పాత్రికేయ ప్రస్థానం@20: అక్షరం ఆగదు... దిశ మారదు...

by D.Markandeya |
పాత్రికేయ ప్రస్థానం@20: అక్షరం ఆగదు... దిశ మారదు...
X

వినాయక చవితి పండుగ రోజు. సంస్థకు సెలవు ప్రకటించినప్పటికీ స్వచ్ఛందంగా పనిచేస్తామన్న డజను మంది స్టాఫ్‌తో స్పెషల్ ఎడిషన్ తెద్దామనే ప్రయత్నంలో సాయంత్రం ఆఫీసుకు వెళ్లాను. ఏడు గంటల సమయంలో మిత్రుడు గోపాల్ కాల్ చేశాడు. ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూలు ఫస్ట్ బ్యాచ్ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం. నువ్ వస్తావా? అన్నాడు. నేను యెస్ చెప్పాను. ఆ వెంటనే ఆ బ్యాచ్ వాట్సాప్ గ్రూపులో నన్ను యాడ్ చేశాడు.

ఎలా చేద్దాం? ఎక్కడ చేద్దాం? అప్పటి గురువులను పిలుద్దామా? వద్దా? వంటి చర్చలు నడిచాయి. ఇప్పుడందరూ వేర్వేరు సంస్థలలో పనిచేస్తున్నందున, పిలవాల్సిన గురువులు కూడా వేర్వేరు పొజిషన్‌లలో ఉన్నందున తాము పనిచేస్తున్న మీడియా యాజమాన్యాల వైఖరికి జంకిన కొందరు పిలువద్దని అభిప్రాయపడగా, అలాంటి ఇబ్బంది లేని మరికొందరు పిలువడానికి ఓటేశారు. ఈ రోజే హైటెక్ సిటీలోని ఓ హోటల్‌లో కలుద్దామనుకున్నాం.

ఎన్నో జ్ఞాపకాలు..

ఈ చర్చ నన్ను పాత జ్ఞాపకాలలోకి తీసుకెళ్లింది. 1983లో డిగ్రీ పూర్తి చేసిన వెంటనే నేను విప్లవోద్యమంలోకి ఫుల్ టైమర్‌గా వెళ్లాను. సుమారు 17 ఏళ్ల తర్వాత దండకారణ్యం నుంచి జనారణ్యంలోకి ప్రవేశించాను. ఐదు నెలల జైలు జీవితం తర్వాత నాపై మోపిన అన్ని కేసులలో బెయిల్ పొంది 2001 ఫిబ్రవరిలో బయటకు వచ్చాను. మావోయిస్టు పార్టీలో నేను నేర్చుకున్న రాజకీయ, భాషా జ్ఞానాలను వినియోగించుకుని జర్నలిజాన్ని వృత్తిగా స్వీకరించాను.

రచన కళాశాలలో బీసీజే పూర్తి చేసి, ఉస్మానియా క్యాంపస్‌లో ఎంసీజేలో చేరాను. మూతపడిన ఆంధ్రజ్యోతిని 2002 సెప్టెంబర్‌లో వేమూరి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో పున:ప్రారంభిస్తున్నారని తెలిసి వెళ్లి కలిశాను. నా గురించి చెప్పాను. ఆయన స్పందించి నన్ను అప్పటి ఎడిటర్ రామచంద్రమూర్తి సార్, శేఖర్‌రెడ్డి సార్‌‌లకు అప్పగించారు. అలా ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల విద్యార్థిగా 2002 సెప్టెంబర్ 5న నా జర్నలిస్టు కెరీర్‌ ప్రారంభమైంది.

అక్కడే మెళకువలు..

అదే సంవత్సరం అక్టోబర్ 15న పత్రిక ప్రారంభం కాగా, 9 నెలల పాటు సెంట్రల్ డెస్క్‌ లో పనిచేశాను. అక్కడ ఇప్పటి ఎడిటర్ శ్రీనివాస్ సార్, సాక్షి ఎడిటర్ మురళి సార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లమన్న తదితర సీనియర్ జర్నలిస్టుల నుంచి వృత్తిపరమైన మెళకువలను నేర్చుకున్నాను. మావోయిస్టు పార్టీలో ఉన్నప్పుడు వ్యాస రచయితగా, అనువాదకుడిగా పనిచేసిన అనుభవం నాకు బాగా ఉపయోగపడింది.

