- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిర అంటే ఎమర్జెన్సీ మాత్రమేనా?
నేటి యువతకు ఇందిరా గాంధీ అంటే ఎమర్జెన్సీ మాత్రమే అనేలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? ఇందిరా గాంధీ మరణించి నాలుగు దశాబ్దాలయింది.

నేటి యువతకు ఇందిరా గాంధీ అంటే ఎమర్జెన్సీ మాత్రమే అనేలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? ఇందిరా గాంధీ మరణించి నాలుగు దశాబ్దాలయింది. అంటే నేడు భారతదేశంలో ఉన్న దాదాపు 50% కంటే ఎక్కువ జనాభా ఆమె మరణించిన తర్వాత జన్మించిన వారే. వీరికి ఇందిరాగాంధీ అంటే ఏం తెలియాలి?
భారతదేశ మొట్ట మొదటి మహిళ ప్రధానమంత్రిగా, ఎన్నికల ద్వారా గెలిచి దేశాన్ని ఎక్కువ రోజులు పరిపాలించిన మహిళగా, వారి గురించి ఏం చెప్పాలి? కానీ ఈ పాలకులు ఏం చెబుతున్నారు? 1980 దశకం తర్వాత జన్మించిన వారు ఇందిరా గాంధీ జీవితంలో ఎమర్జెన్సీని ఒక అధ్యాయంగా మాత్రమే చూస్తారా? లేక ఇందిరా గాంధీ జీవితం అంటే ఎమర్జెన్సీ మాత్రమే అనే విధంగా చూస్తారా? అనేది వారే నిర్ణయించుకోవాలి.
హరిత విప్లవంతో మొదలెట్టి...
ఇందిరా గాంధీ జీవితంలో ఎమర్జెన్సీ కంటే ముఖ్యమైన విజయాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడి ఆహార ధాన్యాలను అమెరికా నుంచి పి ఎల్ 480 అనే పథకం ద్వారా దిగుమతి చేసుకుంటున్న కాలమది. 70 శాతం పైగా జనాభా వ్యవసాయంపై ఆధారపడినప్పటికీ దేశానికి సరిపడా ఆహార ధాన్యాలను పండించు కోలేని సమయంలో 1960లలో హరిత విప్లవం తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పాల ఉత్పత్తిని కూడా శ్వేత విప్లవం ద్వారా దేశానికి పరిచయం చేసింది. ఇక వన్యప్రాణులు, పర్యా వరణం పట్ల ఆమెకు మృదువైన కోణం ఉండేది. దేశంలో ప్రకృతి పరిరక్షణకు మార్గం సుగమం చేయడానికి ఆమె కొన్ని మైలురాయి విధాన నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం, పర్యావరణ పరిరక్షణ కోసం వరుస చట్టాలు ఉన్నాయి.
బ్యాంకుల జాతీయీకరణ రూపశిల్పి..
అప్పటి వరకు ధనవంతులు, వ్యాపారుల కోసం మాత్రమే పనిచేసే బ్యాంకులను జాతీయం చేసి, ఆ బ్యాంకులను పేద రైతులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత ఇందిరకే చెల్లుతుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం దేశంలో 1969 వరకు 1,833 బ్యాంకులు ఉంటే ఆ సంఖ్య 1995 నాటికి 33,004 బ్యాంకులకు చేరింది. కొత్తగా ఏర్పాటు అయిన బ్యాంకుల్లో అధికంగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు అయినవే. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసి వ్యవసాయం చేసే పేద రైతులకు ఈ బ్యాంకుల జాతీయకరణ ఎంతో తోడ్పాటుని ఇచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం వందలాది మంది సంస్థానాధీశులకు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును భరణంగా చెల్లించడం రద్దు చేసి ఇందిరా తన సోషలిస్టు విధానాలను మరోమారు చాటి చెప్పింది.
అపర దుర్గ అని పోల్చిందెవరు?
