తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య

by Ravi |   (  Updated:2025-04-03 00:46:17  IST  )

భూమి కోసం, భూక్తి కోసం.. బానిస బంధాల నుంచి విముక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ

తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక దొడ్డి కొమురయ్య
X

భూమి కోసం, భూక్తి కోసం.. బానిస బంధాల నుంచి విముక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. నైజాం దేశ్‌ముఖ్‌‌ల కుట్రలతో చిందిన దొడ్డి కొము రయ్య రక్తంతో తెలంగాణ రక్త సిక్తమైంది. బాంచెన్ దొర కాల్ మొక్తా అంటూ దొర పెత్తనంలో నలిగిన వాళ్లను బందూకులు చెత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు కొమురయ్య.

దాష్టికాలను భరించలేక..

నిజాం పాలన సమయంలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు దారుణంగా ఉండేవి. భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా జనాలకు హక్కులు ఉండేవి కావు. పటేల్, పట్వారీల దుర్మార్గాలతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని 60 గ్రామాలను దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డి, ఆయన భార్య జానకమ్మ దొరసాని, కుమారుడు బాబు దొర ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ అన్ని రకా లుగా పీడించే వారు. ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడేవారు. దీంతో కడవెండిలో నిజాం నిరంకుశ పాలనను వ్యతిరెకిస్తూ జానమ్మ దొరసాని దాష్టికాలకు స్వస్తి పలికేందుకు పీడిత ప్రజలు ఎర్ర జెండా నీడలో పోరు బాట పట్టారు. భూమి కోసం.. భూక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. ఆనాడు కడవెండిలో అంకురార్పణ జరిగిన పోరాట చరిత్ర ప్రపం చంలోని పీడిత ప్రజల్లో ఉద్యమస్పూర్తిని రగిల్చింది. 1946 జూలై 4 సంఘపోళ్లు దొరసాని, ఆమె గుండాల చర్యలకు వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్ర మహాసభకు జై అంటూ నినాదాలు చేస్తుంటే దొరసాని తనను ఏం చేస్తారోనని భయపడి గడి నుంచి మిస్కిన్ అలీతో కాల్పులు జరిపించింది. దీంతో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలో బుల్లెట్లు దిగాయి. అయినా ఆంధ్ర మహసభకు జై అంటూ నినాదాలు చేస్తూ నేలకొరిగాడు.

ఉద్యమానికి ఊపిరి పోసిన మరణం

దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి కోసం శాంతియుతంగా సాగిన తెలంగాణ విముక్తి పోరు కాస్తా కొమురయ్య అమరత్వంతో రక్తానికి రక్తం.. ప్రాణానికి ప్రాణం.. అనే నినాదంతో సాయుధ పోరాటంగా మారింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పోటెత్తడంతో దొరల గడీ నేలమట్టమైంది. ఈ పోరాటం హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. దీంతో దొడ్డి కొమురయ్య ప్రపంచ చరిత్రలో వీరుడిగా చిర స్థాయిగా నిలిచాడు. దొరసాని జానమ్మ వ్యవసాయ పనికి గానీ, ఇంటి పనికి గానీ, ఎవరూ పోవద్దని ఆంధ్రమహాసభ పిలుపు ఇవ్వడంతో ఆనాడే సహయ నిరాకరణ మొదలైంది. దీంతో దొరసాని వ్యవసాయం పడావుపడింది. జానమ్మ తిరిగి విస్నూరు వెళ్లిపోయింది. ఆ తర్వాత సంఘ కార్యక్రమాలు ఉదృతమై మరో పోరాటానికి నాంది పలికాయి. తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించన మహత్తర తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తిని రగిలించిన దొడ్డి కొమురయ్య! కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది.

(నేడు దొడ్డి కొమురయ్య జయంతి)

- లకావత్ చిరంజీవి నాయక్

99630 40960

Next Story