బోనాల పండుగలోనూ.. కులతత్వమేనా?

by Ravi |   (  Updated:2025-07-01 01:01:12  IST  )

తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగలలో బోనాల పండుగ ఒకటి. అయితే కులాల పేరిట మను షులను వేరు చేస్తున్న

బోనాల పండుగలోనూ.. కులతత్వమేనా?
X

తెలంగాణలో ఘనంగా జరుపుకునే పండుగలలో బోనాల పండుగ ఒకటి. అయితే కులాల పేరిట మను షులను వేరు చేస్తున్న తీరుకు గ్రామాల్లో జరిగే ఈ బోనాల తంతే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. తెలంగాణలోని గ్రామాల్లో ఒకటే రామాలయం, ఒకటే శివాలయం ఉంటుంది. ఇందులోకి అందరికీ ప్రవేశం ఉంటుంది. కానీ అణగారిన వర్గాలకు తరాల నుండి వస్తున్న గ్రామ దేవతల విషయంలో మాత్రం దళితులకో ప్రత్యేకమైన గుడి నిర్మాణం ఉంటుంది. ఇక్కడే మనుషులంతా సమానమనే భావనకు తూట్లు పడ్తుండటం భావి భారతానికి ప్రమాదకరమైన అంశంగానే భావించాల్సి ఉంటుంది.

ప్లేగు వ్యాధి తగ్గాలని..

బోనం అంటే భోజనం అని అర్థం. పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢం అని పేరు.. దీన్నే శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఈనెల మొత్తం తెలంగాణవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుపు కోవడం అనవాయితీ. 1813లో హైదరాబాద్- సికింద్రబాద్ జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్‌ను మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినికి నియమించారు. ఆ బెటాలియన్‌తో పాటే ఉన్న డోలీ బేరర్ సూరీటి అప్పయ్య తన సహచరులతో కలిసి ప్రజలు ఈ అంటువ్యాధి నుండి హైదరాబాద్ ప్రజలు విముక్తి పొందినట్లైయితే మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్ఠ చేస్తామని మొక్కుకున్నారు. కోరుకున్నట్లే ప్లేగు వ్యాధి తగ్గిపోవడంతో 1814లో మొదట చెక్కతో చేసిన మహంకాళి విగ్రహాన్ని ఆవిష్కరించి బోనాలు సమర్పించారు. ఈ విగ్రహావిష్కరణ ఆషాఢ మాసంలో జరిగినందున ప్రతి ఏటా ఈ మాసంలో బోనాల వేడుక జరపడం ఆనవాయితీ అయింది.

ఊరంతా బోనాలు సమర్పించాక..

మొదటి బోనం, ఆషాఢ మాసం మొదటి రోజు గోల్కొండ కోటలోని అమ్మవారి వద్ద మొదలవుతుంది. స్త్రీల సాంప్రదాయ అలంకారాలు, అమ్మవారి పూనకాలు, పోతురాజుల నృత్యాలు, కల్లు, బెల్లం శాకలతో, మట్టికుండల నైవేద్యం, పసుపు, కుంకుమ, వేపాకుల అలంకారాలతో కోలాహలంగా జరిగి శ్రావణమాసం చివరి వారంలో గ్రామాల్లో ముగుస్తుంది. గ్రామాల్లో మహంకాళీ అమ్మవారినీ ముత్యాలమ్మ, పోచమ్మగా పిలుచుకుంటారు.. ఇక్కడ మొదటి బోనాలు అగ్రకులాల వారు సమర్పిస్తారు. తరువాత కొన్ని శూద్రకులాల వారు బోనం మొక్కులు చెల్లిస్తారు.. ఊరంతా అయిపోయాక సాయంత్రానికో చీకటి అయ్యాకో మాల, మాదిగల వంతు వస్తుంది. అయితే ఊరంతా గుడిలో విగ్రహారాధన చేస్తే మాల, మాదిగలు మాత్రం గుడి పక్కన ఉన్న వీరి కులం పేరిట బండరాళ్లను అలంకరించి అవే దైవంగా భావిస్తారు. అది కూడా ఊరిలోని ప్రజలంతా వచ్చి గుడిలోని అమ్మవారికి మొక్కులు చెల్లించిన తరువాతే.. దళితులు వారి బోనాలను వారికున్న కట్టుబాట్లతో మొక్కులు చెల్లించడం నేటికీ ఉన్నటువంటి అంటరానితనం.

మానవ అభ్యుదయాన్ని చూడాలంటే..

దేశంలో కుల నిర్మూలన సాధించేందుకు అలాగే అంబేద్కర్ ఆలోచన విధానానికి రాజ్యాంగ మూల సూత్రాలకు కులాల పేరిట వేరు చేసి గ్రామాల్లో జరిగే ఈ బోనాల తంతే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. కులతత్వం, మూఢతత్వ పోకడలను అధిగమించనంత కాలం యావత్ దేశమంతా విజృంభించిన కుల మహమ్మారిని తరమనంత కాలం మానవ అభ్యుదయాన్ని చూడలేం.. త్వరలో గ్రామాల్లో జరగబోయే బోనాల పండుగవేళ ఎవరికి వారే చైతన్యులై స్వతహగా ఈ కుల వ్యవస్థను రూపుమాప గలిగితేనే రేపటి తరానికి అయినా కులరహిత సమాజాన్ని ఇవ్వగలం. ఇందుకై ప్రతి ఒక్కరూ పూనుకోవాలి.

ఓర్సు హేమలతా అశోక్

91824 75331

Next Story