1971లో పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్) పై యుద్ధం ప్రకటించినప్పుడు ఎంతోమంది తూర్పు పాకిస్తాన్ ప్రజలు, రాజకీయ నాయకులు భారతదేశంలోకి శరణార్థులుగా వస్తున్నప్పుడు ఆ సమస్యను నివారించడం కోసం అమెరికా మాటను కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించి దేశాన్ని గెలిపించింది. ఈ యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు. భారతదేశం సాధించిన విజయాల్లో ఇది అత్యంత ప్రత్యేకమైన విజయంగా గుర్తింపు పొందింది. ఈ యుద్ధా నంతరం ఇందిరాగాంధీని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చారు.
పేద ప్రజలకు దగ్గర చేసిన పథకం..
1974లో పోఖ్రాన్ అణు పరీక్షను రాజస్థాన్‌లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 1975లో భారత మొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టని కూడా విజయవంతంగా ప్రారంభించారు. ప్రభుత్వం సంపన్నులకు, పెద్ద వ్యాపా రులకు, పెట్టుబడిదారులకు రాయితీలు, ప్రయోజనాలు అందిస్తే దాని ఫలాలు దిగువ తరగతి ప్రజల వరకు అందుతాయని చెప్పిన ట్రికిల్ డౌన్ సిద్దాంతం పనిచేయడం లేదని ‘గరీబీ హటావో’ అనే నినాదం 1971లో ఇచ్చి పేదరిక నిర్మూలనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. 1975లో 20 సూత్రాల పథకం అనేది దేశ చరిత్ర గొప్ప విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఈ కార్యక్రమాల ద్వారా ఇందిరా గాంధీ కొండల్లో, గూడెంలో, తండాల్లో, పల్లెల్లో, ఉన్న ప్రజలకు దగ్గర అయ్యింది.
విదేశాంగ విధానంలో దిట్ట..
ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న ఆ కాలంలో అటు అమె రికాకు గానీ ఇటు యూఎస్ఎస్ఆర్‌కు గానీ మద్దతు తెలుపకుండా తటస్థ వైఖరిని పాటించి అలా తటస్థంగా ఉండే అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించి ఆ దేశాలకు నాయకత్వం వహించడం జరిగింది. ఇది నేటికీ భారత దేశ విదేశాంగ విధానంగా అమలవుతోంది. వీటన్నింటినీ చూస్తే, ఎమర్జెన్సీ అనేది ఇందిర జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. కానీ ప్రస్తుత పాలకులు చెబుతున్నట్లు ఇందిరా గాంధీ జీవితం అంటే కేవలం ఎమర్జెన్సీ మాత్రమే కాదని తేలిపోతుంది.
ఆ పేరు చరిత్రలో లేకుండా చేయాలని..!
ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్న పాలకులు బాహాటంగానే మనుస్మృతి పట్ల వారి విశ్వాసాన్ని ప్రకటించేశారు. ఈ మనుస్మృతి అభిమానులు ఎప్పుడూ కూడా స్త్రీలు వంటింటికి మాత్రమే పరిమితం కావాలని, మొరార్జీ దేశాయి అన్నట్లుగా గూంగి గుడియా (మూగ బొమ్మ) లాగే ఉండాలని కోరుకునేవారు. కానీ వారి విశ్వాసాలకు విరుద్ధంగా ఇందిరా గాంధీ పాలనను చేపట్టడమే కాకుండా మన చరిత్ర పుటల్లో ఇందిరా పేరును తప్పక ఉచ్చరించే అనివార్యతను కల్పించింది. ఇందిరా గాంధీ విజయాలు దూరదృష్టి, దౌత్య నీతి, దృఢ నాయకత్వం, సంక్షేమం, అభివృద్ధిల గురించి మాట్లాడకుండా ఉండేందుకు మను వాదులు వేసిన ఎత్తుగడే ఈ ఎమర్జెన్సీ అనే అంశానికి అత్యంత ప్రచారాన్ని కల్పించడం.
- చిందం మధు
ఉస్మానియా యూనివర్సిటీ
96403 16246






