- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DMK: 80 ఏళ్ల పోరాట పటిమ.. ఒక్క ఓటమితో ముగియదు!
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకేపై వస్తున్న విమర్శల మధ్య, ఆ పార్టీ చరిత్ర, ద్రావిడ రాజకీయాల ప్రభావం, కరుణానిధి-స్టాలిన్ నాయకత్వం, విజయ్ టీవీకే ఎదుగుదలపై కథనం

‘విజయానికి అంతా చుట్టాలే.. ఓటమి అనాథ’ అన్నట్టుగా, సోషల్ మీడియా తీర్పులు క్షణాల్లో మారుతున్న కాలంలో తమిళనాడు ఎన్నికల ఫలితాలపై కూడా అతిశయోక్తి విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాన్ని ప్రశంసించాల్సిందే. ద్రావిడ పార్టీల ఆధిపత్యంలో ఇది గమనించ దగ్గ మార్పు. అయితే అదే సమయంలో ఓడిన పార్టీల భవిష్యత్తుపై అతిగా విమర్శలు, తుది తీర్పులు ఇవ్వడం మాత్రం ఆశ్చర్యకరం.
ఒక్క ఓటమితో డీఎంకే కథ ముగిసిపోదు. 'నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తాను.. రాజకీయాల నుంచి ఎప్పటికీ విరమించుకోననే ఆశిస్తున్నాను' అంటూ చెప్పిన మాటలను కరుణానిధి తన చివరి శ్వాస వరకూ అమలు చేసి చూపించారు. కరుణానిధికే కాదు ఆయన పార్టీ డీఎంకేకు అది వర్తిస్తుంది.
80 ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తూ..
ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే)... గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు 80 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న పార్టీ. స్వాతంత్య్రం వచ్చిన ఇరవై ఏళ్లకే కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్న తొలి ప్రాంతీయ పార్టీ. దేశంలో ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చిన పార్టీ.. తమిళనాడును అన్ని రంగాల్లో ముందువరుసలో నిలిపిన పార్టీ. బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా పెరియార్ రామస్వామి నాయకర్ భావజాలాన్ని అనుగుణంగా ముందుకు సాగుతున్న పార్టీ... హిందీని బలవంతంగా రుద్దాలనుకున్నప్పుడు దానిని వ్యతిరేకించి నిలిచిన పార్టీ డీఎంకే. ఒక్క మాటలో చెప్పాలంటే అధికారంలో ఉన్నా లేకున్నా తమిళనాడును, డీఎంకేను వేర్వురుగా చూడలేం. కానీ నిన్నటి ఫలితాల తర్వాత డీఎంకే పనైపోయిందని సనాతనం మీద ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో హిందువులంతా డీఎంకే వ్యతిరేకులయ్యారని, స్టాలిన్ దుర్మార్గుడని, డీఎంకే అవినీతిని ప్రజలు తట్టుకోలేకపోయారని రకరకాల వ్యాఖ్యానాలు, పోస్టులు వెల్లువెత్తాయి. అన్నింటిలో ఇంచుమించు ఒకే రకమైన విశ్లేషణ ఉంది. నిజం చెప్పాలంటే 99 శాతం పోస్టులు ఒకరి నుంచి మరొకరికి ఫార్వర్డ్ అయినవి.. ఇందులో విశ్లేషణ కన్నా విషం చిమ్మడమే ఎక్కువ.
జస్టిస్ పార్టీ నుంచి ఆవిర్భవించి..
పెరియార్‌తో విభేదించి 1949లో అన్నాదొరై డీఎంకేను స్థాపించారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే తమదైన అస్తిత్వం, ఆత్మగౌరవానికి తమిళులు పోరాడారు. అలా పుట్టుకొచ్చిన జస్టిస్ పార్టీ.. ద్రావిడ కళగం నుంచి డీఎంకే ఆవిర్భవించింది. తొలి నుంచి సినిమాల ప్రభావం తమిళ రాజకీయాలపై ఉంది. తొలుత ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే 1967 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చింది. అన్నాదొరై ముఖ్యమంత్రి అయ్యారు. 1969లో అన్నాదొరై మరణంతో పార్టీ పగ్గాలు కరుణానిధి చేపట్టారు. కరుణానిధి తర్వాత డీఎంకే నుంచి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. అన్నాదొరై, కరుణానిధి, స్టాలిన్ ముగ్గురూ పోరాటాల నుంచే ఎదిగిన నాయకులు. అన్నాదొరై పెరియార్ శిష్యుడు అయినప్పటికీ విభేదాల కారణంగా డీకే నుండి వేరుపడి డీఎంకేను స్థాపించారు. ఆయన తమిళనాడు పేరును తీసుకురావడం, ఆత్మగౌరవ వివాహాలను ప్రోత్సహించడం వంటి సంస్కరణలు చేపట్టారు. కరుణానిధి పేదల సంక్షేమం, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్టాలిన్ కూడా కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగి పరిపాలనలో తన ముద్ర వేశారు. అయితే నవతరం మాత్రం ఇప్పుడు విజయ్ వైపు మొగ్గుచూపడంతో రాజకీయ సమీకరణాలు మారాయి.
ఘోర పరాజయాలు, విజయాలు మామూలే..
అన్నాదొరై.. కరుణానిధి.. స్టాలిన్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ డీఎంకే వరుస విజయాలను పెద్దగా సాధించలేదు. ప్రతి దశలో దాన్ని ఓడించే కొత్త శక్తులు ఎదిగాయి. డీఎంకేలోనే ఎదిగిన నటుడు ఎం.జి రామచంద్రన్ విభేదాలతో అన్నాడీఎంకే స్థాపించి 1977, 1980, 1984 ఎన్నికల్లో డీఎంకేను ఓడించారు. కరుణానిధి సమర్థుడైన నాయకుడు, గొప్ప వక్త అయినప్పటికీ ఎంజీఆర్‌కి నటునిగా ఉన్న ఆదరణ ముందు కరుణానిధి తలవంచక తప్పలేదు. కరుణానిధి 13 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో కూడా పార్టీని కాపాడి 1989లో తిరిగి అధి కారంలోకి తీసుకొచ్చారు. తర్వాత జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ఎదిగినా, డీఎంకే మళ్లీ మళ్లీ పుంజుకుంది. 1991లో కేవలం రెండు అసెంబ్లీ సీట్లకే పరిమితమైన డీఎంకే, 1996లో ఘన విజయం సాధించింది. 2011లో మూడో స్థానానికి పడిపోయినా, 2021లో తిరిగి అధికారంలోకి వచ్చింది. డీఎంకే చరిత్ర చూస్తే ఘోర పరాజయాలు, అద్భుత విజయాలు పరస్పరం వెంటాడుతూ వచ్చినట్టే కనిపిస్తుంది. ప్రతి అస్తమయం తర్వాత తన గుర్తు ఉదయించే సూర్యునిలా డీఎంకే తిరిగి విజయాల బాట పట్టింది.. ఆ పార్టీకి ఉన్న పోరాట పటిమ, సమర్థ నాయకత్వం.. కార్యకర్తల బలాన్ని గమనిస్తే ప్రస్తుత పరాజయ చీకట్లను పారద్రోలి మళ్లీ ఉదయ సూర్యుడు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
-అర్జున్,
80763 80427






