జంతువుకున్న రక్షణ అమ్మాయికి లేదా?

by Ravi |   (  Updated:2026-04-25 00:30:58  IST  )

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ఎస్. సరస్వతి చిత్రం సమాజంలో బాలికలపై జరుగుతున్న దాడులు, న్యాయ వ్యవస్థలోని లోపాలపై ప్రశ్నించే రివెంజ్ డ్రామా. ప్రకాశ్ రాజ్ కీలక పాత్రతో ఈ సినిమా ఆలోచింపజేసే కథను అందిస్తుంది.

జంతువుకున్న రక్షణ అమ్మాయికి లేదా?
X

2009లో పోసాని కృష్ణమురళి స్వియ దర్శకత్వంలో ‘రాజా వారి చేపల చెరువు’ సినిమా తీశాడు. ఆ సినిమాలో, లేని చేపల చెరువు పోయిందని కేసు పెట్టి అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల అవినీతిని ఎండగట్టారు.. సరిగ్గా అలాంటి ప్రయత్నమే ఎస్. సరస్వతి సినిమాతో వరలక్ష్మి శరత్ కుమార్ చేశారు.. అయితే ఈ సినిమాలో వ్యవస్థలో చిన్న పిల్లల పట్ల లైంగిక వేధింపులు ఎలా జరుగుతున్నాయో, కేసులు నమోదైనా కోర్టుల్లో సాక్ష్యాలు లేవని ఎలా తప్పించుకుంటున్నారో ఆమె తెలియజేసే ప్రయత్నం చేసింది.

ఈ సినిమా ఓ రివెంజ్ డ్రామా. తన కుమార్తె రేప్ కాబడి చనిపోతే, ఆ రేప్ చేసిన వాళ్లను చట్టపరంగా శిక్షించడం కోసం ఓ తల్లి చేసే పోరాటమే ఈ సినిమా. పాప కనిపించడం లేదంటూ కథానాయిక హడావుడి.. ఇంకోవైపు ఏ ఒక్కదానికీ సాక్ష్యాలు కనిపించకపోవడంతో దీంతో నిజంగా ఆమెకు పాప ఉందా లేదా? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది.

ఎంచుకున్న కథ మంచిదే.. కానీ

'ఈ దేశంలో జాతీయ జంతువైన పులిని చంపితే నాన్ బెయిలబుల్ అఫెన్స్.. అదే జాతీయ పక్షి నెమలిని చంపితే నాన్ బెయిలబుల్ అఫెన్స్.. కానీ అదే ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే కోర్టులు బెయిల్ ఇచ్చి బయటకు పంపుతున్నారు. బయటకు వచ్చి ఆ నిందితుడు మళ్లీ అదే తప్పు చేసి లోపలికి వెళ్లి దర్జాగా ఏ భయం లేకుండా తిరుగుతున్నాడు. ఏ తప్పు చేయని మేమెందుకు భయపడాలి? వాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించలేదు కాబట్టి నేను న్యాయం చేశాను..' ఇలా పేపర్ మీద ఈ స్టోరి అద్భుతంగా ఉంది. తొలుత థ్రిల్లర్‌గా ప్రారంభమైన ఈ సినిమా, ఆ తర్వాత మెడికల్ కాంప్లికేషన్స్‌ అంటూ పలు ట్విస్టులతో అలరించేందుకు ప్రయత్నించింది.

కథేంటంటే..

కథలోకి వెళ్తే, లక్ష్మి(వరలక్ష్మి) ఓ అనాథ. ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తుంటుంది. ఆగస్టు 15న తన కూతురు ఎస్‌. సరస్వతిని స్కూల్‌లో దించి ఉద్యోగానికి వెళ్లిపోతుంది. కానీ, సాయంత్రం తిరిగి వచ్చే సరికి ఆ పాప స్కూల్‌లో కనిపించదు.. దీనిపై ఆ స్కూల్‌ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే అసలు సరస్వతి పేరుతో లక్ష్మి చెప్పిన క్లాస్‌లో ఏ అమ్మాయి లేరని చెబుతుంది. కట్‌ చేస్తే.. స్కూల్‌లో తన పాపను ముగ్గురు అత్యాచారం చేసి చంపారని.. ఆ శవాన్ని ఓ చోట పాతిపెట్టానని ఆ మరుసటి రోజే పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కుతుంది లక్ష్మి. అయితే పోలీసులు ఆమె చెప్పిన చోట తవ్వి చూడగా అక్కడ ఏమీ ఉండదు. దీంతో ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయకుండానే వదిలేస్తారు.. దీనిపై ఆమె న్యాయవాది రామానుజం (ప్రకాశ్‌ రాజ్‌) సహాయంతో కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ సాక్ష్యాలు లేవనే కారణంతో అక్కడా కేసును కొట్టేయాల్సి వస్తుంది. సరిగ్గా అప్పుడే లక్ష్మి తన కూతుర్ని చంపారనే కారణంతో ఓ జడ్జిని, ఐఏఎస్‌ అధికారిని, పోలీస్‌ని హత్య చేస్తుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది.

కంటెంట్‌కే ప్రాధాన్యత ఇచ్చారు!

ఈ పాప కేసు కోసం న్యాయవాది ప్రకాశ్‌రాజ్‌ రంగంలోకి దిగినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమా అంతా ప్రకాశ్ రాజ్, వరలక్ష్మిల చుట్టే తిరుగుతుంది. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. కోర్టు విచారణ సన్నివేశాలు స్లో నరేషన్‌తో ఉన్నా పదునైన మాటలు ఉన్నాయి.. సాయి మాధవ్ బుర్రా కథ అందించడమే సినిమాకు ప్లస్.. ఈ సినిమాలో మసాలా కంటే కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. దర్శకుడు మంచి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించాడు. సమాజాన్ని ఆలోచింపజేసే ఇలాంటి సినిమాలు తప్పకుండా చూడాలి.

- రవి

8121247221

Next Story