2003 జూన్‌లో నన్ను కరీంనగర్ యూనిట్‌కు బదిలీచేశారు. ఇది నా జర్నలిస్టు జీవితానికి కీలక మలుపైంది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి చక్కని అవకాశం దొరికింది. అనతికాలంలోనే కరీంనగర్ డెస్క్ ఇన్‌చార్జిగా, ఆ వెంటనే రెండు జిల్లాల (కరీంనగర్, ఆదిలాబాద్) ఎడిషన్ ఇన్‌చార్జిగా ప్రమోటయ్యాను. అక్కడ పనిచేసిన ఐదున్నరేళ్ల కాలంలో నాకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాను. 2009 ప్రారంభంలో ఏబీఎన్ చానెల్ కోసమని నన్ను హైదరాబాదుకు రప్పించారు. సంస్థ అవసరాల మేరకు తిరిగి పేపర్‌కే వచ్చి సిటీబ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాను.

కీలక మలుపు..

2010 ఆగస్టు మొదటివారంలో శేఖర్‌రెడ్డి సార్ నుంచి కాల్ వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి దన్నుగా కేసీఆర్ ఒక దినపత్రిక పెడుతున్నారని, లీడింగ్ టీంలో జాయిన్ కావాలని కోరారు. మరేమీ ఆలోచించకుండా నేను ఓకే చెప్పాను. పని చేస్తున్నది ఓ పెద్ద పత్రిక అయినా, సరిపోయేంత వేతనం వస్తున్నా, సంస్థ ఎండీకి నాపై ఎనలేని విశ్వాసం ఉన్నా నేను నమస్తే తెలంగాణ (అప్పటికి ఆ పేరు ఖరారు కాలేదు) వైపే మొగ్గు చూపాను.

ఉద్యమ పత్రికగా వస్తున్నది కనుక నా భావాలను ప్రజలతో పంచుకోవడానికి అవకాశాలు దొరుకుతాయని ఆశించడం మొదటి కారణం. జర్నలిస్టు కెరీర్‌లో నాకు గురువులుగా, మార్గదర్శకులుగా, విమర్శకులుగా, మిత్రులుగా ఉన్న శేఖర్‌రెడ్డి సార్, అల్లమన్న తోడుండడం రెండవ కారణం.

రాష్ట్రమంతా తిరిగి..

తర్వాతి కాలంలో నెట్‌వర్క్ ఇన్‌చార్జిగానే 'నమస్తే తెలంగాణ'లో చిరపరిచితుడనయ్యాను. పత్రికలో నేను పనిచేసిన ఏడేళ్ల కాలంలో ప్రతి జిల్లాకు కనీసం 30 సార్లయినా వెళ్లుంటాను. అలా కిందిస్థాయిలో పనిచేసే అనేకమంది రిపోర్టర్లతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. నెట్‌వర్క్ అంతా బలమైన టీమ్‌గా రూపుదిద్దుకుంది. మేనేజ్‌మెంట్ సహకారంతో ఉద్యమకాలంలో పత్రిక మనుగడ కోసం అడ్వర్‌టైజ్‌మెంట్స్ చేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత పేపర్‌ను రాష్ట్రంలో నంబర్ వన్ చేయాలన్న లక్ష్యంతో సర్క్యులేషన్‌ పెంచాం.

ఎడిటోరియల్ పరంగా కూడా అనేక మార్పులు తెచ్చాం. పేజీల సంఖ్య పెంచాం. కొత్త శీర్షికలను, ఫీచర్లను ప్రారంభించాం. స్థానిక వార్తల కోసం నియోజకవర్గాల పేజీలను ప్రవేశపెట్టాం. కొత్త రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజాభిప్రాయాన్ని, అన్ని పార్టీల, ప్రజాసంఘాల వార్తలను ప్రముఖంగా ప్రచురించాం.

పరిమితులు ఆంక్షలుగా మారి..

తెలంగాణ సాకారమైన తర్వాత పత్రిక యాజమాన్యంలో మార్పు జరిగింది. కొత్త యాజమాన్యం వార్తల, వ్యాసాల ప్రచురణలో పరిమితులు విధించసాగింది. ఈ పరిమితులు కాస్తా తర్వాతికాలంలో ఆంక్షలుగా మారి, అధికార పక్షం వార్తలు తప్ప మరే వార్తలూ పెట్టవద్దనే స్థాయికి చేరింది. ఏ పత్రిక యాజమాన్యానికైనా కొన్ని అభిప్రాయాలూ, ఆబ్లిగేషన్లూ ఉండడం సహజం. అర్థం చేసుకోవచ్చు. అయితే, అవి దినపత్రిక సహజ లక్షణానికి విరుద్ధంగా ఉండకూడదన్నది జర్నలిజం మౌలిక సూత్రం. అది మర్చిపోతే పాఠకులలో పత్రిక విశ్వసనీయత తగ్గిపోతుంది.

