- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నించొద్దు... భక్తుడిగా ఉండాలి!
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, పౌరస్పూర్తి, జవాబుదారీతనం, వ్యవస్థల బలోపేతంలో పౌరుల పాత్ర, భక్తి బాధ్యత మధ్య ఉన్న తేడా..

భారతదేశం ప్రపంచానికి ఎన్నో గొప్ప తత్వాలను ఇచ్చింది. సత్యమేవ జయతే అని రాజముద్రపై చెక్కించుకుంది. ధర్మో రక్షతి రక్షితః అని తరతరాలకు బోధించింది. అహింసా పరమో ధర్మః అని నాగరికతకు నీతి చెప్పింది. కానీ ఈ దేశం నిశ్శబ్దంగా ఇంకో మహా సిద్ధాంతాన్ని కూడా సృష్టించింది. అది రాజ్యాంగంలో లేదు. ఏ వేదంలో లేదు. ఏ చట్టం పుస్తకంలో లేదు. కానీ ఆచరణలో మాత్రం అన్నింటికంటే బలంగా అమలవుతోంది...
ఇది ఇప్పుడు ఒక వాక్యం కాదు. ఒక జీవన విధానంగా మారింది. ఇది ఒక నూతన రాజకీయ సంస్కృతిని స్థాపించింది. క్రమంగా ఒక సామాజిక అలవాటుగా మారింది. ఇది ఇప్పుడు ఒక మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక ప్రశ్నను దేని గురించి అయినా అడిగేతే వాడు అనుమానాస్పదుడు అవుతాడు. ఆధారాలు కోరేతే వాడు అసౌకర్యం కలిగించే వాడు అవుతాడు. జవాబుదారీతనం అడిగేతే వాడు ఈ వ్యవస్థకు ఇబ్బంది కలిగించే శత్రువు. కానీ నిశ్శబ్దంగా అన్నింటినీ భరించే వాడు నిజమైన దేశ భక్తుడు. అతడే ఈ దేశానికి ఆదర్శ పౌరుడు. అతడే నిజమైన దైవ భక్తుడు. అతడే అసలు సిసలు శాంతి ప్రియుడు.
విద్యామంత్రి రాజీనామానే పరిష్కారం
ఇప్పుడు జన్-జీ ఉద్యమంలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ యువకులు పరీక్ష పేపర్ల లీకేజీ విషయంలో అనేక సార్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తన పదవికి రాజీనామా చేయమని, లేదా ప్రధాన మంత్రి మోదీ అసమర్థ విద్యా శాఖ మంత్రిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి న్యాయమైన కోర్కెలకు మద్దత్తుగా సోనమ్ వాంగ్ చుక్ గత 19 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. తెగేదాక పంతానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖ మంత్రిని రాజీనామా కోరటం ఉత్తమ పరిష్కారం.
భక్తులిచ్చిన సంపదకు జవాబుదారీ ఎవరు?
మన దేశంలో ఈ ప్రశ్న అడగడం దేవుడిని అవమానించడంగా భావిస్తున్నారు. దేవుడి పేరిట ఆయన సన్నిధిలో పనిచేసే ధర్మకర్తలను, వారి అనుచరులను జవాబు దారులుగా చూస్తే తప్పు. కానీ ఇక్కడే ఒక విచిత్రం కనిపిస్తుంది. మీ జేబులోని వెయ్యి రూపాయలు పోతే మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. మీ బ్యాంకు ఖాతాలో పొరపాటు జరిగినా వెంటనే ఫిర్యాదు చేస్తారు. కానీ మీరు దానం చేసిన కోట్లాది రూపాయల వినియోగం గురించి అడగడానికి మాత్రం చాలామంది వెనుకాడతారు. ఎందుకంటే మన సమాజంలో భక్తిని కొన్నిసార్లు ప్రశ్నించకూడదు అనే అర్థం కూడా జతచేయబడింది. విశ్వాసం మనిషిని నిలబెడుతుంది. కానీ ప్రశ్నలు మాత్రమే వ్యవస్థలను నిలబెడతాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించని సమాజం, ఒక రోజు తన మౌనానికే బందీ అవుతుంది.
