల అదనపు భారం. కొత్త నిబంధనల ప్రకారం, లాటరీ పద్ధతి స్థానంలో అత్యధిక వేతనం ఇచ్చే వారికే వీసా కేటా యిస్తారు. దీనివల్ల తక్కువ అనుభవం ఉన్న ఇంజినీర్లను అమెరికా పంపడం అసాధ్యంగా మారుతుంది. వీసా నిబంధ‌నలు ఎప్పుడు మారుతాయో తెలియని పరిస్థితి వల్ల, కంపెనీలు దీర్ఘకాలిక ప్రాజెక్టులను ప్లాన్ చేసుకోవడానికి సిద్ధంగా లేవు.. ట్రంప్ తీసుకువచ్చిన విధానాల వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య ఐటీ ఉద్యోగి మాత్రమే.. గతంలో 3 - 4 ఏళ్ల అనుభవం ఉన్నవారు అమెరికా వెళ్లి డాలర్లలో సంపాదించేవారు.. ఇప్పుడు ఆ అవకాశం కేవలం సీనియర్లకు, అత్యున్నత నిపుణులకు మాత్రమే పరిమితం కానుంది.

అమెరికాకు లాభమా? నష్టమా?

ట్రంప్ ప్రభుత్వం ‘అమెరికా ఫస్ట్’ అని వాదిస్తున్నప్పటికీ, దీనివల్ల అమెరికాకు కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అమెరికన్ కంపెనీలకు భారత్ నుండి వచ్చే చౌకైన సాంకేతిక సాయం అందకపోతే, వారి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. ఇది అమెరికాలో ద్రవ్యోల్బణానికి దారి తీయనున్నది. అమెరికాలో ఐటీ రంగంలో నిపుణుల కొరత ఉంది. భారతీయ ఇంజినీర్లను అడ్డుకుంటే, ఆ స్థానాన్ని భర్తీ చేసేంత మంది స్థానిక నిపుణులు అక్కడ అందు బాటులో లేరు. స్థానిక అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు లభించడం, విదేశీయులపై ఆధారపడటం తగ్గడం అమెరికా రాజకీయ నేతలకు లాభం చేకూర్చే అవకాశం ఉన్నా.. అమెరికన్లపై మాత్రం మరింత భారం పడనున్నది.

రూటు మార్చుతున్న కంపెనీలు..

ఈ సవాళ్లను అధిగమించేందుకు భారత కంపెనీలు ‘ప్లాన్- బి’ని సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికాలోనే అమెరికన్లను లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లను ఉద్యోగాల్లోకి తీసుకోవడం పెంచాయి. గత కొన్నేళ్లుగా భారత కంపెనీలు అమెరికాలో అతిపెద్ద ఉద్యోగ కల్పన కర్తలుగా మారడానికి ఇదే కారణం. మనుషుల అవసరం లేకుండానే పనులు పూర్తి చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు పెంచుతున్నాయి. ‘కోడింగ్’ వంటి పనులను ఆటోమేట్ చేయడం ద్వారా వీసాల అవసరాన్ని తగ్గించుకుంటున్నాయి. కొవిడ్ కాలంలో అలవాటైన ‘రిమోట్ వర్కింగ్’ మోడల్‌ను ఇప్పుడు క్లయింట్లు కూడా అంగీకరిస్తు న్నారు. భారత్ నుండే 90% ప్రాజెక్టును పూర్తి చేసి, అత్యంత కీలకమైన పనులకు మాత్రమే మనుషులను అమెరికా పంపడంపై దృష్టి పెడుతున్నాయి.

మెక్సికో, కెనడా కేంద్రాలుగా..

అమెరికా వీసా నిబంధనల నుండి తప్పించుకోవడానికి భారత కంపెనీలు ఇప్పుడు అమెరికాకు సరిహద్దులో ఉన్న దేశాలను కెనడా, మెక్సికోలను ఎంచుకుంటున్నాయి. కెనడా ఇమ్మిగ్రేషన్ విధానాలు సాపేక్షంగా సరళంగా ఉండటంతో.. భారత కంపెనీలు టొరంటో, వాంకోవర్ వంటి నగరాల్లో పెద్ద సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి.. అమెరికా టైమ్ జోన్‌లోనే ఉంటూ, అక్కడి క్లయింట్లకు సేవలు అందించడానికి ఇది సులభం. తక్కువ ఖర్చుతో కూడిన శ్రమశక్తి లభించడం వల్ల మెక్సికో కూడా ఐటీ హబ్‌గా మారుతున్నది. దీనివల్ల అమెరికా పన్ను ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కంపెనీలు భౌతికంగా అమెరికాలో లేకపోయినా, అమెరికా మార్కెట్ నుండి లాభాలను పొందుతాయి.

వ్యతిరేకిస్తున్నది ఆ ముగ్గురే..

అమెరికాలో హెచ్-1బీ వీసాలను ప్రధానంగా వ్యతిరే కిస్తున్నది ముగ్గురు.. అందులో ఒకరు స్వయంగా భారతీయు‌డైతే మరొకరు భారత్‌తో దగ్గరి సంబంధాలు ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీలో నంబర్ 2 తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒకరైతే, భారతీయుడైన వివేక్ రామస్వామి మరొకరు, అర్కాన్సాస్ సెనెటర్ కరుడుగట్టిన సంప్రదాయవాదిగా పేరొందిన టామ్ కాటన్ వీరే హెచ్ 1బీ వీసాలకు వ్యతి రేకంగా మాట్లాడుతున్నారు.. మొత్తంగా అమెరికాకు మరింత లబ్ధి చేకూర్చాలని అంతిమంగా తాము రాజ కీయంగా లాభం పొందాలని ఆడుతున్న ఆట చివరికి అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టనున్నాయి.. భారతీయ ఐటీ నిపుణులను అడ్డుకోవడం అంటే బంగారు గుడ్లు పెడుతున్న బాతును పొట్ట కోయడమే అవుతుందన్న సత్యం అర్థం కావడానికి మరెన్నో రోజులు పట్టదన్నది మాత్రం కఠోర వాస్తవం.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story