అప్పుడు ఏదైనా విషయాన్ని పేజీలకు పేజీలు రాసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇదే విషయాన్ని నేను, మరికొంత మంది సీనియర్లం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి విషయాలలో సహజంగానే నేను కొంత ఎక్కువ చొరవ చూపాను. పత్రికా స్వేచ్ఛపై నాకున్న అభిప్రాయాల వలననూ, వివిధ వర్గాలకు, పార్టీలకు సంబంధించిన పాఠకులలో నెట్‌వర్క్ ఆధ్వర్యంలో సంవత్సర చందాలు భారీగా చేయించిన కారణంగానూ ఈ వైఖరి నాకు అనివార్యమైంది. అయితే, ఇదే నా ఉద్యోగం ఊడిపోవడానికి కారణమైంది. 2017 ఆగస్టులో నేను సంస్థ నుంచి నిష్క్రమించాను.

వెంటాడిన పెద్దలు..

ఆ వెంటనే దమ్మున్న ఓ మీడియాలో అవకాశం వచ్చినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో చేజారింది. చిన్నదైనా సరే అని మరో పేపర్‌లో చేరడానికి యత్నిస్తే, ఏకంగా ఆ సంస్థనే టేకోవర్ చేసి ఎడిటర్‌ను మార్చారు. గత్యంతరం లేక, బతకడం కష్టమై కరీంనగర్ జిల్లాలోని మా గ్రామానికి షిఫ్టయి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాను. ఏడాదిన్నర తర్వాత డిజిటల్ మీడియా రూపంలో ఒక అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. 'మన తెలంగాణ' అప్పటి ఎండీ మోహన్‌రావు గారు ఒక వెబ్‌సైట్‌ను నడిపిద్దామని ప్రతిపాదించారు.

జియో తర్వాత పట్టణాలలో, పల్లెలలో బద్దలైన సాంకేతిక విప్లవంపై నాకు అప్పటికే స్పష్టమైన అభిప్రాయాలు ఉండడం వలన వెంటనే ఒప్పుకున్నాను. ఇద్దరం చాలా విషయాలలో ఏకాభిప్రాయానికి వచ్చాం. 'భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరిగినట్లే, మనిషి ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతూ, స్మార్ట్ ఫోన్ చుట్టూరా తిరుగుతున్నాడని' గ్రహించాం. సాంప్రదాయక ప్రింట్ మీడియాకు ప్రాధాన్యం తగ్గుతోందని, డిజిటల్ రీడర్‌షిప్ వేగంగా పెరుగుతోందని గుర్తించాం. వెబ్‌సైట్‌తో పాటు ఒక డిజిటల్ పేపర్‌ను, యూట్యూబ్ చానెల్‌ను ప్లాన్ చేశాం. 2019 సెప్టెంబర్‌లో మా ఆచరణ మొదలైంది.

దూసుకెళ్లిన దిశ..

ఆ తర్వాత ఏం జరిగిందో చాలా మందికి తెలుసు. 2020 మార్చ్ 7న ప్రారంభమైన దిశ మీడియా కేవలం రెండేళ్ల కాలంలోనే తెలుగునాట ప్రధాన పత్రికల సరసన చేరింది. ఏ పార్టీకీ, ఏ వర్గానికీ కొమ్ము కాయకుండా సత్యానికి కట్టుబడి, సొంత అస్తిత్వాన్ని కాపాడుకుంటూ విజయవంతంగా ముందుకు సాగుతోంది.

తెలంగాణ, ఏపీ మార్నింగ్ ఎడిషన్లతో పాటుగా రోజుకు మూడుసార్లు డైనమిక్ ఎడిషన్లను ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ప్రపంచంలోని 192 దేశాలలో విస్తరించివున్న తెలుగు ప్రజలలో మూడు కోట్లకు పైగా యూనిక్ యూజర్ బేస్‌ను 'దిశ' కలిగివుంది. నిత్యం లక్షలాది మంది పాఠకులు మా మీడియాను దర్శిస్తున్నారు. ప్రకటనకర్తలు సైతం ఆదరిస్తున్నారు.