దేశంలో ఒక కొత్త పౌర శిక్షణా పాఠ్య పుస్తకం..
మొదటి పాఠం ప్రశ్న అడగకండి. రెండో పాఠం ఆధారాలు అడిగినవారినే అనుమానించండి. మూడో పాఠం వ్యక్తిని వ్యవస్థ కంటే పెద్దవాడిగా భావించండి. నాలుగో పాఠం విమర్శను శత్రుత్వంగా చూడండి. ఐదో పాఠం చివరికి కాలమే సమాధానం చెబుతుంది అని చెప్పి ముందుకు నడవండి. కానీ చరిత్ర మాత్రం ఇలాంటి పాఠాలను ఎప్పుడూ ఉత్తీర్ణతగా గుర్తించలేదు. ప్రజలు ప్రశ్నించడం మానేసిన ప్రతిసారీ అధికారం మరింత సౌకర్యంగా మారింది. ప్రజలు మౌనంగా ఉన్న ప్రతిసారీ అవినీతి మరింత ధైర్యంగా రెచ్చిపోతుంది. ప్రజలు వ్యక్తులను సంస్థల కంటే గొప్పవారిగా భావించిన ప్రతిసారీ ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడ్డాయి.
జెండాకు సెల్యూట్ చేయడమే దేశభక్తా?
అందుకే భక్తికి - పౌర స్పూర్తికి మధ్య తేడా తెలుసుకోవాలి. భక్తి వ్యక్తిగతం. పౌరస్పూర్తి సామాజికం. భక్తి దేవుడితో సంబంధం. పౌర స్పూర్తి రాజ్యాంగంతో, చట్టాలతో సంబంధం. దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం జెండాకు సెల్యూట్ చేయడం కాదు. దేవాలయాన్ని ప్రేమించడం అంటే కేవలం హుండీలో కానుక వేయడం కాదు. ప్రభుత్వాన్ని గౌరవించడం అంటే దాన్ని ఎప్పుడూ ప్రశ్నించకపోవడం కాదు. నిజమైన గౌరవం అంటే జవాబు చెప్పండి అని అడిగే ధైర్యాన్ని, ప్రశ్నించే అవకాశం, బాధ్యతాయుత సమాధానం వస్తుంది అనే భరోసా పౌరునికి కల్పించటం.
భక్తిని విమర్శించడానికి కాదు..
ఈ వ్యాసం ఉద్దేశం భక్తిని విమర్శించడానికి కాదు. అంధానుసరణను ప్రశ్నించడానికి, మతాన్ని అవమానించడానికి కాదు - మతం పేరుతో జవాబుదారీతనాన్ని తప్పించుకునే ధోరణిని నిలదీయడానికి. చివరగా ఒకే ప్రశ్న. ఈ దేశానికి ఇంకో రక్షకుడు కావాలా లేక ఇంకొంచెం ధైర్యంగా ప్రశ్నించే పౌరులు కావాలా? ఎందుకంటే చరిత్రలో ప్రతి గొప్ప మార్పు ఒక ప్రశ్నతోనే మొదలైంది. ప్రతి నియంతృత్వం ఒక మౌనంతోనే బలపడింది. కాబట్టి. భక్తుడిగా ఉండండి - కానీ పౌరుడిగా ఉండటం మాత్రం మరచిపోవద్దు. ఎందుకంటే ప్రశ్నలు లేని భక్తి విశ్వాసాన్ని కాపాడక పోవచ్చు. కానీ ప్రశ్నించే పౌరుడు ప్రజాస్వామ్యాన్ని మాత్రం తప్పకుండా కాపాడగలడు.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,
98493 28496