ఎందరిదో ఆ క్రెడిట్..

'దిశ' సక్సెస్‌కు కారణాలు అనేకం. అందులో నా పాత్ర కీలకమే అయినా ఆ క్రెడిట్ చాలా మంది ఖాతాలో వేస్తాను. మొదటిది, ఎండీ మోహన్‌రావు గారు. 'దిశ' సృష్టికర్త ఆయనే. తనకున్న ఆర్థిక వనరులు పరిమితమే అయినా, సామాజిక బాధ్యత, జర్నలిజం పట్ల మక్కువతో ఆయన ఈ రిస్క్ తీసుకున్నారు. ఆయన పట్టుదల, ప్రోత్సాహమే లేకపోతే సంస్థ ఈరోజు ఈ పొజిషన్‌లో ఉండేది కాదు. ఇన్ని ప్రయోగాలు జరిగేవే కావు. రెండవది, వృత్తి పట్ల నిబద్ధతను కలిగివున్న సీనియర్లు, జూనియర్‌లతో కూడిన లీడింగ్ టీం. ఎలాంటి క్లిష్టతరమైన టాస్క్ అప్పగించినా చేయగలిగే కసి, తెగువ ఉన్న అక్షరసైన్యం.

అందరికీ వందనం..

చివరిదీ, అత్యంత ప్రాధాన్యం కలిగినదీ మరోటి ఉంది. 20 ఏళ్ల నా జర్నలిస్టు జీవితంలో తారసపడిన, కలిసి పనిచేసిన ఎండీలు, ఎడిటర్ల నుంచి మొదలు అనునిత్యం ఫీల్డులో తిరుగుతూ ప్రజలలో పనిచేసే కంట్రిబ్యూటర్ల వరకు అనేకమంది జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల నుంచి నేను పొందిన జ్ఞానం, పాజిటివ్, నెగెటివ్ అనుభవాల పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. దమ్మున్న వార్తలకు ఫేమస్‌ అయిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారి నుంచి నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో నేర్చుకున్నాను. ఈరోజు 'దిశ' సక్సెస్‌లో ఆయన నుంచి నేను పొందిన స్ఫూర్తి దాగివుందంటే అతిశయోక్తి కాబోదు.కష్టసమయంలో 'నమస్తే తెలంగాణ'ను ఆదుకున్న సంస్థ సీఎండీ సీ‌ఎల్ రాజంగారి నుంచి నేను నేర్చుకున్నది తక్కువేం కాదు. తెలంగాణ మీడియా అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఎంత ఖర్చుకైనా వెనుదీయని ఆయన తత్వం నాకు నచ్చింది.

ప్రతి విషయాన్నీ సూక్ష్మ పరిశీలన చేసే రామచంద్రమూర్తి గారు, ఎంత బిజీగా ఉన్నా జనం నచ్చి మెచ్చే శీర్షికలు క్షణాలలో చెప్పే వర్ధెల్లి మురళి సార్, నిండుకుండ తొణకదన్నట్లుగా సముద్రమంత జ్ఞానం ఉన్నా తక్కువ మాట్లాడే శ్రీనివాస్ సార్, జర్నలిజాన్ని ఉద్యమబాట పట్టించిన అల్లమన్నకు నేను సదా రుణపడివుంటాను. ఇక శేఖర్‌రెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2002 నుంచీ ఆయన నా వెన్నంటే ఉన్నారు. సైద్ధాంతిక, రాజకీయ ఘర్షణలు, రోజువారీ గొడవలెన్ని ఉన్నా, ఆయన నాకు గురువు, మిత్రుడు, విమర్శకుడు, సలహాదారుడు, ఆప్తుడు కూడా.

చివరగా, ఈ 20 ఏళ్లలో నాతో కలిసి పనిచేసిన మిత్రులందరికీ సదా కృతజ్ఞుడిని. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షంతవ్యున్ని. వివిధ మీడియాలలో, ఇతర రంగాలలో పని చేస్తున్న అప్పటి నా బ్యాచ్ మిత్రులందరికీ ఈ సందర్భంగా ద్విదశాబ్ది వార్షికోత్సవ శుభాకాంక్షలు.

డి. మార్కండేయ

[email protected]


Next Story

Most Viewed